logo

పింఛన్ల పెంపు చరిత్రలో నిలిచి పోతుంది: మంత్రి బీసీ

పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 02 Jul 2024 04:15 IST

దివ్యాంగుడికి పింఛన్లు అందజేస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లి, న్యూస్‌టుడే: పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఆరు గంటలకే బనగానపల్లి పట్టణంలోని తెలుగుపేటలో ఇంటింటికీ వెళ్లి సామాజిక పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. సుమారు రెండు గంటల పాటు కాలనీలో తిరిగి ప్రతి ఇంటికీ వెళ్లి దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులను కలిసి నేరుగా పింఛన్లను అందజేశారు. నడవలేని వారి దగ్గకు వెళ్లి వారి ఇంటి మెట్లపైనే మంత్రి కూర్చొని పింఛన్లను అందించారు. అనంతరం పింఛనుదారులతో కలసి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ గత రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడారని అన్నారు. ప్రజలు నమ్మి 2019లో 151 సీట్లు వైకాపాకు కట్టబెడితే కక్షపూరిత పాలన చేసి ప్రజలు ఛీకొట్టే స్థాయికి వెళ్లారని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధిని సమానంగా చేస్తారని, ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా ఈ రోజు రూ.7 వేల పింఛన్ల మొత్తాన్ని అందించారని తెలిపారు. వచ్చే నెల నుంచి ప్రతి నెలా రూ.4వేలు ఇస్తామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హిమాలయాలకు వెళ్తే ఇక్కడ ఉన్న మిగిలిన వైకాపా ఎమ్మెల్యేలు సంతోషంగా ఉంటారని, ఆయన హిమాలయాలకు వెళ్తే బాగుంటుందని ప్రజలు కూడా కోరుకుంటున్నారని తెలిపారు.  త్వరలోనే డీఎస్సీకి చర్యలు తీసుకుంటారని, అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపించే సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబేనని వెల్లడించారు. ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని