logo

నిర్లక్ష్యం విత్తుకుంది

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు 6.30 లక్షల హెక్టార్లు కాగా అందులో పత్తి 2.70 లక్షల హెక్టార్లు, మిర్చి 50 వేల హెక్టార్లకుపైగా సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా.

Updated : 01 Jul 2024 05:13 IST

నమూనాల సేకరణలో అధికారుల విఫలం
ఏటా తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలు

కర్నూలులోని విత్తన విక్రయ దుకాణంలో తనిఖీ చేస్తున్న అధికారులు (పాత చిత్రం)

ఉమ్మడి కర్నూలు జిల్లాలో విత్తన నమూనాల సేకరణ అంతంతమాత్రంగానే ఉంది. మే నెలలో సేకరణ ప్రారంభించాల్సి ఉండగా ఇప్పటివరకు 10 శాతం కూడా చేయలేదు. నాణ్యమైనవి విక్రయిస్తున్నారా.. నాసిరకం విత్తనాలు రైతులకు అంటగడుతున్నారా.. అని అధికారులు ఆరా తీయాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. వారి నిర్లక్ష్యంతో ఏటా రైతులు నష్టపోతున్నారు.

కల్లూరు మండల పరిధిలో 500కుపైగా విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల విక్రయ దుకాణాలున్నాయి. ఇక్కడ విత్తన నమూనాల సేకరణ అంతంత మాత్రంగానే ఉంది. జిల్లా కేంద్రం చుట్టుపక్కల మండలాల రైతులు గత మూడు నెలలుగా విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. విత్తనా నాణ్యతను పరీక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు 6.30 లక్షల హెక్టార్లు కాగా అందులో పత్తి 2.70 లక్షల హెక్టార్లు, మిర్చి 50 వేల హెక్టార్లకుపైగా సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. మిర్చి ఎక్కువ భాగం సంకర విత్తనాలు కావడంతో ప్రైవేటు కంపెనీలు ఉత్పత్తి చేసి విక్రయిస్తాయి.  కిలో రూ.లక్షకు పైగా ధర పలుకుతున్న విత్తనాలు ఉన్నాయి. మరోవైపు బీటీ పత్తి అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రైవేటు కంపెనీలు ఉత్పత్తి చేసిన విత్తనాలనే రైతులు కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విత్తనాల నాణయతపై ఏటా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. వీటన్నింటికీ అడ్డుకట్ట పడాలంటే మే, జూన్‌ నెలల్లో వ్యవసాయ శాఖ అధికారులు విత్తన దుకాణాల్లో నిత్యం తనిఖీ చేస్తూ నమూనాలు తీసి పరీక్షించాల్సి ఉంది. కానీ చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

యథేచ్ఛగా విక్రయాలు

వేసవిలో పత్తి సాగు చేసే రైతులు తెలంగాణ జిల్లాల నుంచి ముందస్తుగా విత్తన విక్రయ దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేస్తారు. నర్సరీల్లో విత్తనాలు పెంచే నర్సరీ యజమానులు, నీటి సౌకర్యం కలిగిన రైతులు మిరప విత్తనాలను ముందస్తుగా కొంటారు. కర్నూలు జిల్లాలో అనుమతి లేని పత్తి విత్తనాల విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఉల్లి, మిరప, పత్తి, కందులు, వరి, తదితర విత్తనాలను 90 శాతం మంది రైతులు కొనుగోలు చేశారు. నమూనాల సేకరణ జాడ కనిపించని పరిస్థితి.

నష్టపరిహారమేదీ..

2021లో కావేరీ జాదు పత్తి విత్తనాల కారణంగా ఉమ్మడి జిల్లాలోని చాలామంది రైతులు నష్టపోయారు.  2022లో  నాసిరకం విత్తనాలతో అపార నష్టం జరిగింది. 2023లో తెల్ల బంగారం సాగు చేయగా తీవ్ర వర్షాభావంతో పత్తి పంట పండని పరిస్థితి నెలకొంది.

బదిలీల హడావుడితో...

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరుణంలో బదిలీలు జరుగుతాయన్న ప్రచారంతో కొందరు వ్యవసాయాధికారులు విత్తన నమూనాల సేకరణను పక్కన పెట్టేశారు. ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు తెచ్చుకోవడం, ఇతరత్రా కార్యకలాపాల్లో మునిగిపోయారు. అధికారులు పట్టించుకోకపోవడంతో కొందరు వ్యాపారులు నాణ్యత లేని విత్తనాలు రైతులకు అంట గడుతున్నారు.

అగ్రిల్యాబ్‌లు ఏర్పాటుచేసినా..

ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటుచేసిన అగ్రిల్యాబ్‌లతో ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఈ ల్యాబ్‌లలో పరీక్షలు అంతంత మాత్రంగానే  జరుగుతున్నాయి. కర్నూలు జిల్లాలో గూడూరు, పత్తికొండ, ఆదోని, మంత్రాలయం, ఆలూరులో అగ్రి ల్యాబ్‌లు ఉండగా.. ఎమ్మిగనూరులో జిల్లా స్థాయి అగ్రిల్యాబ్‌తో కలిపి మొత్తం ఆరు ఉన్నాయి. 2023-24 సంవత్సరంలో 740 విత్తన నమూనాలు, ఎరువులకు సంబంధించి 260 నమూనాలు మాత్రమే పరీక్షించారు.

  • నంద్యాల జిల్లాలో ఏడు నియోజకవర్గ అగ్రి ల్యాబ్‌లకుగాను ఐదు నిర్మాణాలు పూర్తయ్యాయి. అందులో నంద్యాల, ఆళ్లగడ్డలో మాత్రమే ల్యాబ్‌లు వినియోగంలో ఉన్నాయి. 2023-24 సంవత్సరంలో 587 సీడ్‌ శాంపిల్స్, 218 ఎరువుల నమూనాలు కలిపి మొత్తం 805 మాత్రమే పరీక్షించారు.
  • 2024-25 సంవత్సరంలో ఖరీఫ్‌ సీజన్‌లో పత్తి, మిరప, ఇతర విత్తన నమూనాలు 960, రబీ సీజన్‌లో 540 కలిపి మొత్తం 1,500 నమూనాలు కర్నూలు జిల్లాలో సేకరించాలని లక్ష్యాలు నిర్దేశించారు. నంద్యాల జిల్లాలో 1,200 విత్తన నమూనాల లక్ష్యాలను నిర్దేశించారు. గడిచిన రెండు నెలల్లో పరిశీలిస్తే పెద్దగా సేకరించిన దాఖలాలు లేవు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు