logo

ఆనందం.. కనిపింఛన్‌

ఉమ్మడి కర్నూలు జిల్లాలో సామాజిక పింఛన్ల పండగకు సర్వం సిద్ధమైంది. సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో పింఛనుదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందించేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Updated : 01 Jul 2024 05:16 IST

నేడు ఇంటింటికి పంపిణీ

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే : ఉమ్మడి కర్నూలు జిల్లాలో సామాజిక పింఛన్ల పండగకు సర్వం సిద్ధమైంది. సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో పింఛనుదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందించేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 1వ తేదీన అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పింఛను అందించాలని రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఒక్క రోజులోనే వంద శాతం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే సచివాలయ సిబ్బంది శనివారం బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసుకుని సిద్ధం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పింఛను మొత్తం రూ.4 వేలతోపాటు ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించి బకాయిలు రూ.3 వేలతో కలిపి మొత్తం రూ.7 వేలు అందించనున్నారు.

ఉదయం 6 గంటలకే ప్రారంభం..

1వ తేదీ ఉదయం 6 గంటలకే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పింఛను నగదుతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖను లబ్ధిదారులకు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో సామాజిక పింఛను మొత్తం పెంచుతామంటూ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని అమలుచేస్తుండటంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పింఛను మొత్తాన్ని రూ.4 వేలకు పెంచడంతో అవ్వాతాతల్లో ఆనందం నెలకొంది. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో మొత్తం 4.02 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారు. వారిలో వృద్ధాప్య పింఛనుదారులే 2.41 లక్షల మంది ఉన్నారు.


పార్టీ శ్రేణులు పాల్గొనాలి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పింఛన్ల పంపిణీలో భాగస్వాములు కావాలని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కర్నూలు నగరంలో సోమవారం ఉదయం 5.40 గంటలకు సామాజిక పింఛను లబ్ధిదారులకు సొమ్ము పంపిణీ చేసేందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. ఇప్పటికే  తనతోపాటు ఎమ్మెల్సీ బీటీ నాయుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పార్టీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, నాయకులు, కార్యకర్తలు కలిసి లబ్ధిదారులకు పింఛన్లు అందించనున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు