logo

ఎన్నికల సామగ్రికి ఎసరు

ఎన్నికల నిర్వహణ కోసం తెప్పించిన సామగ్రిని ఓ అధికారి ఇంటికి తరలించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నంద్యాల నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి అవసరమైన కంప్యూటర్లు, బల్లలు, సోఫాలు కొనుగోలు చేశారు.

Published : 01 Jul 2024 02:52 IST

కంప్యూటర్, ఇతర వస్తువులు ఇంటికి తరలింపు
నంద్యాలలో ఓ రెవెన్యూ అధికారి చేతివాటం

నంద్యాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : ఎన్నికల నిర్వహణ కోసం తెప్పించిన సామగ్రిని ఓ అధికారి ఇంటికి తరలించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నంద్యాల నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి అవసరమైన కంప్యూటర్లు, బల్లలు, సోఫాలు కొనుగోలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగియగానే వీటిని ఓ అధికారి గుట్టుచప్పుడు కాకుండా తన ఇంటికి తరలించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ వ్యవహరం ప్రస్తుతం రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది.

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా నంద్యాల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాన్ని హడావుడిగా సిద్ధం చేశారు. తహసీల్దారు కార్యాలయం కోసం చేపట్టిన నూతన భవన నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. ఎన్నికల సమయంలో దానిని పూర్తి చేసి ఆర్వో కార్యాలయం ఏర్పాటు చేశారు. నూతన భవనం కావడంతో అవసరమైన సామగ్రి కొనుగోలు చేశారు. కంప్యూటర్లు, బల్లలు, ఏసీలతోపాటు వివిధ రకాల ఫర్నీచర్‌ తెప్పించారు. గత నెల 4వ తేదీన ఎన్నికల క్రతువు ముగిసిన కొద్దిరోజులకే నూతనంగా కొనుగోలు చేసిన ఫర్నీచర్‌పై సదరు అధికారి కన్నుపడింది. ఉన్నతాధికారులకు తెలియకుండానే సామగ్రిని ఇతర జిల్లాలోని తన నివాసానికి తరలించారు.

కక్కుర్తి పడి..

నంద్యాల ఆర్వో కార్యాలయానికి రూ.50 వేల విలువ చేసే కంప్యూటర్, రూ.35 వేలతో సోఫాసెట్, రూ.50 వేల విలువ చేసే ఏసీతో పాటు బల్లలు, కుర్చీలు కొనుగోలు చేశారు. పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగంతో పాటు ఇతర అవసరాల కోసం నియోజకవర్గంలోని 286 పోలింగ్‌ కేంద్రాలకు అవసరమైన స్టీల్‌ డబ్బాలను పెద్దఎత్తున కొనుగోలు చేశారు. వీటన్నింటి విలువ రూ.లక్షల్లోనే ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ ముగిశాక ఆ సామగ్రి కార్యాలయం నుంచి మాయమైంది. నిబంధనల మేరకు వీటిని ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోగానీ.. రెవెన్యూ కార్యాలయంలో వినియోగించాల్సి ఉంది. సదరు కక్కుర్తి అధికారి సుమారు రూ.5 లక్షల విలువైన వాటిని సొంతానికి తీసుకెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కార్యాలయంలో ఓ ఏసీ ఉంది. దానిని కూడా మరో అధికారి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీటితో పాటు కార్యాలయంలో ఉన్న మరికొన్ని కంప్యూటర్లను వివిధ ప్రాంతాలకు తరలించారని సమాచారం.

ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.లక్షలు వెచ్చించి ఫర్నీచర్, ఇతర సామగ్రి కొనుగోలు చేశారు. ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో వాటిని కార్యాలయాల అవసరాల నిమిత్తం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో పక్కదారి పట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని