logo

నాటు ఘాటెక్కింది

ఉమ్మడి కర్నూలు జిల్లాలో నాటు సారా ఘాటెక్కింది. వివిధ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తయారుచేస్తున్నారు. అధికారులు తనిఖీలు చేయలేక చేతులెత్తేశారు.

Published : 01 Jul 2024 02:49 IST

గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా తయారీ
నియంత్రించడంలో విఫలం
న్యూస్‌టుడే, కర్నూలు నేరవిభాగం

నాటు సారాను ధ్వంసం చేస్తున్న కర్నూలు సెబ్‌ సిబ్బంది

ఉమ్మడి కర్నూలు జిల్లాలో నాటు సారా ఘాటెక్కింది. వివిధ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తయారుచేస్తున్నారు. అధికారులు తనిఖీలు చేయలేక చేతులెత్తేశారు. తమిళనాడు రాష్ట్రంలో నాటు సారా తాగి 54 మంది మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎందరో పేదలు సారాకు బానిసలయ్యారు. గడిచిన ఐదేళ్లలో వైకాపా అనాలోచిత నిర్ణయాల కారణంగా నాటు సారా తయారీ విపరీతంగా పెరిగిపోయింది. డబ్బులు వెచ్చించి మద్యం కొనుగోలు చేయలేక సారాకు బానిసలయ్యారు. పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు అనారోగ్యం పాలయ్యారు.

ధరలు పెంచేసి..

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యపాన నిషేధం అమలుచేస్తామని గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే మద్యం ధరలు అమాంతం పెంచేశారు. చీప్‌ లిక్కర్‌ క్వార్టర్‌ సీసా ధరను రూ.50 నుంచి రూ.140కు పెంచారు. పైగా ఎప్పుడూ చూడని.. వినని బ్రాండ్లు తీసుకొచ్చారు.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఇవి మాత్రమే విక్రయించేలా ఆంక్షలు విధించారు. నాసిరకం మద్యం అంటూ మందుబాబులు గగ్గోలు పెట్టినా ఏమాత్రం ఖాతరు చేయలేదు. క్వార్టర్‌ సీసా రూ.140 పెట్టి కొనుగోలు చేయలేక పలువురు నాటు సారాకు అలవాటుపడ్డారు. ఇదే అవకాశంగా పలు తండాలు, పల్లెల్లో నాటుసారా తయారీ పెరిగిపోయింది.   చివరికి నియంత్రించలేని స్థాయికి చేరుకుంది. కర్ణాటక రాష్ట్రం నుంచి మద్యంతోపాటు నాటు సారా అక్రమ రవాణా పెరిగిపోవడంతో ఎక్సైజ్‌  అధికారులు సైతం చేతులెత్తేశారు.

ఆపరేషన్‌ పరివర్తన విఫలం

ఉమ్మడి జిల్లాలో 180 వరకు నాటు సారా ప్రభావం ఉన్న ప్రాంతాలున్నాయి. నాటు సారా తయారయ్యే ప్రాంతాలు 30 ఉన్నాయి. కర్నూలు జిల్లా పరిధిలో బంగారుపేట, ఎర్రకత్వతండా, గుడుంబాయితండా, ఆదోని, ఆలూరు, పత్తికొండ పరిధిలోని పలు ప్రాంతాలు నాటు సారా తయారీ కేంద్రాలుగా ఉన్నాయి. నంద్యాల జిల్లా పరిధిలో వైకే తండా, ఎల్‌కే తండా, నంద్యాల పట్టణం, నెమళ్లకుంట, నారపురెడ్డితండా, పాణ్యం చెంచుతండా, సుగాలిమెట్ట, బనగానపల్లి పరిధిలోని చిన్నరాజుపాళెంతండా, పసుపులతండా, గడ్డమేకలపల్లె, ఇస్‌రానాయక్‌తండా ఆత్మకూరు పరిధిలో సిద్ధాపురం తదితర ప్రాంతాల్లో నాటు సారా తయారవుతోంది. దీని నిర్మూలనకు వైకాపా ప్రభుత్వం ఆపరేషన్‌ పరివర్తన అమలు చేసింది. సరైన ప్రణాళిక రూపొందించకపోవటంతోపాటు మద్యనిషేధ, ఆబ్కారీ శాఖను రెండుగా విభజించి బలహీనపరిచింది. నాటుసారా తయారుచేసేవారికి ఉపాధి కల్పించే విషయంలో నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా ఆపరేషన్‌ పరివర్తన విఫలమైంది.

ప్రాణాలు కోల్పోయి..

సార్వత్రిక ఎన్నికల సమయంలో నాటు సారా తయారీ మరింత పెరిగింది. దీని కారణంగా కర్నూలు జిల్లా కేంద్రంలో పలువురు మృత్యువాత పడ్డారు. శ్రీరామ్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి నాటు సారాకు అలవాటుపడి బంగారుపేటలోనే ప్రాణాలు వదిలారు. పాతబస్తీకి చెందిన ఓ యువకుడు ఇదే ప్రాంతంలో తాగేందుకు వచ్చి చనిపోయారు. సహజ మరణాలుగా పరిగణించటంతో వారి మృతి వివరాలు తెరపైకి రావటంలేదు. ఇలా ఉమ్మడి జిల్లాలో నాటు సారా కారణంగా చనిపోయే వారి సంఖ్య ఏటా వందల్లోనే ఉంటోంది. తాగి అనారోగ్యం బారినపడి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి నెలా పదుల సంఖ్యలో చికిత్స నిమిత్తం చేరుతున్నారు. తమిళనాడు ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం నాటు సారా నివారణపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని