logo

భవిత ప్రశ్నార్థకం

ప్రత్యేక అవసరాల (సీడబ్ల్యుఎస్‌ఎన్‌) పిల్లల ఆరోగ్యం, జీవన ప్రమాణాల మెరుగుకు ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసినా వైద్యసేవలందించే ఫిజియోథెరపీల నియామకానికి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 01 Jul 2024 02:43 IST

ఫిజియోథెరపీ సేవలందని వైనం
ఆందోళనలో పిల్లల తల్లిదండ్రులు

ప్రత్యేక అవసరాల పిల్లలకు ఫిజియోథెరపీ సేవలు

డోన్‌పట్టణం, న్యూస్‌టుడే: ప్రత్యేక అవసరాల (సీడబ్ల్యుఎస్‌ఎన్‌) పిల్లల ఆరోగ్యం, జీవన ప్రమాణాల మెరుగుకు ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసినా వైద్యసేవలందించే ఫిజియోథెరపీల నియామకానికి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భవిత కేంద్రాల్లో సెరిబ్రల్‌ పాల్సీ,  మైల్డ్‌ మోడరేట్, ఆర్థోపెడికల్‌ ఇన్‌పైర్‌మెంట్, బహుళ వైకల్యం కలిగిన పలు కేటగిరీల పిల్లలకు ఫిజియోథెరపీ సేవలతో పాటు ఐఈఆర్టీలతో ప్రతి ఏడాది శిక్షణ ఇప్పిస్తుంటారు. 2023-24 ఏడాదిలో మార్చి చివరి వరకు వారి సేవల్ని ఉపయోగించుకున్న ప్రభుత్వం తర్వాత విరామమిచ్చింది.  2024-25 ఏడాదిలో జూన్‌ 13న పాఠశాలలు, భవిత కేంద్రాలు పునఃప్రారంభమయ్యాయి. ఆ రోజు నుంచే మళ్లీ పాత వారిని విధుల్లోకి తీసుకుని సేవలందేలా ప్రభుత్వం చూడాలి. కానీ నేటికీ వారి నియామకానికి సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు విడుదలకాకపోవడంతో అంతా ఎదురుచూస్తున్నారు.

వేతనాల తగ్గింపు

తెదేపా ప్రభుత్వ హయాంలో భవిత కేంద్రాల్లో సీడబ్ల్యుఎస్‌ఎన్‌ పిల్లలకు ఫిజియోథెరపీ సేవలు అందించేందుకు వైద్యులకు ఒక్కో శిబిరానికి గానూ రూ.1,250 వేతనం ఇవ్వగా... వైకాపా దీన్ని రూ.950లకు కుదించేసింది. ఆరోగ్యశాఖలో పలు విభాగాల వారికి వేతనాలు పెంచి ఇస్తుంటే..భవిత కేంద్రాల్లోని వారికి మాత్రం తగ్గించి ఇవ్వడం గమనార్హం. ప్రతి నెలా ఇవ్వకపోవడం మరీ దారుణమని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి రావడంతో తిరిగి తమకు వేతనాన్ని పెంచుతారనే ఆశాభావాన్ని వైద్యులు వ్యక్తంచేస్తున్నారు.

తగిన చర్యలు తీసుకుంటాం

రఘురామిరెడ్డి, సీడబ్ల్యూఎస్‌ఎన్‌ జిల్లా సమన్వయకర్త, నంద్యాల

ప్రత్యేక అవసరాల పిల్లలకు వైద్యుల సేవలు అందేలా చూస్తాం. జిల్లా సర్వోన్నతాధికారి అనుమతికి నివేదించాం. ఈనెల 28 నుంచి నంద్యాలలోని కేంద్రాలకు వెళ్లాలని వైద్యులకు సమాచారం ఇచ్చాం. అన్ని మండల కేంద్రాల్లో వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటాం.

అంతా అరకొరే

  • కర్నూలు జిల్లాలో 26 భవిత కేంద్రాలు ఉండగా తొమ్మిది మంది ఫిజియోథెరపిస్ట్‌లకు అయిదుగురు మాత్రమే పని చేస్తున్నారు. దాదాపు 12 మండలాల్లో వైద్య సేవలు అందని పరిస్థితి నెలకొంది. నంద్యాల జిల్లాల్లో 29 భవిత కేంద్రాలుండగా, పది మంది మాత్రమే సేవలందిస్తున్నారు.
  • భవిత కేంద్రాల్లో సేవలందించేందుకు ఉమ్మడి జిల్లాలో వైద్యుల చేతికి కాపీలందలేదని చెబుతున్నారు. పాఠశాలలు తెరిచి రెండు వారాలు అవుతున్నా...నేటికీ వైద్యులను విధుల్లోకి తీసుకోలేదు. అటు పిల్లలకు ఫిజియోథెరపీ వైద్య సేవలు అందక ఇబ్బందులుపడుతున్నారు.
  • జిల్లా సర్వోన్నతాధికారుల అనుమతి కోసం వివరాలు పంపించినా...ఇంకా ఎటువంటి ఉత్తర్వులు రాలేదని సీడబ్ల్యుఎస్‌ఎన్‌ అధికారులు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో జిల్లా సర్వోన్నతాధికారి మారడంతో అనుమతుల విషయంలో జాప్యం జరుగుతుండటంతో పిల్లలకు ఫిజియోథెరపీ సేవలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని