logo

ప్రకృతి సంపద కొల్లగొట్టిన వారిపై చర్యలు

అటవీ ప్రాంతాలను ధ్వంసం చేశారు.. కొండలు మింగారు.. ప్రకృతి సంపదను కొల్లగొట్టారు.. ఐదేళ్లు అరాచకం సృష్టించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్‌అండ్‌బీ శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 30 Jun 2024 03:34 IST

మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: అటవీ ప్రాంతాలను ధ్వంసం చేశారు.. కొండలు మింగారు.. ప్రకృతి సంపదను కొల్లగొట్టారు.. ఐదేళ్లు అరాచకం సృష్టించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్‌అండ్‌బీ శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇసుక, ప్రకృతి వనరుల్ని అనుమతులకు మించి తవ్వడం ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీకి గండికొట్టి తీవ్రంగా నష్టపరిచారని ఆయన మండిపడ్డారు. వీటన్నింటిపైనా అధికారుల నుంచి సమగ్ర నివేదికలు తెప్పించి విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కమిటీలతో విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.  తెదేపా జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్, ఎమ్మెల్యేలు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, గౌరు చరిత, భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖరరెడ్డి, జిల్లా తెదేపా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, గౌరు వెంకటరెడ్డిలతో కలిసి ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన లాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేశామన్నారు. జిల్లాలో రోడ్లు అధ్వానస్థితిలో ఉన్నాయని, ఎమ్మెల్యేల ద్వారా నివేదికలు తెప్పించుకుని డీపీఆర్‌ సిద్ధం చేసి వాటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేశారు.. గ్రామాల్లో వీధి దీపాలు, మురుగు కాల్వలు, అంతర్గత రహదారులు నిర్మించలేదన్నారు. లోటు బడ్జెట్‌ ఉన్నప్పటికీ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. నాబార్డు ద్వారా వచ్చిన రూ.370 కోట్లు ఏమయ్యాయో తెలియడం లేదన్నారు. ఆర్‌అండ్‌బీ శాఖకు సంబంధించి గత ప్రభుత్వం గుత్తేదారులకు రూ.2,700 కోట్లు బకాయి పడిందన్నారు. తెదేపా కార్యకర్తలపై బనాయించిన అక్రమ కేసులపైన పోరాడుతామని స్పష్టం చేశారు. 

ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం: మంత్రి ఫరూక్‌

రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్‌ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో నంద్యాల పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. అదనపు ఎస్‌ఎస్‌.ట్యాంకు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి అదనపు పైపులైన్‌ ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తూ అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన రూ.13 లక్షల 58 వేల కోట్ల అప్పులు తీర్చడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. డోన్‌ నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తెలిపారు. ఓర్వకల్లు దగ్గర ప్రాజెక్టు నిర్మించి తాగునీటి సమస్యలు తీర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 

మంత్రులను కలిసిన కలెక్టర్, జేసీ

 రాష్ట్ర మంత్రులు ఎన్‌ఎండీ.ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డిలను ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో కలెక్టర్‌ డా.కె.శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.  ఎమ్మెల్యేలు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖరరెడ్డి, గౌరు చరిత, భార్గవ్‌రామ్‌ నాయుడు, గౌరు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని