logo

హంద్రీలో ఆక్రమణలు తొలగించండి

కేసీ కాలువతోపాటు హంద్రీ నదికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ ఆదేశించారు.

Published : 30 Jun 2024 03:28 IST

సమన్వయ లోపంతోనే ఇబ్బందులు
మంత్రి టీజీ భరత్‌

జలవనరులశాఖ ఇంజినీర్లతో సమీక్షిస్తున్న మంత్రి టీజీ భరత్‌ 
కర్నూలు జలమండలి, న్యూస్‌టుడే : కేసీ కాలువతోపాటు హంద్రీ నదికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ ఆదేశించారు. కర్నూలులోని ప్రభుత్వ అతిథిగృహంలో జలవనరులశాఖ అధికారులతో శనివారం సాయంత్రం సమీక్షించారు. కేసీ కాలువలో కొంతవరకు గుర్రపుడెక్క తొలగించి మిగిలిన పనులు అలాగే వదిలేశారని, ఫలితంగా దోమల బెడద పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి చెప్పారు. జలవనరులు, నగరపాలక అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. హంద్రీ నదిలో ఇష్టారాజ్యంగా ఆక్రమణలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశలవారీగా ఆక్రమణలు తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. నగర ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారానికి సంబంధించిన ప్రతిపాదనలు అందజేయాలని పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరో ఎస్‌ఎస్‌ ట్యాంకు ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. నగర ప్రజలకు ఇంకా ఏం చేస్తే బాగుంటుందనే అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, ఆయకట్టు, కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు తదితర అంశాలపై ఇంజినీర్లతో చర్చించారు. ఈ సమావేశంలో కర్నూలు సీఈ కబీర్‌బాషా, ఎస్‌ఈ రెడ్డి శేఖర్‌రెడ్డి, కేసీసీ ఈఈ తిరుమలేశ్‌రెడ్డి, ఎల్లెల్సీ ఈఈ శైలేశ్వర్, డీఈఈలు రామకృష్ణ, జిలానీ, టిడ్కో ఎస్‌ఈ రాజశేఖర్‌ పాల్గొన్నారు. 

విద్యార్థులకు నాణ్యమైన భోజనం 

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: నగరానికి దూరంగా ఉన్న మైనారిటీ విద్యార్థుల వసతిగృహాన్ని నగరంలో ఏర్పాటుచేసేలా ప్రత్యేక చొరవ తీసుకుంటామని మంత్రి టీజీ భరత్‌ అన్నారు. ప్రభుత్వ అతిథిగృహంలో జిల్లా విద్యాశాఖాధికారి శామ్యుల్‌ ఆధ్వర్యంలో సమగ్రశిక్షా అధికారులతో మంత్రి సమీక్షించారు. కేజీబీవీల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు రుచికర భోజనం వడ్డించాలని సూచించారు. ప్రభుత్వ బడుల్లో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. 

పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి అవసరం

కల్లూరు గ్రామీణ, కర్నూలు నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే : నగరంలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను మంత్రి టీజీ భరత్‌ ఆదేశించారు. నగరంలోని ప్రభుత్వ అతిథిగృహంలో టిడ్కో, నగరపాలక ప్రజారోగ్య విభాగ అధికారులతో శనివారం సమీక్షించారు. కాలువల శుభ్రత, చెత్త సేకరణ, తరలింపుపై చర్చించారు. హైపో ద్రావణం ఉచితంగా అందిస్తామని.. వీధుల్లో పిచికారీ చేయించాలని ఆదేశించారు. జగన్నాథగట్టుపై 10 వేల గృహాలు మంజూరయ్యాయని, ఈ ఇళ్ల కోసం అర్హులైనవారి వివరాలను వార్డులవారీగా జాబితా సిద్ధం చేయాలన్నారు. టిడ్కో గృహ సముదాయాల వద్ద సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో టిడ్కో ఎస్‌ఈ రాజశేఖర్, నగరపాలక ఆరోగ్యాధికారి విశ్వేశ్వరరెడ్డి, శానిటరీ సూపర్‌వైజర్‌ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు