logo

వైకాపా సహకార బ్యాంకు

ఐదేళ్లుగా రైతు సహకార సంఘాలను తమ గుప్పిట పెట్టుకొన్నారు.. వైకాపా అనుయాయులకు అప్పనంగా రుణాలు ఇచ్చేశారు.

Published : 30 Jun 2024 03:15 IST

వారు చెప్పినవారికే రుణాలు

తిరిగి చెల్లించని వైనం

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఐదేళ్లుగా రైతు సహకార సంఘాలను తమ గుప్పిట పెట్టుకొన్నారు.. వైకాపా అనుయాయులకు అప్పనంగా రుణాలు ఇచ్చేశారు.. వారికి అప్పటి అధికార అండదండలు ఉండటంతో తిరిగి చెల్లించలేదు.. ఫలితంగా లాభాల బాట వీడి నష్టాల ఊబిలో చిక్కుకుపోయే ప్రమాదాన్ని తెచ్చి పెట్టారు.. వైకాపా ప్రభుత్వ హయాంలో సహకార వ్యవస్థ నిర్వీర్యమైంది. అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయింది. త్రిసభ్య కమిటీలు, కొందరు అధికారులు కుమ్మక్కై సహకార రుణాలు మింగేశారు. సహకార బ్యాంకులో చోటు చేసుకున్న అక్రమాల గుట్టు విప్పుతామని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 

గోదాముల గుట్టు విప్పాలి

ఉమ్మడి జిల్లాలో 290 గోదాముల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. 500 మెట్రిక్‌ టన్నుల గోదామును రూ.45 లక్షలు, వెయ్యి మె.ట. గోదామును రూ.90 లక్షలతో నిర్మిస్తున్నారు. ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా అనుచరులకు ఒకరిద్దరికే అప్పగించారు. ఒక్కో సంఘం పరిధిలో రెండు నుంచి మూడు గోదాముల నిర్మాణాలు చేపట్టారు. ఇవన్నీ నాసిరకంగా ఉన్నాయని, గ్రామానికి, ప్రాథమిక సహకార సంఘానికి సుదూర ప్రాంతంలో నిర్మించడంతో ఒక్కటీ వినియోగంలోకి రాలేదు. 

బోగస్‌ పట్టాలు పుట్టించి

కృష్ణగిరి ప్రాథమిక సహకార సంఘం అక్రమాలకు చిరునామాగా మారింది. సంఘం పరిధిలో 2,500 మంది సభ్యులున్నారు. వైకాపా నేత కనుసన్నల్లోనే అక్రమాల పర్వం కొనసాగింది. సదరు నేత అక్రమార్కులతో కలిసి నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు పుట్టించారు. నకిలీ ఈ-పాసు పుస్తకాలతో కృష్ణగిరి సొసైటీ నుంచి 15 మంది పేర్లతో రూ.40 లక్షల రుణాలు తీసుకున్నారు.

ఐదేళ్లుగా నేతల గుప్పిట

ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలో 1.20 లక్షల మంది రైతులు సభ్యత్వం కలిగి ఉన్నారు. దాని పరిధిలో 99 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలున్నాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లకుండా ఆ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలతో నాన్‌ అఫీషియల్‌ త్రిసభ్య కమిటీలు, డీసీసీబీలు, డీసీఎంఎస్‌లకు సెవెన్‌మెన్‌ కమిటీలు ఏర్పాటు చేసింది. వాటి గడువు ప్రతి ఆరు నెలలకోసారి పొడిగిస్తూ వచ్చింది. సంఘాలు వైకాపా నేతల గుప్పిట్లో ఉండటంతో ఆ పార్టీ కార్యకర్తలకు విరివిగా రుణాలు ఇచ్చేశారు.

రూ.190 కోట్ల మొండి బకాయిలు

బ్యాంకులో సభ్యత్వం ఉన్న ప్రతి రైతుకు రుణాలు ఇవ్వాల్సి ఉండగా నిబంధనలు తుంగలో తొక్కారు. తమ అనుయాయులకే రుణాలు ఇప్పించారు. తిరిగి చెల్లింపుల్లో వారు మొండికేశారు. గతేడాది నాటికి రూ.120 కోట్ల వరకు మొండి బకాయిలు ఉండగా.. ప్రస్తుతం రూ.190 కోట్లకు చేరింది. రుణ రికవరీలపై పాలకవర్గాలు దృష్టి పెట్టించాల్సి ఉండగా పెద్దగా పట్టించుకోలేదు. రుణాలు పొందిన వారంతా తమవారేనని.. వారిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావొద్దని.. వారి వద్ద ఉన్నప్పుడు రుణ చెల్లింపులు చేస్తారంటూ త్రిసభ్య, సెవెన్‌మెన్‌ కమిటీలు అధికారులకు సుతిమెత్తగా సూచించడం గమనార్హం. దీంతో లాభాల బాటలో ఉన్న సహకార బ్యాంకు నష్టాల్లోకి వెళ్లే పరిస్థితికి తీసుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా జేఎల్‌జీ గ్రూప్‌ల పేరుతో రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లు తమ అనుచరులకు ఇచ్చేందుకు బ్యాంకు ఛైర్‌పర్సన్‌ ప్రయత్నించారు. ఈ విషయాన్ని ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకురావడంతో ప్రక్రియ ఆగిపోయింది.

కమీషన్ల కక్కుర్తి

వైకాపా ఐదేళ్ల పాలనలో పీఏసీఎస్‌లు త్రిసభ్య కమిటీలు, డీసీసీబీ (సెవెన్‌మెన్‌ కమిటీలు), పాలకవర్గాలు అన్నదాతల నుంచి ముక్కుపిండి కమీషన్లు వసూలు చేశాయి. రూ.లక్షకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముడుపులు ఇచ్చినవారికే రుణాల మంజూరుకు సహకార పాలకవర్గాలు సిఫారసు చేశాయి. ఏటా రెండు సీజన్లలో పంట రుణాలతోపాటు దీర్ఘకాలిక, వివిధ రకాల రుణాలు సుమారు రూ.వంద కోట్లకు పైగా సహకార బ్యాంకుల ద్వారా మంజూరు చేస్తారు. ఆయా పాలకవర్గాల డైరెక్టర్లు, సొసైటీల అధ్యక్షులు తమ సహకార సంఘాలకు రూ.కోటి వరకు రుణ కేటాయింపులు చేయించుకున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని