logo

రేపే పింఛను పండగ

పూర్తి వైకల్యం కలిగిన దివ్యాంగులకు ప్రతి నెలా రూ.15 వేలు పింఛను ఇవ్వనున్నారు. పెరాలసిస్‌ బారినపడి వీల్‌ఛైర్, మంచానికే పరిమితమైనవారు, తీవ్రమైన కండరాల బలహీనత కేసులు,

Published : 30 Jun 2024 03:00 IST

ఇంటి వద్దే ఇవ్వనున్న అధికారులు
అవ్వాతాతల్లో ఆనందం

పింఛనుదారులకు ధ్రువపత్రం
ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారు. రూ.4 వేలు పింఛను ఇస్తామని చెప్పిన ఆయన ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించిన బకాయిల మొత్తం కలిపి జులై 1న ఒక్కో పింఛనుదారుడికి రూ.7 వేలు అందించేలా చర్యలు తీసుకున్నారు. వీరితో పాటు దివ్యాంగులు, పూర్తి వైకల్యం కలిగినవారు, పెరాలసిస్‌ బాధితులు తదితరులకు మేలు జరగనుంది. పింఛను మొత్తం పెంచడంతో పింఛనుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటివద్దే జులై 1న పింఛన్లు ఇవ్వనున్నారు. మొదటి రోజే వంద శాతం పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు.

వీరికి ఎంతో మేలు 

పూర్తి వైకల్యం కలిగిన దివ్యాంగులకు ప్రతి నెలా రూ.15 వేలు పింఛను ఇవ్వనున్నారు. పెరాలసిస్‌ బారినపడి వీల్‌ఛైర్, మంచానికే పరిమితమైనవారు, తీవ్రమైన కండరాల బలహీనత కేసులు, ప్రమాద బాధితులకు ప్రతి నెలా పింఛను మొత్తం రూ.15 వేలను ఎన్డీయే ప్రభుత్వం అందించనుంది. బోదకాలు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె మార్పిడి, డయాలసిస్‌ రోగులు తదితరులకు రూ.10 వేలు ఇవ్వనున్నారు. దివ్యాంగులకు రూ.6 వేలు, అవ్వాతాతలకు రూ.4 వేలు పంపిణీ చేయనున్నారు.

పింఛనుదారులకు ఓ ధ్రువపత్రం ఇవ్వనున్నారు. అందులో పింఛను సొమ్ము అందినట్లు.. పింఛను సొమ్ము ఎవరు పంపిణీ చేశారో ఆ అధికారి సంతకం ఉంటుంది. పింఛనుదారులు పింఛను తీసుకున్నట్లు రసీదు సైతం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. జులై 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచే పింఛన్లు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేశారు. మొదటి రోజే వంద శాతం పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. ఏవైనా సాంకేతిక.. ఇతరత్రా సమస్యలు తలెత్తితే మరుసటి అందిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఒకటి రెండు రోజుల్లోనే వంద శాతం పింఛన్లు పంపిణీ చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. శనివారం నాటికే పింఛను సొమ్మును సచివాలయ సిబ్బంది బ్యాంకుల నుంచి తీసుకున్నారు. 


4,66,469 మందికి లబ్ధి

వైకాపా ప్రభుత్వం మొత్తం 16 రకాల పింఛన్లు పంపిణీ చేయగా ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం ఆ పింఛన్లను 28 కేటగిరీలుగా విభజించింది. సామాజిక భద్రత పింఛన్లతోపాటు దివ్యాంగులు, మూత్రపిండాలు, తలసేమియా, ఇతర బాధితులను కేటగిరీలుగా విభజించారు. ఉమ్మడి జిల్లాలో 11 రకాల సామాజిక పింఛనుదారులకు ప్రతి నెలా రూ.4 వేలు అందించనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4,66,469 మంది పింఛనుదారులు ఉన్నారు. వైకాపా హయాంలో ఉమ్మడి జిల్లాలో పరిశీలిస్తే జూన్‌లో రూ.150 కోట్ల మేర పింఛను సొమ్ము పంపిణీ చేశారు. జులై నెలలో ఎన్డీయే ప్రభుత్వం రూ.317.57 కోట్లు పంపిణీ చేయనుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని