logo

మాన్యం భూముల మేతలు

 ఆలయ మాన్యాలు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి.. గత ఐదేళ్లుగా వేలం ప్రక్రియను గుట్టుగా నిర్వహించారు. వేలం పాటలో పోటీ లేకుండా వ్యూహం పన్ని నామమాత్రపు ధరకు దక్కించుకొన్నారు

Published : 30 Jun 2024 02:50 IST

ఐదేళ్లుగా వైకాపా నేతలకు నైవేద్యం

ఆదాయం తక్కువ చూపుతూ అరాచకం

నంద్యాల పట్టణం, పాణ్యం, న్యూస్‌టుడే: ఆలయ మాన్యాలు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి.. గత ఐదేళ్లుగా వేలం ప్రక్రియను గుట్టుగా నిర్వహించారు. వేలం పాటలో పోటీ లేకుండా వ్యూహం పన్ని నామమాత్రపు ధరకు దక్కించుకొన్నారు. ‘సీ’ విభాగానికి సంబంధించి ఆలయ మాన్యం భూములను తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. వాటికి బహిరంగ వేలాలు నిర్వహించకుండా ‘గుత్తా’ధిపత్యం సాగిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే దాడులకు తెగబడ్డారు. కొందరు నేతలు అధికారులను మచ్చిక చేసుకొని ఆన్‌లైన్‌లో పేర్లు చేర్చి పట్టాదారు పుస్తకాలు పొందారు. ఆలయ భూముల అక్రమాలపై క్షేత్ర స్థాయిలో విచారించి వేలం పాటలు నిర్వహిస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనుంది. 

భయపెట్టి దారికి తెచ్చుకున్నారు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4,350 ఆలయాలు ఉన్నాయి. ఇందులో హుండీ ఆదాయం రూ.25 లక్షల కంటే ఎక్కువ వచ్చే ఆలయాలు 5 (‘ఏ’ కేటగిరి) ఉండగా, రూ.25 లక్షల్లోపు ఆదాయం వచ్చేవి 66 (‘బీ’ విభాగం) వరకు ఉన్నాయి. రూ.5 లక్షల్లోపు ఆదాయం వచ్చే ఆలయాలను ‘సీ’ కేటగిరి పరిధిలో చేర్చారు. ఈ విభాగంలో కర్నూలులో 2,153, నంద్యాలలో 2,126 వరకు ఉన్నాయి. ఆయా ఆలయాల మాన్యం భూములు అర్చకుల పర్యవేక్షణలోనే ఉన్నాయి. వారే కౌలుకు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వచ్చిన ఆదాయంతో ఆలయాల్లో ధూపదీప, నైవేద్యాలు, సిబ్బంది వేతనాల ఖర్చులు భరించాల్సి ఉంటుంది. ఆయా ఆలయాల పరిధిలో వైకాపా నేతలు అర్చకులను భయపెట్టి తక్కువ ధరకు పొలాలు సొంతం చేసుకున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4,350 ఆలయాల పరిధిలో 65,203 ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి. దేవాదాయ శాఖ నిబంధనల మేరకు కొన్ని ఆలయ భూములకు ఏడాదికోసారి, మరికొన్నింటికి మూడేళ్లకోసారి బహిరంగ వేలం నిర్వహించాల్సి ఉంటుంది. మాన్యం భూములు కౌలుకు ఇవ్వడంతో దేవాదాయ శాఖకు కర్నూలు జిల్లాలో ఏటా రూ.8 కోట్లు, నంద్యాలలో రూ.10 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. ఈ ఏడాది నంద్యాల జిల్లాలో 250 ఆలయాలకు సంబంధించి 9 వేల ఎకరాల భూములు, కర్నూలులో 345 ఆలయాలకు సంబంధించి 7 వేల ఎకరాలకు వేలం పాటలు నిర్వహిస్తున్నారు. సంబంధిత శాఖాధికారులు ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా వేలాలు నిర్వహిస్తే రెట్టింపు ఆదాయం వచ్చే అవకాశముంది. గత ఐదేళ్లుగా వైకాపా నేతలు చెప్పిన వారికి తక్కువ ధరకు అంటగట్టారు. 

తప్పుడు లెక్కలతో ఆదాయానికి గండి

కర్నూలు జిల్లా పరిధిలోని 1,856 దేవాలయాల పరిధిలో 43,455 ఎకరాలు ఉండగా ఇందులో అర్చకులు, భజంత్రీ, పల్లకీ సేవకుల పరిధిలో 33,300 ఎకరాలున్నాయి. మిగిలిన భూములు సర్వీస్‌ ఇనాంగా ఉన్నాయి. 7,600 ఎకరాలకు ఏటా రూ.1.92 కోట్లు కౌలు రూపంలో వస్తుంది. నంద్యాల జిల్లా పరిధిలో 2,494 ఆలయాలు ఉండగా మాన్యం భూమి 48,378 ఎకరాలు ఉంది. ఇందులో 19,800 ఎకరాలు అర్చకులు, ఇతరుల చేతుల్లో.. 1,350 ఎకరాలు సర్వీసు ఇనాంగా ఉన్నాయి. ఏటా రూ.8.35 కోట్ల కౌలు వస్తోంది. గతంతో పోలిస్తే మాన్యం భూముల కౌలు ధరలు ఎకరానికి మూడింతలు పెరిగాయి. నీటి పారుదల సౌకర్యాలు పెరగడంతో భూములకు డిమాండు వచ్చింది. వైకాపా నాయకులు జోక్యం చేసుకొని బహిరంగ విపణిలోని కౌలు కన్నా తక్కువకే దక్కించుకొని దేవాదాయ శాఖ ఆదాయానికి గండి కొట్టారు. 

ఐదేళ్లుగా వేలానికి అడ్డంకులు

పాణ్యం మండలం గగ్గటూరులోని ఈశ్వర భోగలింగేశ్వర స్వామి ఆలయ మాన్యానికి చివరగా 2007లో బహిరంగ వేలం నిర్వహించారు. దీనికి 31.02 ఎకరాల మాన్యం ఉంది. ప్రస్తుతం ఇక్కడ కౌలు ధర ఎకరానికి రూ.30 వేలకుపైగా ఉంది. కొన్నేళ్ల కిందట ఈ మాన్యం భూములకు వేలం నిర్వహించాలని ప్రయత్నించగా వైకాపా నాయకులు అడ్డుకున్నారు. రూ.10 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా సరే.. ఐదేళ్ల నుంచి వేలం నిర్వహించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు.

తక్కువకు దక్కించుకొని... 

కౌలు భూముల వేలం పాటలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ కౌలు మొత్తం రూ.25 కోట్ల లోపు ఉంది. 10 ఏళ్ల కిందటే సర్వీసు ఇనాం భూముల కౌలు ఏటా రూ.1.92 కోట్లుగా, అర్చకులు, భజంత్రీలు, పల్లకీ సేవకులు ఇచ్చే కౌలు రూ.3 కోట్లు ఉంది. ఈ లెక్కలు పదేళ్లుగా అటుఇటుగా ఉన్నాయి. రెండు కార్లు పంటలు పండే మహానంది క్షేత్ర భూములకు కౌలు బహిరంగ విపణిలో ఎకరం రూ.70 వేలకుపైగా ఉంది. ప్రస్తుతం సాగులో ఉన్న కౌలుదారులు ఎకరానికి రూ.15 వేలు ఇస్తున్నారు. వాటిని ఇతరులకు రూ.70 వేల చొప్పున ఇచ్చి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. తెలుగుగంగ కాల్వ కింద ఉన్న బండిఆత్మకూరు మండలం ఈర్నపాడు, బి.కోడూరు, మహానంది మండలం అల్లినగరం, శ్రీనగరం, రుద్రవరం మండలం బీరవోలు, రుద్రవరం, డి.కొట్టాల ప్రాంతాల్లోని పలు ఆలయాల భూముల కౌలు కూడా నామమాత్రంగానే చెల్లించి ఇతరులకు ఎకరానికి రూ.30 వేల వరకు ఇస్తున్నారు.

రూ.60 కోట్ల విలువైన భూమిపై కన్ను

కల్లూరు మండలం సల్కాపురంలోని చెన్నకేశవస్వామి ఆలయం పేరిట 15.01 ఎకరాల పొలం ఉంది. ఇది ఏళ్లుగా దేవుని మాన్యం. సర్వే నంబరు 71లోని ఈ భూమి రెవెన్యూ దస్త్రాల్లో చెన్నకేశవ స్వామి పేరు మీద ఉంది. ఆలయంలో ధూపదీప నైవేద్యం పెట్టే పూజార్ల పేర్లు కొన్ని తరాలుగా చెన్నకేశవ స్వామి. రెండు పేర్లు ఒకటే కావడంతో ఇదే అవకాశంగా కొందరు అప్పటి అధికార పార్టీ వైకాపా నేతలు పాసు పుస్తకాలు సృష్టించారు. ఆ పార్టీకి చెందిన ఓ ‘పెద్దాయన’ అండతోనే ఆక్రమణలకు పాల్పడినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. దీని విలువ ప్రస్తుతం రూ.60 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 

దేవుడి మాన్యాన్నీ తవ్వేశారు

ఓర్వకల్లు మండలంలోని శకునాలలో 155, 163 సర్వే నంబర్లలో కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయానికి 18 ఎకరాల మాన్యం భూమి ఉంది. పూజారులు ఆయా భూములు అనుభవిస్తూ ఆలయ నిర్వహణ చేపట్టాల్సి ఉంది. గ్రామానికి చెందిన రైతులకు కౌలుకు ఇచ్చి వచ్చిన సొమ్ముతో ఆలయ కార్యక్రమాలు చేపడుతున్నారు. వైకాపా నేతలు ఆయా భూముల్లో అక్రమంగా మట్టిని తవ్వేసి ఎందుకూ పనికి రాకుండా చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతులపై కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేశారు.  

మఠం భూములు హాంఫట్‌

 చిప్పగిరి భోగేశ్వర స్వామి దేవాలయానికి చెందిన భూములను ఆక్రమించుకుని విక్రయించిన ఒకరు రాజకీయ నేతగా మారారు. ఆలూరులో గని మఠం భూములు, ఆస్పరి మండలం శంకరబండ గ్రామంలో మాధవస్వామి ఆలయానికి చెందిన భూములు 10 ఎకరాలు తన అధీనంలో ఉంచుకున్న నాయకుడు ఒకరు  కౌలు  మాత్రం చెల్లించడం లేదు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు