logo

నాడితప్పిన నిర్వహణ

సర్వజన ఆసుపత్రి నిర్వహణ అత్యంత అధ్వానంగా ఉంది.. పారిశుద్ధ్య సిబ్బంది పనితీరు సరిగా లేదు.. ఎక్స్‌రేలకు నిత్యం తిప్పుకొంటున్నారు

Published : 30 Jun 2024 02:44 IST

సర్వజన ఆసుపత్రిలో రోగుల అవస్థ
మంత్రి టీజీ భరత్‌ ఆకస్మిక తనిఖీ 
నీళ్లు నమిలిన పర్యవేక్షకుడు

ఈనాడు, కర్నూలు, కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : సర్వజన ఆసుపత్రి నిర్వహణ అత్యంత అధ్వానంగా ఉంది.. పారిశుద్ధ్య సిబ్బంది పనితీరు సరిగా లేదు.. ఎక్స్‌రేలకు నిత్యం తిప్పుకొంటున్నారు.. రోగులకు కనీసం స్వచ్ఛమైన నీరు అందించలేకపోతున్నారు.. ఆసుపత్రిలో జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ పేర్కొన్నారు. శనివారం ఆయన సర్వజన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలువురు బాధితులు తాము పడుతున్న ఇబ్బందులను మంత్రికి విన్నవించి కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను మంత్రి తనిఖీ చేసిన సమయంలో కొన్నిచోట్ల విద్యుత్తు లేకపోవడంపై ఎలక్ట్రికల్‌ ఏఈ, ఏపీఎంఎస్‌ఐడీసీ సీఈ, విద్యుత్తు శాఖ ఎస్‌ఈ ఉమాపతిని పిలిపించి మాట్లాడారు. సమస్యను ఎన్ని రోజుల్లో శాశ్వతంగా పరిష్కరిస్తారనే అంశంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.  

గోడు వినిపించిన రోగులు

  • ఆసుపత్రిలో ఎక్స్‌రే విభాగం వద్దకు మంత్రి టీజీ భరత్‌ వెళ్లినప్పుడు ఓ బాధితురాలు తన గోడు వినిపించారు. తనను మూడు రోజుల నుంచి తిప్పుకొంటున్నారని ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆసుపత్రి పర్యవేక్షకుడు డా.ప్రభాకర్‌రెడ్డిని మంత్రి ప్రశ్నించగా యు.పి.ఎస్‌.లు మరమ్మతులకు గురయ్యాయని సమాధానమిచ్చారు. గత కొద్దిరోజులుగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని అంగీకరించారు.
  • సీటీ స్కాన్‌ విభాగాన్ని పరిశీలించగా కేవలం ఐదుగురికి మాత్రమే స్కానింగ్‌ తీసి మిగతావారిని పంపేస్తున్నారని కొందరు విన్నవించారు. అదేమి లేదంటూ పరిస్థితి తీవ్రతను తగ్గించేలా ఆసుపత్రి పర్యవేక్షకుడు ప్రయత్నించారు. దస్త్రాలను మంత్రి పరిశీలించగా గత పది రోజులుగా ఐదుగురికి మించి సీటీ స్కాన్‌ చేయడం లేదని తేలడంతో డా.ప్రభాకర్‌రెడ్డి నీళ్లు నమిలారు.
  • తుంటి ఎముక అరిగిపోవడంతో చికిత్స కోసం గుత్తి నుంచి సర్వజన ఆసుపత్రికి వస్తే స్కానింగ్‌ ఫిల్ముల కోసం రూ.750 చెల్లించమంటున్నారని కృష్ణవేణి అనే బాధితురాలు కన్నీరుమున్నీరయ్యారు. ఆర్థిక పరిస్థితి బాగాలేక గుత్తి నుంచి కర్నూలు వస్తే ఇక్కడ కూడా ఏదో ఒక రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. 

సిబ్బంది తీరుపై మంత్రి ఆగ్రహం

  • వైద్య పరీక్షల విభాగం వద్ద రోగులు కూర్చునేందుకు కుర్చీలూ లేకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో టీజీ వెంకటేశ్‌ ఏర్పాటుచేయించిన ఆర్‌.ఒ. ప్లాంట్లు నిరుపయోగంగా ఉండటంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటుచేస్తే కనీసం నిర్వహణ పట్టించుకోరా అని సూపరింటెండెంటు డా.ప్రభాకర్‌రెడ్డిని నిలదీశారు. 
  • పీడియాట్రిక్‌ ఐసీయూలో ఏసీలు లేక పిల్లలు ఇబ్బంది పడుతుండటంతో ఆసుపత్రి అధికారులను మంత్రి ప్రశ్నించారు. వాస్తవానికి గత కొన్నేళ్లుగా మరమ్మతులు చేయించకుండా అలానే వదిలేశారు. కొద్దిరోజుల నుంచి పనిచేయడంలేదంటూ మంత్రిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం గమనార్హం. 
  • ఆసుపత్రిలో దుర్గంధం వస్తున్న విషయాన్ని మంత్రి గుర్తించారు. ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే ఎలా అని అధికారులను మంత్రి నిలదీశారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని