logo

‘పవర్’ ఉందని పంచేశారు

పెట్టుబడుల వరద అన్నారు.. పారిశ్రామికాభివృద్ధి పాటపాడారు.. విలువైన భూములు బడాబాబులకు కట్టాబెట్టారు.. చిన్న సన్నకారు రైతులకు చెందిన భూములను లాక్కొని వైకాపా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అప్పగించింది.

Updated : 29 Jun 2024 04:40 IST

భూములు ధారాదత్తం చేసిన వైకాపా
గ్రామసభ జరగకుండానే కేటాయింపు
గ్రీన్‌కో సంస్థ అటవీ భూముల ఆక్రమణ 
ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆరా

పెట్టుబడుల వరద అన్నారు.. పారిశ్రామికాభివృద్ధి పాటపాడారు.. విలువైన భూములు బడాబాబులకు కట్టాబెట్టారు.. చిన్న సన్నకారు రైతులకు చెందిన భూములను లాక్కొని వైకాపా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అప్పగించింది. ప్రభుత్వ భూములనే సోలార్‌ పరిశ్రమలకు కేటాయిస్తూ మాయమాటలు చెప్పారు.. ఆ వంకతో పట్టా భూములూ స్వాధీనం చేసుకొని రైతులను వంచించారు. పాణ్యం మండలం కందికాయపల్లె, బేతంచర్ల మండలం ముద్దవరం పంచాయతీల పరిధిలోని ముసలాయి చెరువు, కొలిమిగుండ్ల మండలం పెద్ద వెంతుర్ల గ్రామాల పరిధిలో మూడు పరిశ్రమలకు ఎన్నికల ప్రకటనకు ముందు పెద్ద ఎత్తున భూములు సేకరించి పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టారు. రూ.26,350 కోట్లతో మూడు ప్రాజెక్టులు చేపడుతున్నట్లు ప్రకటించి వేలాది ఎకరాలను రైతుల నుంచి లాక్కొంది. పట్టా భూములతో పాటు డి-పట్టాలను లాక్కొన్నారు. గని రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో గ్రీన్‌కో ఎనర్జీస్‌ సంస్థ అటవీ భూముల ఆక్రమణ, పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆరా తీయడం చర్చనీయాంశంగా మారింది.

న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం

పట్టా భూములు లాక్కొనేయత్నం

పాణ్యం మండలం కందికాయపల్లిలో ఏఏం గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 2,500 ఎకరాలు కేటాయించారు. సౌరశక్తి ప్రాజెక్టును నిర్మించనున్నట్లు సదరు సంస్థ చెబుతోంది. ఇక్కడ 1,800 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా మిగిలిన ఏడు వందల ఎకరాలు ఆలమూరుకు చెందిన 120 మంది రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించారు. సారవంతమైన భూములు కావడం.. వాటిలో సిరులు పండుతున్నాయి.. పరిశ్రమ యాజమాన్యం బలవంతంగా సేకరించడాన్ని రైతులు  వ్యతిరేకించినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. సాగులో ఉన్న భూమికి ఎకరాకు రూ.5 లక్షలు, డీ-పట్టా భూమికి రూ.8 లక్షలు, పట్టా భూమికి రూ.12 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇక్కడ బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.20 లక్షల వరకు పలుకుతోంది. కొండ ప్రాంతంలో ఎకరాకు రూ.5 లక్షలు తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేసిన ప్రభుత్వం రైతుల నుంచి సేకరించే భూమి విషయంలో మరో విధానాన్ని అమలు చేసింది. సాగులో ఉండి వరి పండుతున్న భూమికి కనిష్ఠంగా రూ.5 లక్షలు చెల్లించాలని అప్పటి వైకాపా ప్రభుత్వం నిర్ణయించింది. డి-పట్టా భూమికి రూ.8 లక్షలు, పట్టా భూమికి రూ.12 లక్షల ధరను నిర్ణయించిన ప్రభుత్వం రాళ్లు, కొండలు ఉన్న భూమికి ఎక్కువ ధర ఇచ్చి పంటలు పండుతున్న భూమికి వివిధ రకాల ధరలు నిర్ణయించడం గమనార్హం. 

డి-పట్టా భూములపై గునపం

కొలిమిగుండ్ల మండలం పెద్దవెంతుర్లలో సౌర విద్యుత్తుకు 600 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ భూములన్నీ గతంలో రైతులకు వివిధ సందర్భాల్లో పంపిణీ చేసిన డి-పట్టా భూములే. ఈ పొలాలను రెక్కల కష్టంతో చదును చేసుకుని పంటలు పండిస్తున్న అన్నదాతలపై ‘పిడుగు’ పడినంత పనిచేసింది ప్రభుత్వం. 30 ఏళ్ల పాటు లీజు పద్ధతిలో సౌర పరిశ్రమకు ప్రభుత్వం కట్టబెట్టినా.. రైతులకు మాత్రం ఎకరాకు ఏడాదికి చెల్లించే మొత్తం కేవలం రూ.30 వేలే కావడం గమనార్హం.

గాలి వాటం లెక్కలు

బేతంచెర్ల మండలం ముద్దవరం గ్రామ పంచాయతీ మసీలాయి చెరువు భూముల్లో విండ్‌ పవర్‌ ఏర్పాటుకు ఏకోరన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ప్రభుత్వం భూములను కట్టబెట్టింది. ఇక్కడ ఏ మేరకు భూములు కేటాయించారనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ భూములన్నీ గతంలో రైతులకు డి-పట్టా రూపంలో ప్రభుత్వం పంపిణీ చేసింది. వీటిని విండ్‌ ప్రాజెక్టు పేరుతో తిరిగి స్వాధీనం చేసుకోనుంది. ఇక్కడ రైతులకు 30 ఏళ్ల పాటు ఏడాదికి ఎకరాకు రూ.30 వేలను చెల్లించే పద్ధతిలో భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

అటవీ ప్రాంతం హననం

ఓర్వకల్లు సమీపంలో గుమితంతండా వద్ద గ్రీన్‌కోకు 1,800 ఎకరాలు కట్టబెట్టారు. ఆ పక్కనే ఉన్న వందల ఎకరాల అటవీ భూమిని ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ.100 కోట్ల విలువైన ఆ భూమిలో భారీ సామర్థ్యమున్న విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేశారు. రహదారులు, ఇతర కట్టడాలను పెద్ద ఎత్తున నిర్మించారు. ఇవన్నీ ఆలస్యంగా గుర్తించిన అటవీ శాఖ పరిశ్రమ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినా పట్టించుకోలేదు. యాజమాన్యానికి పాణ్యం నియోజకవర్గానికి చెందిన కొంత మంది వైకాపా నాయకుల అండదండలు ఉన్నాయి. పరిశ్రమ యజమాని ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్‌ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు వైకాపా పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆక్రమణ విషయాన్ని అటవీ అధికారులు ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లారు.. ఆయన విచారణకు ఆదేశించారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేయాలని నిర్ణయించారు. 

హక్కులు కాలరాశారు

నిబంధనల మేరకు గ్రామాల పరిధిలో పరిశ్రమ ఏర్పాటుకు గ్రామ సభ తీర్మానించాలి. ఇదే సమయంలో ఓపెన్‌ ఫోరం (ప్రజాభిప్రాయ సేకరణ) నిర్వహించాలి. ఇవన్నీ ఎక్కడా పాటించడం లేదు. అప్పటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో ప్రక్రియ జరిగిపోయింది. దీంతో రైతులు తమ భూములకు కనీసధరను అడిగే పరిస్థితి లేకపోయింది. 

జీవాలకు గ్రాసం కరవు

గ్రామాల్లో పంటలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. పాడి పశువులు, జీవాలకు అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ప్రస్తుతం సోలార్‌ పరిశ్రమలకు కేటాయించిన కొండ ప్రాంతాల్లో జీవాల పశుగ్రాసానికి గానూ కాపర్లు వాటిని మేతకు తీసుకెళ్లేవారు. సౌర పరిశ్రమలకు భూములు కేటాయించడంతో కందికాయలపల్లె, ఆలమూరు, పెద్ద వెంతుర్ల గ్రామాల్లోని జీవాలకు, పశువులకు గ్రాసం కొరత ఏర్పడే ప్రమాదమేర్పడింది. గొర్రెల కాపర్లు ఉపాధి కోల్పోయే అవకాశం కలిగింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని