logo

విద్యుత్తు ప్రమాదాల నివారణకు చర్యలు

నగరంలో విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి.భరత్‌ ఆదేశించారు.

Published : 29 Jun 2024 03:56 IST

అధికారులతో సమీక్షిస్తున్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌  

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : నగరంలో విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి.భరత్‌ ఆదేశించారు. నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహంలో ఏపీఎస్పీడీసీఎల్‌ అధికారులతో శుక్రవారం సమీక్షించారు. పాత నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్తు తీగలను సరిచేయాలని, షార్ట్‌ సర్క్యూట్‌ జరగకుండా చూడాలని, ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు మార్చాలన్నారు. ప్రభుత్వాసుపత్రిలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుండటంతో రోగుల ప్రాణాలకు ప్రమాదం తలెత్తే అవకాశముందని పేర్కొన్నారు. ఆసుపత్రి అధికారులతో చర్చించి వెంటనే సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాటర్‌ వర్క్స్‌ వద్ద 33 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు 10 సెంట్ల స్థలం అవసరమవుతుందని.. ఇందుకోసం నగరపాలక అధికారులతో మాట్లాడతామన్నారు. అవసరమైతే విద్యుత్తు శాఖ మంత్రితో చర్చించి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యుత్తు శాఖ ఎస్‌ఈ ఉమాపతి, ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు. 

ట్రాఫిక్‌ కష్టాలు తీరుస్తాం 

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : నగరంలోని పాతబస్తీలో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. ఆయన శుక్రవారం పట్టణ ప్రణాళిక అధికారులతో సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ పాత నగరంలో జనం రాకపోకలు సాగించడం కష్టంగా ఉంటోందని చెప్పారు. చౌక్‌ బజార్‌ నుంచి జమ్మిచెట్టు వరకు వెళ్లే దారితోపాటు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్, రాంబొట్ల దేవాలయం వెళ్లే దారిలో ట్రాఫిక్‌ సమస్యలు ఉన్నాయని చెప్పారు. రహదారుల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఇల్లు, దుకాణదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరస్పరం చర్చించాల్సిన అవసరం ఉందని.. ప్రజల అంగీకారం లేకుండా దౌర్జన్యంగా భవనాలు కూల్చివేసే పరిస్థితి తమ ప్రభుత్వంలో ఉండదని స్పష్టం చేశారు. షరాఫ్‌ బజార్, బిర్లాగేట్‌ వద్ద చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారిని ఖాళీ చేయించే ముందు వారికి ప్రత్యామ్నాయం చూపాలని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని