logo

‘భూ’కొలత.. రైతు కలత

ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు విడతల్లో కలిపి 593 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయ్యినట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కర్నూలు జిల్లాలో 141, నంద్యాలలో 148 గ్రామాల్లోనే సమగ్రంగా పూర్తయినట్లు తెలుస్తోంది.

Published : 29 Jun 2024 03:53 IST

గత ప్రభుత్వం చేపట్టిన రీసర్వే అస్తవ్యస్తం
జగన్‌ చిత్రాలతో కూడిన పాస్‌ పుస్తకాలు వెనక్కి
రాజముద్రతోనే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం

వందేళ్ల తర్వాత భూములు రీసర్వే చేస్తున్నట్లు వైకాపా గొప్పలు చెప్పింది.. కర్షకులకు కనీస సమాచారం లేకుండానే ‘హద్దు’లు పాతారు.. హడావుడిగా సర్వే చేసి పల్లెల్లో ‘భూ’ పంచాయితీలు పెంచారు.. ఒక్కోదానికి రూ.60 వెచ్చించి జగన్‌ చిత్రంతో పట్టాదారు పాసుపుస్తకం చేతిలో పెట్టారు. నలుగురైదుగురికి కలిపి ఉమ్మడి పాసు పుస్తకం ఇచ్చి చిక్కులు తెచ్చి పెట్టారు. జగన్‌ చిత్రంతో పాసు పుస్తకాలు ఇవ్వడంపై రైతుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది.. తాము అధికారంలోకి రాగానే కొత్తవి ఇస్తామని తెదేపా అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు.. ఆ మేరకు రాజముద్రతోనే పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జగన్‌ ఫొటోతో ఇప్పటివరకు పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం, పాణ్యం గ్రామీణం, పత్తికొండ, ఆస్పరి

మూడు విడతలు.. ముప్పుతిప్పలు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు విడతల్లో కలిపి 593 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయ్యినట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కర్నూలు జిల్లాలో 141, నంద్యాలలో 148 గ్రామాల్లోనే సమగ్రంగా పూర్తయినట్లు తెలుస్తోంది. మూడు విడతల్లో కలిపి కర్నూలు జిల్లాలో 86,910, నంద్యాలలో 73,750 మందికి భూ హక్కు పత్రాలిచ్చారు. విస్తీర్ణంలో తేడాలు, పేర్ల తప్పులు, జాయింట్‌ ఎల్‌పీఎంలు.. ఇలా పది వేల హక్కు పత్రాల్లో తప్పులు దొర్లాయి. ఆర్‌ఎస్‌ఆర్, అడంగళ్, వెబ్‌ల్యాండ్‌లోని వివరాలకు మధ్య వ్యత్యాసాలు, ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివరాల మధ్య తేడా ఉండటం.. కాల్వలు, వాగులు ఇతర అంశాలు నిశితంగా పరిశీలించకుండానే దస్త్రాల్లో నమోదు చేశారు. భూస్వభావం వివరాల్లో చాలాచోట్ల తప్పులు దొర్లాయి. సరి చేయాలని తహసీల్దారు, ఆర్డీవో, జిల్లా కేంద్రంలోని జేసీ, కలెక్టర్‌ దృష్టికి రైతులు తీసుకెళ్లినా పట్టించుకోలేదు. 

సర్వే నంబర్లు మాయం 

దశాబ్దాలకాలంగా ఉన్న సర్వే నంబర్ల స్థానంలో ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌ (ఎల్‌పీఎం)లను తీసుకొచ్చారు. సర్వే నంబర్లు ఒక వ్యక్తికి ఒక్కటే.. ఆయన వారసులకు అదే సర్వే నంబరు ఉండేది. కొత్త చట్టం ప్రకారం ఒక్కో వ్యక్తికి ఒక ఎల్‌పీఎం నంబరు కేటాయించారు. కొన్ని సర్వే నంబర్లు పూర్తిగా గల్లంతయ్యాయి. ఆన్‌లైన్‌ అడంగళ్‌ కాపీలు కనుమరుగవుతున్నాయి. భూములకు పునాదులుగా ఉన్న ఆర్‌ఎస్‌ఆర్‌ను కనుమరుగు చేశారు. ఉమ్మడి జిల్లాలో 5-6 లక్షల ఎఫ్‌ఎంబీలు లేవు. ఐదారుగురికి కలిపి ఒక ఎల్‌పీఎం నంబరు కేటాయించి భూ హక్కు పత్రాలు అందజేశారు. ఇలా చేయడంతో భూ వివాదాలు మరింత పెరిగాయి.

చిక్కులు తెచ్చిన ఉమ్మడి పత్రం

అధికారులు గ్రామాల్లో గ్రౌండ్‌ ట్రూతింగ్‌ సరిగా చేయలేదు. రీసర్వే చేస్తున్న భూ యజమానితోపాటు చుట్టుపక్కల వారికి ముందుగా తాఖీదులిచ్చి వారి సమక్షంలో సర్వే చేసి హద్దులు గుర్తించాలి. రైతులకు సమాచారం ఇవ్వకుండానే సర్వే చేశారు. నలుగురైదుగురు రైతులకు కలిపి ఒక ఎల్‌పీఎం నంబరుతో భూహక్కు పత్రాలు ఇచ్చారు. తమకు వ్యక్తిగతంగా సర్వే సబ్‌ డివిజన్‌ చేసి విడివిడిగా హక్కు పత్రాలు ఇవ్వాలంటూ వారంతా మండల తహసీల్దారు, రీసర్వే ఉప తహసీల్దారు, మండల సర్వేయర్ల వద్దకు పరుగులు పెట్టారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో అవస్థలు పడుతున్నారు.

ఇనాము భూములుగా మార్చేశారు

తాత ముత్తాతల కాలంలో కులవృత్తులకు సర్వే నంబర్ల వారీగా భూములు కేటాయించారు. దేవాదాయ, మసీదు భూములకు సంబంధించి ఐడీ నంబర్లు ఉన్నాయి. వీటికి మినహా మిగిలిన కులవృత్తులు చేసుకునేవారికి ఇచ్చిన భూములను 1982-83లో అప్పటి ఎన్టీఆర్‌ ప్రభుత్వం ఆ భూములను పట్టా భూములుగా చూపింది. ప్రస్తుతం రీసర్వే చేస్తుండటం.. ఆర్‌ఎస్‌ఆర్‌లో ఐడీ నంబరు ఉండటంతో ఇనాము భూములుగా చూపుతున్నారు. ఫలితంగా సదరు కులవృత్తులవారికి బ్యాంకుల్లో పంట రుణాలు రాని పరిస్థితి నెలకొంది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ భూములు రిజిస్ట్రేషన్‌ కావడం లేదు. ఇలా ఉమ్మడి జిల్లాలో ప్రతి గ్రామంలో కులవృత్తుల వారికి సర్వీసు ఇనాము కింద భూములున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2 లక్షల మంది గతంలో పట్టా భూములుగా ఉన్న తమ భూములను రీసర్వే పుణ్యమా అంటూ ఇనామ్‌ భూములుగా చూపుతున్నారని వివిధ కులవృత్తులవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

తీరని అన్యాయం చేశారు

అనిమిరెడ్డి, రైతు, బురుజుల 

శాశ్వత భూహక్కు, రీసర్వే ద్వారా గత వైకాపా ప్రభుత్వం రైతుల కొంప ముంచింది. ఈ సర్వేతో గ్రామాల్లో రైతుల మధ్య, వారి కుటుంబ సభ్యుల నడుమ చిచ్చు రేపింది. సర్వే నంబరు 75లో నాకు 6.80 ఎకరాల భూమి ఉంది. అందులో గతేడాది విండ్‌ పవర్‌ కంపెనీకి ఎకరా విక్రయించా. 5.80 ఎకరాలు మిగిలింది. అయితే సర్వే అనంతరం 4.60 మాత్రమే చూపుతూ పేపర్‌ ఇచ్చారు. 1.20 ఎకరాలను కోత విధించారు. సంబంధిత తహసీల్దారు, ఉప తహసీల్దారు, వీఆర్వో, సర్వేయర్లకు పలుమార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మాలాంటి చిన్న, సన్నకారు రైతుల పాలిట ఇది శాపంగా మారింది. మా ఊర్లో ఎకరా రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల ధర పలుకుతోంది. నాకు తీరని అన్యాయం చేశారు. ఈ విషయాన్ని తలుచుకుంటే కన్నీరు ఆగడం లేదు. నాలాంటి ఎంతో మంది రైతులకు తీరని అన్యాయం చేశారు. 

32 సెంట్లు తక్కువగా చూపారు

పక్కీరప్ప, బురుజుల, మద్దికెర  

గ్రామంలో సర్వే నంబరు 225లో నాకు 4.75 ఎకరాల నల్లరేగడి భూమి ఉంది. నా పొలం బహిరంగ విపణిలో ఎకరా రూ.20 లక్షలకు పైగా  పలుకుతోంది. నాకు 32 సెంట్లు తక్కువగా చూపారు. ఫలితంగా కనీసం రూ.7 లక్షలకు పైగా నష్టం వాటిల్లుతోంది. అన్నదమ్ముల్లా ఉన్న రైతుల మధ్య సర్వే పేరుతో వైకాపా ప్రభుత్వం చిచ్చు పెట్టింది. మా గ్రామం నుంచే 110 మంది రైతులకు అన్యాయం జరిగింది. అధికారులకు మొరపెట్టుకున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో మా గ్రామంలో సర్వే హద్దురాళ్లు నాటకుండా అడ్డుకున్నాం. చివరికి మా గ్రామంలో రాళ్లే లేకుండా ఇతర ప్రాంతానికి తరలించారు. 

భూరక్ష రాళ్లను సైతం తొలగించాలి

అయ్యమ్మ, మహిళా రైతు, చిరుమాన్‌దొడ్డి 

భూ చట్టంతో భూమి ఉన్న ప్రతి రైతు ఇబ్బంది పడ్డారు. రద్దు చేయాలనే చంద్రబాబు నిర్ణయం అందరిలో ధైర్యాన్ని నింపింది. మాకు సర్వే నంబరు 163-1లో 1.70 సెంట్ల భూమి ఉంది. అధికారులు రీసర్వే పేరుతో కొలతలు వేశారు. 1.70 ఎకరాలు ఉండగా.. రీసర్వే తర్వాత నాకు కేవలం 0.90 సెంట్లు ఉన్నట్లు చూపారు. అధికారుల సర్వేతో తీవ్రంగా నష్టపోయాం. సమస్యను విన్నవించినా వారు పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం పాత పద్ధతిని కొనసాగించడంతోపాటు మా పొలాల్లో పాతిన జగనన్న భూరక్ష రాళ్లను సైతం తొలగించాలి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని