logo

సమగ్రశిక్షాలో కంప్యూటర్ల భక్షకులు

సమగ్రశిక్షా విభాగంలో కంప్యూటర్లు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టించారు. నాలుగేళ్ల కిందట చోటుచేసుకున్న కంప్యూటర్ల కుంభకోణం తాజాగా వెలుగుచూసింది.

Published : 29 Jun 2024 03:44 IST

పంపిణీ చేయకుండా పక్కదారి 
నాలుగేళ్ల తర్వాత వెలుగులోకి

ఈనాడు, కర్నూలు : సమగ్రశిక్షా విభాగంలో కంప్యూటర్లు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టించారు. నాలుగేళ్ల కిందట చోటుచేసుకున్న కంప్యూటర్ల కుంభకోణం తాజాగా వెలుగుచూసింది. విద్యార్థులకు కంప్యూటర్‌ విద్యపై శిక్షణ ఇచ్చేందుకు 2019లో నగరంలోని సమగ్రశిక్షా కార్యాలయానికి రాష్ట్ర పథక సంచాలకుల కార్యాలయం నుంచి 131 కంప్యూటర్లు పంపారు. ఒక్కోదానిని సుమారు రూ.60 వేలు వెచ్చించి కొనుగోలు చేశారు. వీటిని ఉమ్మడి జిల్లాలోని భవిత పాఠశాలలు, మదర్సాలు, పట్టణ వసతిగృహాలకు (యు.ఆర్‌.హెచ్‌.) పంపాల్సి ఉంది. మదర్సాలు, యు.ఆర్‌.హెచ్‌.లకు ప్రత్యామ్నాయ పాఠశాలల సమన్వయకర్త ఆధ్వర్యంలో కంప్యూటర్ల పంపిణీ జరగాలి. భవిత పాఠశాలకు సమ్మిళిత విద్య సమన్వయకర్త ఆధ్వర్యంలో అందించాల్సి ఉంది. జిల్లాలో 54 భవిత పాఠశాలలు ఉండగా 46 పాఠశాలలకే పంపిణీ చేశారు. 65 మదర్సాలకుగాను 50 వాటికే అందించి చేతులు దులిపేసుకున్నారు. యు.ఆర్‌.హెచ్‌.లకు 2, జిల్లా పథక కార్యాలయానికి (డి.పి.ఒ.) 10 కంప్యూటర్లను పూర్తిస్థాయిలో కేటాయించారు. మిగిలిన 23 కంప్యూటర్ల జాడ తెలియరాలేదు. కంప్యూటర్లు పక్కదారి పట్టిన విషయం 2020లోనే అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో పంపిణీ చేయని కంప్యూటర్లను సమగ్రశిక్షా కార్యాలయంలోనే ఉంచినట్లు దస్త్రాల్లో చూపారు. రెండు మాత్రం కనిపించడం లేదని నమోదు చేశారు. ఆ రెండు ఎందుకు కనిపించడం లేదన్న అంశంపై విచారణ చేసి మద్దిలేటి అనే సహాయ ప్రోగ్రాం అధికారిని బాధ్యుడిగా చూపారు. ఆయా కంప్యూటర్లు తనకు అప్పగించనప్పుడు అవి కనపడకపోతే తానెలా బాధ్యుడినవుతానంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

పాడవుతాయంటూ..

పంపిణీ చేయకుండా జిల్లా పథక కార్యాలయం/సమగ్రశిక్షా కార్యాలయంలో ఉంచినట్లు చెప్పిన 21 కంప్యూటర్లు వాస్తవానికి లేకపోవడం గమనార్హం. అయినప్పటికీ అవన్నీ ఉన్నట్లు అధికారులందరినీ నమ్మించేశారు. విద్యార్థుల అవసరాల పేరుతో కంప్యూటర్లను తెప్పించి వాటిని కొందరు అధికారులు పంచేసుకున్నారన్న విషయం సమగ్రశిక్షా విభాగంలో కలకలంగా మారింది. వాడకుండా వదిలేస్తే పాడవుతాయని చెబుతూ వాటిని పలువురు అధికారులకు ఇష్టారాజ్యంగా ఇచ్చేసినట్లు తెలుస్తోంది. 

విచారణకు వైరస్‌

భవిత పాఠశాలలు, మదర్సాల పేరు చెప్పి కంప్యూటర్లను తెప్పించుకుని వాటికి అసలు ఎందుకు పంపిణీ చేయలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. కంప్యూటర్లను సమగ్రశిక్షా అధికారులు పంపిణీ చేయకపోయినప్పటికీ ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు సైతం నోరు మెదపకపోవడంతో అక్రమాలు వెలుగుచూడలేదు. రెండు కంప్యూటర్లు కనపడలేదన్న విషయంలో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు 21 కంప్యూటర్లు సమగ్రశిక్షా కార్యాలయంలో ఉంచకుండా పక్కదారి పట్టించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. 

ఒక్కో మంచినీటి సీసా ధర రూ.300 

దళిత బహుజన టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు కె.సతీశ్‌కుమార్‌ బుధవారం సమగ్రశిక్షాలో సమాచార హక్కు చట్టం ప్రకారం దస్త్రాలను తనిఖీలు చేశారు. ఓ కార్యక్రమానికి సంబంధించి మంచినీళ్ల సీసాలను రూ.3 వేలకు కొనుగోలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఒక్కోదాని ఖరీదు రూ.300గా రాసి.. పది సీసాలకు రూ.3 వేలు ఖర్చైనట్లు చూపారు. సమగ్రశిక్షాలో నిధులను మంచినీళ్లప్రాయంలా ఖర్చు చేశారని చెప్పేందుకు మంచినీటి సీసాలకు చేసిన ఖర్చే నిదర్శనమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

అంతులేని అలసత్వం

ఆదర్శ పాఠశాలలకు బియ్యం సరఫరా చేయడంలో తలెత్తిన ఇబ్బందులను సమగ్రశిక్షా ఉన్నతాధికారులు సకాలంలో పరిష్కరించలేకపోయారు. బియ్యం నిల్వలు లేక గత సంవత్సరం కొన్ని ఆదర్శ పాఠశాలల నుంచి పిల్లలను ఇంటికి పంపాల్సిన దుస్థితి దాపురించింది. బియ్యం బస్తాలు లేవని, భోజనం పెట్టే పరిస్థితి లేదని.. పిల్లలు ఇంటికి వెళ్లిపోవాలంటూ కోసిగిలోని ఓ పాఠశాల వార్డెన్‌ చెప్పడం అప్పట్లో సంచలనం సృష్టించింది. వలస వెళ్లిన వారి పిల్లల కోసం కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఏర్పాటుచేస్తున్న సీజనల్‌ వసతిగృహాల నిర్వహణ పేరుతో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. పిల్లల సంఖ్యను ఎక్కువగా చూపి నిధులు పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శలున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని