logo

కేసీ.. వ్యర్థాలతో నిండి

నగరం మీదుగా వెళ్లే తుంగభద్ర, హంద్రీ నదులు అధ్వానంగా ఉన్నాయి. పెద్దఎత్తున వ్యర్థాలు కలుస్తున్నాయి. హంద్రీ నది ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునేవారే కరవయ్యారు.

Published : 29 Jun 2024 03:39 IST

హంద్రీలో ఆక్రమణలు
చర్యలు తీసుకోకుంటే ఇబ్బందులే
నేడు జలవనరులశాఖ అధికారులతో మంత్రి భరత్‌ సమీక్ష

 కేసీ కాలువలో పెరిగిన గుర్రపుడెక్క 

కర్నూలు జలమండలి, న్యూస్‌టుడే : నగరం మీదుగా వెళ్లే తుంగభద్ర, హంద్రీ నదులు అధ్వానంగా ఉన్నాయి. పెద్దఎత్తున వ్యర్థాలు కలుస్తున్నాయి. హంద్రీ నది ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. మరోవైపు కేసీ కాలువ దుర్గంధంతో నిండిపోయింది. అయినా అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యమే. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీజీ భరత్‌ వివిధ ప్రభుత్వం శాఖలపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం నగరంలోని ప్రభుత్వ అతిథిగృహంలో జలవనరుల శాఖ అధికారులతో సమావేశంకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తుంగభద్ర, హంద్రీ నదులతోపాటు కేసీ కాలువపైనా సమీక్షించాల్సిన అవసరం ఉంది.

  • నగరం మీదుగా సుమారు 5 కిలోమీటర్ల మేర ప్రవహించే కేసీ కాలువ డంపింగ్‌ యార్డును తలపిస్తోంది. కాల్వలో గుర్రపుడెక్క పెద్దఎత్తున పెరిగినా అటు నగరపాలక, ఇటు జలవనరులశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మంత్రి భరత్‌ కేసీపై సమీక్షించి పరిశుభ్రంగా ఉంచేలా ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది.
  • నగరంలో హంద్రీనది పెద్దఎత్తున ఆక్రమణలకు గురవుతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. యథేచ్ఛగా నిర్మాణాలు సాగుతున్నా కనీసం తాఖీదులు ఇచ్చిన దాఖలాలు లేవు. కల్లూరు నుంచి జొహరాపురం వరకు విస్తరించిన హంద్రీ నది ముళ్లకంపలు, పిచ్చిమొక్కలతో నిండిపోయింది. హంద్రీ నదికి హద్దులు ఏర్పాటుచేసి ఆక్రమణలు తొలగించేలా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది.

నిర్వహణ నిధులేవీ?

కర్నూలు పశ్చిమ ప్రాంతంలో వేలాది మంది రైతులు తుంగభద్ర దిగువ కాల్వ (ఎల్లెల్సీ)పై ఆధారపడి జీవిస్తున్నారు. దీని పరిధిలో 1.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. తుంగభద్ర జలాశయం నుంచి మన నీటి వాటా సక్రమంగా విడుదల చేస్తే రైతులు పంటలు సాగు చేసుకునే అవకాశముంటుంది. సుంకేసుల జలాశయం బాగోగులు, నిర్వహణకు నిధులు విడుదల చేయాల్సి ఉంది. గత ప్రభుత్వం ప్రాజెక్టు నిర్వహణకు నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని