logo

భీమన్న.. నీ నటన భేషన్న

ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దుతూ.. నాటక రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో పదవీ విరమణ పొందిన ఆయన..

Published : 29 Jun 2024 03:37 IST

పాఠాలపైనే కాదు.. పద్యాలపైనా పట్టు
పురస్కారాలు, ప్రశంసలు ఆయన సొంతం 

హాస్య నటిగా..   

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దుతూ.. నాటక రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో పదవీ విరమణ పొందిన ఆయన.. నాటక రంగంలో మాత్రం విశేష ప్రతిభ కనబరుస్తూ ముందుకు సాగుతున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి, రెండు కాదు ఏకంగా రెండువేల నాటకాలు ప్రదర్శించి, అద్భుత ప్రతిభ కనబరచి, కర్ణాటక ప్రభుత్వం, పలు సంస్థల నుంచి అవార్డులు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టినా కర్ణాటకలో తన కీర్తిని చాటారు. ఆయనే ఆదోని మండలం మండిగిరి పంచాయతీ తిరుమలనగర్‌కు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు భీమన్న. 

తాత, తండ్రి అడుగు జాడలో.. 

ఆదోని డివిజన్‌ పరిధిలోని కౌతాళం మండలం బదినేహళ్‌ గ్రామానికి చెందిన సుళేకేరి వెంకోబన్న, కె.లక్ష్మమ్మ దంపతుల కుమారుడు భీమన్న. ప్రస్తుతం ఆదోని మండలం మండిగిరిలో స్థిరపడ్డారు. 1983లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టి, 34 ఏళ్ల పాటు బోధన సాగించారు. 2017లో ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందారు. తండ్రి వెంకోబన్న, తాత ఈరన్న స్ఫూర్తితో నాటక రంగంలో పట్టు సాధించారు. 1980 నుంచి ఇప్పటి వరకు 2వేల నాటకాల్లో వివిధ పాత్రలు పోషించి, అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. సామాజిక, పౌరణిక నాటకాలు ప్రదర్శించారు. 1980లో వరనోడి హెణ్ణు కొడు(పిల్లవాడిని చూసి, పిల్లను ఇవ్వు) అనే కన్నడ నాటకంతో అరంగేట్రం చేశారు. రక్తరాత్రి, గౌరి గెద్దళు, గౌడరు గద్దలు, ప్రాణ వోదరు, మానబేకు, సర్పరాజా, హేమారెడ్డి మల్లమ్మ, తెలుగులో అల్లురిసీతారామరాజు, దుర్యోధనుడు, నారదుడు, మోహిని భస్మాసురుడు, తదితర నాటకాలు ప్రదర్శించారు. ఇటీవల ఐదు రోజుల కిందట గత్తిన అత్తె, గమ్మత్తిన సొసె అనే కన్నడ నాటకంలో అత్తా రుద్రమ్మ పాత్రలో కనిపించారు. అదేవిధంగా పురంధర దాసరు, విజయదాసరు, ఈశ్వరుడు తదితర పాత్రలు వేసి ఆకట్టుకున్నారు. బెంగళూరు, రాయచూరు, బళ్లారి, ఉడిపి, మంత్రాలయం, ఆదోని, కౌతాళం తదితర ప్రాంతాల్లో 43 ఏళ్లుగా నాటకాలు వేస్తూనే ఉన్నారు. వీటితో పాటు కన్నడ సీరియల్‌ దాసనాగు విశేష నాగులో పురంధర దాసు శిష్యుని పాత్ర చేశారు. రెండు టెలీఫిలిమ్స్‌లో నటించారు. 

పలు అవార్డులు సొంతం 

2021లో బెంగళూరులో కర్ణాటక మంత్రి శ్రీరాములు చేతుల మీదుగా ఉత్తమ నాటక అవార్డు అందుకున్నారు. కర్ణాటక నాటక అకాడమి, గడినాడు రంగ ప్రశస్తి ఆధ్వర్యంలో నాటక రంగ అవార్డు దక్కించుకున్నారు. 2019లో బళ్లారి రాఘవ ప్రసస్థి సంస్థ వారు ఉత్తమ కళాకారుడు అవార్డు పొందారు. ఉడిపి పీఠాధిపతులు, గదగ పుట్టరాజ గవాయ్‌ నుంచి పలు పురస్కారాలు అందుకున్నారు. ఉపాధ్యాయుడిగా చేసిన సేవలకు గుర్తింపుగా 2008లో ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు కలెక్టర్‌ నుంచి అందుకున్నారు. 

నాటకం రంగం అంటే ప్రాణం 

భీమన్న, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు

చిన్నప్పటి నుంచి నాటకం రంగం అంటే ప్రాణం. మా తండ్రి వెంకోబన్న, తాత ఈరన్న నాటకాలు వేసేవారు. వారి స్ఫూర్తితో నేను వాటిని అందిపుచ్చుకున్నాను. గతంలో నెలకు రెండు, మూడు నాటకాల్లో పాత్రాలు పోషించేవాణ్ని, ప్రస్తుతం సమమం దొరికితే చాలు నాటకాలు వేస్తున్నాను. సమాజాన్ని చైతన్యపచడంలో నాటకాలు కీలకమనే విషయం గుర్తించాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని