logo

బాబాబృందావన్‌ నగర్‌లో భారీ చోరీ

కర్నూలులోని బాబాబృందావన్‌ నగర్‌లో భారీ చోరీ జరిగింది. కొలిమిగుండ్ల మండలం జున్నుకొరమానిపల్లె చెందిన రైతు శ్రీనివాసరావు సదరు కాలనీలో నివాసం ఉంటున్నారు.

Published : 29 Jun 2024 03:34 IST

చిందరవందరగా పడేసిన వస్తువులు 

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలులోని బాబాబృందావన్‌ నగర్‌లో భారీ చోరీ జరిగింది. కొలిమిగుండ్ల మండలం జున్నుకొరమానిపల్లె చెందిన రైతు శ్రీనివాసరావు సదరు కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు, కుమార్తె అమెరికాలో ఉండగా, ఓ కుమార్తె హైదరాబాద్‌లో ఉంటున్నారు. అందరికీ వివాహాలయ్యాయి. కొద్దిరోజుల కిందట కుమారుడికి పెళ్లి చేశారు. ఈ క్రమంలో బంగారు ఆభరణాలన్నీ ఇంట్లోనే ఉంచారు. వ్యవసాయ పనుల నిమిత్తం ఆయన ఈనెల 19న తన కుటుంబసభ్యులతో కలిసి స్వగ్రామానికి వెళ్లారు. శుక్రవారం తిరిగి వచ్చేసరికి దొంగలు ఇంటిని దోచేశారు. బీరువాలోని సొత్తుతోపాటు టీవీని సైతం అపహరించుకుపోయారు. 45 తులాల బంగారు, కిలో వెండి ఆభరణాలు అపహరణకు గురైనట్లు తెలిసింది. సమాచారం అందుకున్న కర్నూలు నాలుగో పట్టణ పోలీసు అధికారులు చేరుకుని ఘటనా స్థలానికి సమీపంలో సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. 20వ తేదీనే చోరీ జరిగినట్లు గుర్తించారు. మొదట ఆటోలో వచ్చి టీవీని ఎత్తుకెళ్లిన దొంగ.. ఆ తర్వాత ద్విచక్ర వాహనంపై వచ్చి మళ్లీ ఇంట్లో చొరబడి సొత్తు అపహరించినట్లు గుర్తించారు. సమీప కాలనీకి చెందిన నేరస్థులే చోరీకి పాల్పడినట్లు భావిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని