logo

గిరిజనంలో రక్తహీనత

ఇప్పటికే గిరిజనులు రక్తహీనతతో బాధపడుతుండగా తాజాగా సికిల్‌ సెల్‌ ఎనీమియాతో ఇబ్బంది పడుతున్నట్లు తేలింది.

Published : 29 Jun 2024 03:32 IST

పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది 

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: ఇప్పటికే గిరిజనులు రక్తహీనతతో బాధపడుతుండగా తాజాగా సికిల్‌ సెల్‌ ఎనీమియాతో ఇబ్బంది పడుతున్నట్లు తేలింది. వారికి ఉచితంగా వైద్యసేవలు అందించనున్నారు. బాధితులకు పింఛన్లూ పంపిణీ చేయనున్నారు. 2047 నాటికి సికిల్‌సెల్‌ ఎనీమియా వ్యాధి నిర్మూలనే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళిక రూపొందించాయి. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో ముమ్మరంగా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 10 వేల కిట్లతో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 40 ఏళ్ల లోపు వారికి పరీక్షలు నిర్వహించారు. వారితో పాటు మారుమూల గ్రామాల్లో ఉండే గిరిజనులను పరీక్షించేందుకు మరో 40వేల కిట్లను పంపిణీ చేశారు. జిల్లాలో 50వేల మందికి పరీక్షలు చేయాలని నిర్ణయించగా, ప్రస్తుతం 32వేల మందికి పూర్తి చేశారు. ఇందులో 11 అనుమానిత కేసులు వెలుగులోకి రావడం గమనార్హం. వారికి మళ్లీ వైద్యులు పరీక్షించి వ్యాధి నిర్థారణ చేయనున్నారు. వ్యాధి నిర్థారణ అయిన తర్వాత ఆ రోగికి ఉచితంగా వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తారు. ఖర్చులకు గానూ నెలకు రూ.15 వేల పింఛను  ప్రతినెలా అందజేస్తారు. జులై 3 వరకు వైద్య సిబ్బంది ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నారని తెలిపారు.

11 మందికి సికిల్‌ సెల్‌ ఎనీమియా

డా.వెంకటరమణ, డీఎంఅండ్‌హెచ్‌వో, నంద్యాల

రక్త కణాలు తక్కువగా ఉండటంతో పాటు వారిలో కణాలు ఉత్పత్తి కాని పరిస్థితి నెలకొనడంతో గిరిజనులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి రాకపోయినప్పటికి వారి తల్లిదండ్రుల జన్యువు నుంచి సంక్రమిస్తుంది. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని