logo

వైకాపాకు తలూపిన తహసీల్దార్లు

అప్పటి ‘అధికారం’ అండతో తహసీల్దార్‌ కుర్చీ ఎక్కారు.. వైకాపా నేతలకు వంత పాడారు.. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నా మిన్నుకుండిపోయారు. కొండలు పిండి చేస్తున్నా చూసీచూడనట్లుగా వ్యవహరించారు.. ఇసుక దోపిడీ జరుగుతున్నా అటువైపు కన్నెత్తి చూడలేదు.

Updated : 28 Jun 2024 05:39 IST

విలువైన భూములు నేతలకు ధారదత్తం
భారీగా ప్రయోజనం పొందిన కొందరు రెవెన్యూ అధికారులు 
మళ్లీ ప్రాధాన్య పోస్టు దక్కించుకొనేందుకు కొందరి యత్నం

అప్పటి ‘అధికారం’ అండతో తహసీల్దార్‌ కుర్చీ ఎక్కారు.. వైకాపా నేతలకు వంత పాడారు.. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నా మిన్నుకుండిపోయారు. కొండలు పిండి చేస్తున్నా చూసీచూడనట్లుగా వ్యవహరించారు.. ఇసుక దోపిడీ జరుగుతున్నా అటువైపు కన్నెత్తి చూడలేదు. 22ఏ భూముల క్రమబద్ధీకరణ పేరుతో అందినకాడికి దోచుకున్నారు.. రీసర్వే పేరుతో అన్నదాతలను నిలువునా ముంచేశారు. చుక్కల భూముల సమస్యలు పరిష్కరించకుండా రైతులకు చుక్కలు చూపారు. స్పందన వినతులు చెత్త బుట్టలో పడేశారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా పక్క జిల్లాలకు వెళ్లినా మరోసారి జిల్లాలో కీలకమైన పోస్టులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే

  • గతంలో గూడూరులో పని చేసిన ఓ మహిళా తహసీల్దార్‌ వైకాపాతో అంటకాగారు. నాగలాపురంలోని జగనన్న కాలనీల్లో ప్లాట్లను బహిరంగంగా అమ్ముకున్నారు. డబ్బు కోసం పార్టీలకతీతంగా పనులు చేశారు. ఆమె భర్త వైకాపా సర్పంచి. వైకాపా పాలనలో ఆమె అడ్డూఅదుపూ లేకుండా వ్యవహరించారు.  ఆ తర్వాత ఆదోనికి బదిలీ అయ్యారు. ప్రస్తుతం మళ్లీ ఆదోనితోపాటు గూడూరు, సి.బెళగల్‌ మండలాల్లో పోస్టింగ్‌ కోసం స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సి.బెళగల్‌ మండలంలో పోస్టింగ్‌ ఇస్తే నదీతీర ప్రాంతం ఆమెకు మరింత కలిసివచ్చే అవకాశముందన్న ప్రచారం సాగుతోంది. 
  • గతంలో కర్నూలు, కల్లూరులో పని చేసిన ఓ తహసీల్దార్‌ కోడుమూరు పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన గతంలో అక్కడే పని చేశారు. మళ్లీ అదే పోస్టుకు యత్నిస్తున్నారు. కర్నూలు-బళ్లారి రోడ్డు వెంబడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎకరం రూ.కోటికిపైగా పలుకుతోంది. నాలుగు డబ్బులు వెనకేసుకునేందుకు అనువైన మండలం కావడంతో స్థానిక తెదేపా నేతను కలిసినట్లు తెలిసింది. గతంలో కోడుమూరు నియోజకవర్గంలో పని చేసి ఆ తర్వాత పత్తికొండ నియోజకవర్గంలో విధులు నిర్వహించి ఎన్నికల ముందు సీమ జిల్లాలకు బదిలీ అయిన ఓ మహిళా తహసీల్దార్‌ గూడూరు పోస్టుకు ప్రయత్నిస్తున్నారు. 

ఆదోనిలో అక్ర‘మార్కుడు’

ఆదోనిలో ఏడాదిన్నర కిందట పని చేసిన ఓ తహసీల్దార్‌ వైకాపా నాయకులు చెప్పిన వారికే ఇళ్ల పట్టాలిచ్చారు. జగనన్న కాలనీలకు సంబంధించి భూసేకరణలో రూ.లక్షలు వెనుకేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. మధ్యవర్తుల ద్వారా రైతులకు ఎకరానికి రూ.5 లక్షలు చెల్లించి సేకరించారు. ఆ భూములకు ప్రభుత్వానికి ఎకరానికి రూ.15 లక్షలకు విక్రయించారు. సదరు తహసీల్దార్‌ను అప్పటి ఎమ్మెల్యే ఏరికోరి తెచ్చుకున్నారు.. తనకు వాటాలు ఇవ్వకపోవడంతో ఆ నేతనే ఇతర ప్రాంతానికి బదిలీ చేయించారు. ఆయన తిరిగి ఆదోనిలో పోస్టింగ్‌ కోసం ప్రస్తుత ఎమ్మెల్యే, తెదేపా నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం.

విలువైన భూముల ధారాదత్తం

ఆదోనిలో ఎన్నికలకు ముందు పని చేసిన ఓ మహిళా తహసీల్దార్‌ తానేమీ తక్కువ అన్నట్లు అక్రమాలకు తెర లేపారు. స్థానిక ఉప తహసీల్దార్‌ (ఎన్జీవో సంఘం నాయకుడు) అంతాతానై చక్రం తిప్పారు. ప్రభుత్వ భూములను పట్టాలు చేసి ఇవ్వడం, ఇళ్ల పట్టాల మార్పిడి, గతంలో ఇందిరమ్మ కాలనీలో మిగిలిపోయిన స్థలాలను అధిక ధరలకు విక్రయించడం, అసైన్‌మెంట్‌ కమిటీ ఆమోదం లేకున్నా వైకాపా ప్రజాప్రతినిధి చెప్పిన వారికి ప్రభుత్వ భూములను ధారాదత్తం చేశారు. గత వైకాపా పాలనలో ఓ వీఆర్వో జూనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది ఆ తర్వాత అక్కడే ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తూ తహసీల్దార్‌ కార్యాలయంలో అంతాతానై వ్యవహరించారు. అప్పటి స్థానిక ప్రజాప్రతినిధి సామాజిక వర్గం కావడంతో ఆయన అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. రెండున్నరేళ్లపాటు మండగిరి, సాదాపురం ప్రాంతాల్లో ఎకరం రూ.కోటికిపైగా విలువైన భూములు, వంక పోరంబోకు, ప్రభుత్వ భూములను వైకాపా నేతలకు కట్టబెట్టి అందినకాడికి దోచుకున్నారు. 

కల్లూరు పోస్టుకు గట్టి పోటీ

పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు తహసీల్దార్‌ పోస్టుకు గట్టి పోటీ ఉంది. డోన్‌ నియోజకవర్గంలో పని చేసిన ఇద్దరు తహసీల్దార్లు ఈ పోస్టు కోసం స్థానిక తెదేపా నేతలతో కలిసి స్థానిక ప్రజాప్రతినిధిని పలుమార్లు కలిశారు. ప్రజాప్రతినిధి బంధువు ఒకరు ఈ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గత ఐదేళ్లలో వీరంతా వైకాపా నేతల కనుసన్నల్లోనే పని చేశారు. అధికార పార్టీ వారికే అంటకాగారు. ఎన్నికలకు ముందు ఇక్కడ పని చేసిన ఓ తహసీల్దార్‌ కర్నూలు జిల్లా మంత్రి పర్సనల్‌ సెక్రటరీగా వెళ్లేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇటీవల మంత్రిని కలిసినట్లు సమాచారం. 

వైకాపాకు ‘పరిశ్రమి’ంచారు

గతంలో గడివేముల మండలంలో పని చేసిన మహిళా తహసీల్దార్‌.. వైకాపా నాయకులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధి చెప్పినవారికే పనులు చేసిపెట్టారు. తెదేపా వారిని కార్యాలయం మెట్లు కూడా ఎక్కనీయలేదు. భూములను ఇష్టానుసారంగా ధారాదత్తం చేశారన్న ఆరోపణలున్నాయి. ఆ తర్వాత పాణ్యం మండలానికి బదిలీపై వెళ్లారు. పిన్నాపురంలో సోలార్‌ పరిశ్రమకు భూసేకరణ జరుగుతుండగా తమకు అనుకూలంగా పని చేయించుకునేందుకు అప్పటి ఓ ప్రజాప్రతినిధి తనవారిని పాణ్యానికి బదిలీ చేయించుకున్నారు. పాణ్యం వెళ్లినా గడివేముల మండలంలోని భూములను ఇతరులకు కట్టబెట్టడం.. పత్రికల్లో ప్రతికూల కథనాలు రావడంతో సస్పెన్షన్‌కు గురయ్యారు. సస్పెన్షన్‌ చేయకుండా నిలుపుదల చేసుకునేందుకు అప్పటి రెవెన్యూ మంత్రితో నంద్యాల కలెక్టర్‌కు ఫోన్‌ చేయించినా కలెక్టర్‌ ససేమిరా అన్నారు. ఎన్నికల ముందు వరకు నంద్యాల జిల్లా కలెక్టరేట్‌లో విధులు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీమ జిల్లాలకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం జిల్లాకు రానుండటంతో ఓర్వకల్లు , గడివేముల, నంద్యాలలో పోస్టింగ్‌ కోసం మంత్రి, మరో నాయకుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. 

ఆదాయ కుర్చీలో కూర్చొనేందుకు

కర్నూలు గ్రామీణ తహసీల్దార్‌ పోస్టుకు మంచి డిమాండు ఉంది. ఎన్నికలకు ముందు పని చేసిన ఓ తహసీల్దార్‌ మళ్లీ అదే స్థానం కోసం స్థానిక తెదేపా నేతను సంప్రదించారు. వైకాపా నేతలు అనేక అక్రమాలకు పాల్పడినా, ఎర్రమట్టి దోచేసినా, నదిలో ఇసుకను తోడేసినా సదరు అధికారి నోరు మెదపలేదు. గతంలో ఓర్వకల్లులో పని చేసిన సమయంలో జగనన్న లేఅవుట్లల్లో ఇళ్ల పట్టాలను అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. వైకాపా హయాంలో ఓర్వకల్లులో స్థానిక ప్రజాప్రతినిధి, వైకాపా నేతల భూఅక్రమాలకు సదరు తహసీల్దార్‌ సహకారం అందించడంతోపాటు అందినకాడికి దోచుకున్నారని ఓర్వకల్లు తెదేపా నేతలు విమర్శిస్తున్నారు. కర్నూలు గ్రామీణ మండలంలో మంచి ఆదాయం ఉందని భావించి మళ్లీ పోస్టింగ్‌ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. డోన్‌ రెవెన్యూ డివిజన్‌లో పని చేసిన ఇద్దరు తహసీల్దార్లు సైతం ఈ పోస్టుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో కలెక్టరేట్‌లో పని చేస్తూ సస్పెండైన ఓ తహసీల్దార్‌ కర్నూలు రూరల్‌ తహసీల్దార్‌ పోస్టు కోసం తెదేపా నేతను ప్రసన్నం చేసుకున్నారు. గతంలో నంద్యాలలో పని చేసిన మరొకరు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 

పనులు చక్కబెట్టడంలో నేర్పరులు

రెండేళ్ల కిందట నంద్యాల తహసీల్దార్‌గా పని చేస్తూ పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడిన తహసీల్దార్‌ మరోసారి ఇదే స్థానానికి వచ్చేందుకు మంత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. భార్యాభర్తలు ఇరువురు ఒకరు బండిఆత్మకూరు, మరొకరు మహానంది ఉప తహసీల్దార్లు. వారిద్దరూ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పోస్టింగ్‌ కోసం స్థానిక ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నారు. ఈ ఇద్దరు డీటీల ఆస్తులపై గతంలో ఏసీబీ దాడులు జరిగాయి.. వీరు పేరుకు డీటీలు.. తహసీల్దార్‌ చేయాల్సిన పనులు చక్కబెట్టడంలో వీరిద్దరూ ఎంతో నిష్ణాతులు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని