logo

ఆర్‌యూలో అక్రమాల పర్వం

రాయలసీమ విశ్వవిద్యాలయం అక్రమాలకు అడ్డాగా మారింది.. వైఎస్సార్‌ జిల్లాకు చెందిన నేతలకు సన్నిహిత సంబంధాలున్న వారు పెత్తనం చేస్తున్నారు. వర్సిటీ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్న ఉన్నతాధికారులు వైకాపా హయాంలో అడ్డగోలుగా పోస్టింగులు పొందారు.

Published : 28 Jun 2024 04:46 IST

వివాదాస్పదంగా వేతనాల పెంపు నిర్ణయం
పదవి పోతుందన్న ఆలోచనతో బరితెగింపు 

ఈనాడు, కర్నూలు: రాయలసీమ విశ్వవిద్యాలయం అక్రమాలకు అడ్డాగా మారింది.. వైఎస్సార్‌ జిల్లాకు చెందిన నేతలకు సన్నిహిత సంబంధాలున్న వారు పెత్తనం చేస్తున్నారు. వర్సిటీ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్న ఉన్నతాధికారులు వైకాపా హయాంలో అడ్డగోలుగా పోస్టింగులు పొందారు. తాజాగా బోధనేతర సిబ్బంది వేతనాలు పెంచడానికి, కొందరిని మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ (ఎంటీఎస్‌) పరిధిలోకి తీసుకురావడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తుండటం వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం రూ.10 వేల నుంచి రూ.18 వేల వరకు ఉన్న ఒప్పంద, దినసరి ఉద్యోగుల వేతనాలు రూ.30 వేలకు పెంచడానికి వీలుగా ప్రతిపాదనలు రూపొందించారు. సుమారు 25 మందికి లబ్ధిచేకూరే దస్త్రం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.గత ఐదేళ్లలో విశ్వవిద్యాలయంలో జరిగిన అక్రమాలపై విజిలెన్సు విచారణ చేయించాలని విద్యార్థి సంఘాలు పట్టుబడుతున్నాయి.

అర్హులను సాగనంపారు

ఐదేళ్ల కిందట వైకాపా అధికారంలోకి రాగానే అప్పటి వీసీగా ఉన్న ఆచార్య ఏవీ ప్రసాదరావుకు పొగబెట్టారు. ఆయన్ని పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. అనర్హులకు కీలక పదవులివ్వాలంటూ ఒత్తిడి చేయడంతో తన రెండేళ్ల పదవీ కాలాన్ని వదులుకుని తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి వైకాపా నేతల అండదండలున్న వారు విశ్వవిద్యాలయంలో తిష్ఠ వేసి అరాచకపర్వం కొనసాగించారు. కీలక పోస్టుల్లో ఉన్న ఉన్నతాధికారులకు వైఎస్సార్‌ జిల్లా నేతల ఆశీస్సులున్నాయి. మాజీ రిజిస్ట్రార్‌ ఆచార్య ఎన్‌.టి.కె.నాయక్‌ మూడు కీలక పదవుల్లో (రెక్టార్, పాలక మండలి సభ్యుడు, వర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌) కొనసాగుతున్నారు. గతంలో జరిగిన అక్రమాల నేపథ్యంలో ఆయనకు పరిపాలనా పరమైన బాధ్యతలు అప్పగించవద్దన్న ఆదేశాలున్నా పాటించలేదు.

నకిలీ ధ్రువపత్రాలతో కొలువుదీరారు

రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఉద్యోగాలు పొందడానికి వీలుగా ఏడో తరగతి, పదో తరగతి చదివినట్లు కొందరు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించారు. ఆ గుట్టును విద్యార్థి సంఘాలు రట్టు చేయడంతో అప్పటి వీసీ ఆచార్య ఆనందరావు 45 మంది ఉద్యోగుల ధ్రువపత్రాలను పునఃపరిశీలనకు జిల్లా విద్యాశాఖాధికారులకు పంపారు. కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి 24 మంది ధ్రువపత్రాలను పరిశీలించి వాటిలో 17 నకిలీవని తేల్చారు. వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. మరో 21 మందికి చెందిన ధ్రువపత్రాలను నంద్యాల జిల్లా డీఈవోకు పంపగా వారు నివేదిక ఇవ్వలేదు. 

సాధారణ బదిలీలకు ముడుపులేనా

విశ్వవిద్యాలయంలో బోధనేతర విభాగాల్లో 24 మంది శాశ్వత, 82 మంది ఎంటీఎస్, ఒప్పంద, దినసరి పద్ధతుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ప్రాధాన్యతా పోస్టుల్లో కొనసాగుతున్న వారు పెద్దఎత్తున పైరవీలు సాగించారు. ఈ నేపథ్యంలో బదిలీ ప్రక్రియ చేపట్టి నచ్చిన వారికి కీలక పోస్టులు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

అడుగడుగునా అక్రమాలు

  • విశ్వవిద్యాలయానికి రూ.60 లక్షలతో ప్రత్యేకంగా గ్రంథాలయ భవనాన్ని నిర్మించారు. ఇందులో పెద్దఎత్తున అవినీతి జరిగిందని విద్యార్థి సంఘాలు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. లోకాయుక్త ఆదేశాల మేరకు విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. కానీ అది నేటికీ పూర్తి కాలేదు. 
  • విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్‌ కళాశాలకు అవసరమైన ఫర్నిచర్‌ కొనుగోలులో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలున్నాయి. సుమారు రూ.40 లక్షలు వెచ్చించి ఫర్నిచర్‌ కొనుగోలు చేసినా వాటి నాణ్యత అత్యంత నాసిరకంగా ఉందన్న ఆరోపణలొచ్చాయి. అయినా ఆయా కొనుగోళ్లపై ఎలాంటి విచారణ చేపట్టలేదు.

రాజీనామా ఆలోచనలో వీసీ?

ప్రస్తుత వీసీ ఆచార్య సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌ జనవరిలో బాధ్యతలు చేపట్టారు. ఆయన హైదరాబాద్‌ జేఎన్టీయూలో ఆచార్యుడికి పని చేస్తూ ఇక్కడికొచ్చారు. వైఎస్సార్‌ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం, వై.ఎస్‌. కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండటంతోనే కీలక పదవి దక్కినట్లు తెలుస్తోంది. ఆయన ఇడుపులపాయ ఆర్‌.జి.యు.కె.టి. ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా, ఒంగోలు ఆర్‌.జి.యు.కె.టి. డైరెక్టర్‌గా ఏడాదిపాటు కొనసాగారు. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి కార్యదర్శిగా పని చేశారు.ఏపీలో పలువురు అర్హులైన ఆచార్యులుండగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్యుడికి అవకాశం ఇవ్వడమేంటన్న చర్చ అప్పట్లో కొనసాగింది. ప్రస్తుతం ఆయన రాజీనామా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చర్చ సాగుతోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని