logo

సాగునిధి ప్రణాళిక

వైకాపా అధికారంలో ఉన్న ఐదేళ్లూ జలాశయాల నిర్వహణను ‘నీరు’గార్చారు. గేట్ల వద్ద రబ్బరు సీళ్లు వేయలేదు.. గ్రీజు పూయలేదు.. తాళ్లు బిగించలేదు..  రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం అప్రమత్తమైంది.

Published : 28 Jun 2024 04:46 IST

ప్రాజెక్టుల నిర్వహణపై దృష్టి
నివేదిక కోరిన ప్రభుత్వం

నంద్యాల పట్టణం, కర్నూలు జలమండలి న్యూస్‌టుడే : వైకాపా అధికారంలో ఉన్న ఐదేళ్లూ జలాశయాల నిర్వహణను ‘నీరు’గార్చారు. గేట్ల వద్ద రబ్బరు సీళ్లు వేయలేదు.. గ్రీజు పూయలేదు.. తాళ్లు బిగించలేదు..  రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం అప్రమత్తమైంది. రాబోయే వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. కృష్ణా జలాలపై ఆధారపడ్డ సుంకేసుల రిజర్వాయర్‌తో పాటు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, శ్రీశైలం జలాశయానికి సంబంధించి మొత్తం 32 మెకానిక్‌ పనులు చేపట్టేందుకు రూ.3.68 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు.  తొలుత రూ.70 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. అన్ని పనులు చేయడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, సమయం తక్కువ ఉండటంతో ప్రస్తుతం అత్యవసర పనులకు మాత్రమే అంచనాలు ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు.  

గేట్ల బాగుకు ప్రాధాన్యం

  • పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు సంబంధించి నాలుగు పాత గేట్లు, 10 కొత్త గేట్ల నిర్వహణకు రూ.1.50 కోట్లు కావాలని ప్రతిపాదించారు. ఈ నిధులతో గేట్లకు గ్రీజు పూయడంతో పాటు టర్న్‌ బకిల్స్‌ తదితర పనులు చేపట్టనున్నారు.
  • శ్రీశైలం జలాశయానికి సంబంధించి మొత్తం 12 రేడియల్‌ క్రస్ట్‌ గేట్లు, స్పిల్‌వే కింద భాగంలో ఉన్న రెండు స్లూయిస్‌ గేట్ల నిర్వహణ, శాండ్‌ బ్లాస్టింగ్, టర్న్‌ బకిల్స్, గ్రీజు పూయడం, రబ్బరు సీల్స్‌ పనులు, గేట్ల తీగల నిర్వహణకు నిధులను ఉపయోగించనున్నారు.
  • సుంకేసుల ఆనకట్ట వద్ద మెకానికల్‌ పనులు చేపట్టేందుకు రూ.53 లక్షలు కోరారు. వీటితో సాధారణ మరమ్మతులు, గ్రీజు పూయడం వంటి పనులు చేయనున్నారు.
  • తాజాగా మరో నివేదిక అడగడంతో అత్యవసరంగా 175 పనులకు రూ.18.75 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా నివేదికలు తయారు చేశారు. వీటిని ప్రాజెక్టుల వారీగా ప్రభుత్వానికి సోమవారం అందజేస్తామని కర్నూలు సీఈ కె.కబీర్‌ బాషా తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు