logo

నగరంలో రహదారుల విస్తరణకు ప్రణాళిక : మంత్రి టీజీ భరత్‌

ప్రజలు, ప్రభుత్వం పరస్పర అంగీకారంతో కర్నూలు నగరంలో రహదారుల విస్తరణ చేపట్టనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ పేర్కొన్నారు. కర్నూలు నరగ ప్రజలకు ట్రాఫిక్‌ కష్టాలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Published : 28 Jun 2024 04:41 IST

ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి టీజీ భరత్‌ 

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ప్రజలు, ప్రభుత్వం పరస్పర అంగీకారంతో కర్నూలు నగరంలో రహదారుల విస్తరణ చేపట్టనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ పేర్కొన్నారు. కర్నూలు నరగ ప్రజలకు ట్రాఫిక్‌ కష్టాలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గురువారం ప్రభుత్వ అతిథి గృహంలో ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులతో రహదారుల విస్తరణ, ట్రాఫిక్‌ నియంత్రణపై మంత్రి సమీక్షించారు. జనాభాకు అనుగుణంగా రహదారుల విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాన కూడలి రాజ్‌విహార్‌లో ట్రాఫిక్‌ కష్టాలు తీవ్రంగా ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం ఆనంద్‌ థియేటర్‌ ఎదురుగానున్న హంద్రీ వంతెన వద్ద నుంచి వాహనాలు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అవసరమైతే ఫ్లైఓవర్, అండర్‌ పాస్‌ వంతెన నిర్మించేందుకు అధ్యయనం చేయాలన్నారు. రాజ్‌విహార్‌ కూడలిని విస్తరించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. కోర్టు భవనాలతోపాటు జడ్జిల నివాసాలు ఏ స్థితిలో ఉన్నాయో పరిశీలించి అవసరమైన మరమ్మతులు వెంటనే చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను  పరిశీలించి మరమ్మతులు చేయాలన్నారు. చిన్నపిల్లల పార్కు నుంచి వడ్డెగేరి, ఉస్మానియా కళాశాల మీదుగా బుధవారపేట, కలెక్టరేట్‌ వరకు రోడ్డు విస్తరణ చేపట్టాలన్నారు. ఆ ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలు, దుకాణదారులతో మాట్లాడి తగిన నష్టపరిహారం చెల్లించాలన్నారు. కర్నూలు నుంచి కల్లూరుకు వెళ్లే మార్గంలోని వక్కెర వాగుపై హైలెవెల్‌ వంతెన నిర్మించేందుకు అధ్యయనం చేయాలన్నారు. బళ్లారి చౌరస్తా వద్ద ట్రాఫిక్‌ నియంత్రణకు హైదరాబాద్‌ నుంచి వచ్చే వాహనాలను ఎస్‌ఏపీ క్యాంపులో వచ్చే విధంగా పరిశీలించాలని మంత్రి టీజీ భరత్‌ అధికారులను ఆదేశించారు.  ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నాగరాజు, ఈఈలు సురేష్‌బాబు, కృష్ణారెడ్డి, డీఈలు ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని