logo

మా అమ్మది రాజకీయ హత్యే

తమ తల్లి హత్యలో ఆస్తి కోణం కంటే రాజకీయ కోణమే ఎక్కువగా ఉందని అట్ల శ్రీదేవి పిల్లలు హర్షవర్థన్‌రెడ్డి, రమ్య ఆరోపించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో గురువారం అట్ల శ్రీదేవి అంత్యక్రియల సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు.

Published : 28 Jun 2024 04:29 IST

ప్రధాన నిందితులైన ఏవీ దంపతులను అరెస్టు చేయాలి
హతురాలు అట్ల శ్రీదేవి పిల్లలు హర్షవ్ధన్‌రెడ్డి, రమ్య డిమాండు 

శ్రీదేవి అంత్యక్రియల్లో అఖిలప్రియ దంపతులు

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: తమ తల్లి హత్యలో ఆస్తి కోణం కంటే రాజకీయ కోణమే ఎక్కువగా ఉందని అట్ల శ్రీదేవి పిల్లలు హర్షవర్థన్‌రెడ్డి, రమ్య ఆరోపించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో గురువారం అట్ల శ్రీదేవి అంత్యక్రియల సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. తమ చిన్నాన్నతో 20 ఏళ్లుగా ఆస్తి గొడవలు ఉన్నాయని, ఇన్నేళ్లుగా జరగనివి ఇప్పుడు జరుగుతున్నాయంటే అందుకు రాజకీయ కోణమే కారణమన్నారు. హత్యకు ఏవీ సుబ్బారెడ్డి దంపతులు కుట్రలు పన్నుతున్నారని తమ తల్లి కొన్ని రోజుల కిందటే తమకు సమాచారం ఇచ్చారన్నారు. తమ చిన్నాన్న, బాబాయ్‌లతో ఏవీ సుబ్బారెడ్డే ఈ హత్య చేశారని వారు ఆరోపించారన్నారు. బోండా ఉమ మద్దతుగా ఉన్నారనే ఏవీ ఇంతకు తెగించారన్నారు. ఒక తెదేపా కార్యకర్తగా పార్టీ గెలుపుకోసం తమ తల్లి ఎంతో కృషి చేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేశ్‌ తమకు న్యాయం చేయాలని వారు కోరారు. భూమా అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్‌పై హత్యాయత్నం ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని అప్పుడే పోలీసులు అరెస్టు చేసి ఉంటే తమ తల్లి హత్య జరిగేది కాదని వారు ఆరోపించారు. బాబాయ్‌ త్రినేత్ర మోహన్‌రెడ్డి మాట్లాడుతూ హత్య కేసులో ముద్దాయిలుగా ఉన్న ఏవీ దంపతులను వెంటనే పోలీసులు అరెస్టు చేయకపోతే ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తామన్నారు. గతంలో తనపై కూడా ఏవీ సుబ్బారెడ్డే హత్యాయత్నం చేశారని, రాయలసీమలో ఒక మహిళను హత్య చేసేందుకు ఏవీ సుబ్బారెడ్డి పూనుకోవడం దుర్మార్గమన్నారు.

భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు

ఆళ్లగడ్డలో అట్ల శ్రీదేవి అంత్యక్రియలు భారీ బందోబస్తు మధ్య నిర్వహించారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌ రామ్‌ పాల్గొన్నారు. అంత్యక్రియల్లో పాల్గొని భార్గవ్‌ రామ్‌ పాడె మోశారు. సబ్‌ డివిజన్‌ పరిధి నుంచి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఆళ్లగడ్డకు తరలివచ్చాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని