logo

అరణ్యరోదన

జనాలపై వన్యప్రాణులు చేస్తున్న దాడుల ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువవుతున్నాయి. మనుషులు తమ స్వార్థం కోసం అడవుల్లోని చెట్లను నరికేస్తుండటంతో అక్కడ ఉండాల్సిన వన్యప్రాణులు గ్రామాలపైకి వచ్చి జనాలపై దాడులు చేస్తూ వారి ప్రాణాలను బలిగొంటున్నాయి.

Published : 27 Jun 2024 02:08 IST

జనాలపై వన్యప్రాణుల దాడులు
వరుస ఘటనలతో బెంబేలెత్తుతున్న స్థానికులు

ఎలుగు దాడిలో గాయపడిన వ్యక్తి (పాత చిత్రం)

జనాలపై వన్యప్రాణులు చేస్తున్న దాడుల ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువవుతున్నాయి. మనుషులు తమ స్వార్థం కోసం అడవుల్లోని చెట్లను నరికేస్తుండటంతో అక్కడ ఉండాల్సిన వన్యప్రాణులు గ్రామాలపైకి వచ్చి జనాలపై దాడులు చేస్తూ వారి ప్రాణాలను బలిగొంటున్నాయి. వరుస సంఘటనలతో జనాలు ఆందోళన చెందుతున్నారు.  

 న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ, ఆళ్లగడ్డ గ్రామీణం, రుద్రవరం, శిరివెళ్ల, మహానంది

  • శిరివెళ్ల మండలం పచ్చర్ల పరిధిలో మంగళవారం చిరుతపులి జరిపిన దాడిలో మహదేవపురం మాజీ సర్పంచి మెహెహరున్నిసా బేగం మరణించారు. మొహం ఆనవాళ్లు గుర్తుపట్టలేని విధంగా ఆమె మృతదేహం లభ్యమైంది. అంతకు పది రోజుల ముందే చెలిమ రేంజ్‌ పరిధిలో రైల్వేలైన్‌ వద్ద పనులు చేసేందుకు వచ్చిన బాలికపైన కూడా చిరుత దాడి చేసింది.
  • అహోబిలం పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో మూడేళ్ల కిందట అడవి కుక్క దాడి చేసిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. వారిలో ఎనిమిదేళ్ల బాలిక ఉంది
  • హరినగరం, అహోబిలం గ్రామాలకు చెందిన చెంచులు అటవీ ప్రాంతంలోకి వెళ్లినప్పుడు ఎలుగు బంట్లు మూడుసార్లు దాడులు చేయడంతో ముగ్గురు గాయపడ్డారు.
  • పచ్చర్ల గ్రామంలో రెండు వారాల క్రితం ఓ వ్యక్తిపై చిరుత దాడికి యత్నించగా త్రుటిలో ఆయన తప్పించుకున్నారు. నాలుగురోజుల కిందట ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఓ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీన్ని గుర్తించిన స్థానికులు బిగ్గరగా కేకలు వేయడంతో సమీప అటవీ ప్రాంతంలోపలకు చిరుత పరుగులు పెట్టింది.

చిరుతపులిని పట్టుకునేందుకు అధికారులు ఏర్పాటు చేసిన బోను

కెమెరాల చోరీ

నిషిద్ధమైన అటవీ ప్రాంతంలోకి యథేచ్ఛగా స్మగ్లర్లు, వేటగాళ్లు వెళ్తున్నా వారిని కట్టడి చేయడంలో అటవీ సిబ్బంది విఫలమవుతున్నారు. రెండేళ్ల కిందట వన్యప్రాణుల గణనకు ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాలు చోరీకి గురయ్యాయి. అటవీ సిబ్బంది నిఘాలో వైఫల్యాన్ని తెలియజేస్తున్నాయి.

పచ్చర్ల గ్రామస్థుల భయాందోళన

నంద్యాల-ఒంగోలు ప్రధాన రహదారిలోని నల్లమల అటవీ ప్రాంతంలో పచ్చర్లకు చెందిన మాజీ ఉపసర్పంచి మెహరూన్‌బీని చిరుత దాడి చేసి చంపిన ఘటనపై అందరిలోనూ ఆందోళన రేగుతోంది. బుధవారం ఉదయం కూడా పచ్చర్ల గ్రామరహదారిపై చిరుతపులి వెళ్లడం చూసినట్లు పలువురు గ్రామస్థులు చెబుతూ తాము ఇక్కడ ఉండలేమని వారంతా ప్రధాన రహదారిపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ప్రధాన రహదారిపై వాహనాలను నిలిపి భారీగా ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న అటవీ, పోలీసుశాఖ అధికారులు స్పందించారు. చిరుతపులిని పట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, త్వరలో ఇది దొరుకుతుందని చెప్పడంతో ఆందోళనను వారు విరమించారు. ముమ్మరంగా చర్యలు అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకునేందుకు దాడి చేసిన ప్రదేశంతోపాటు మరికొన్ని చోట్ల పలు ట్రాప్‌ కెమెరాలతో పాటు రెండు బోనులను ఏర్పాటు చేశారు. చిరుతపులి దాడి ఘటనలో గ్రామంలో ఎప్పుడేమి జరుగుతుందోనని గ్రామస్థులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని జీవిస్తున్నారు. పచ్చర్ల గ్రామానికి చెందిన మెహరూన్‌బీపై చిరుతపులి దాడిచేసి చంపేసిన ప్రదేశాన్ని బుధవారం అటవీ, పోలీసుశాఖల అధికారులు పరిశీలించారు. సమీప ప్రాంతాల్లో మృతురాలి రక్తపు మరకలు, చిరుత వేలిముద్రలు, పాదముద్రల నమూనాలను సేకరించారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా ఎవరూ బయటికి వెళ్లొద్దని, ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో రావాల్సి ఉంటే గుంపులుగా రావాలని, బిగ్గరగా కేకలు వేస్తుండాలని సూచించారు. చిరుతపులిని వీలైనంత త్వరగా బోనుల్లో బంధించేందుకు తమవంతు చర్యలు తీసుకుంటామని చలిమరేంజ్‌ ఎఫ్‌ఆర్‌వో ఈశ్వరయ్య తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు