logo

నృత్యకళల్లో మేటి.. మేఘన కీర్తి

సాధించాలనే తపన.. లక్ష్యం చేరుకోవాలనే పట్టుదల ఉంటే.. విజయాలు దరిచేరుతాయని నిరూపిస్తున్నారు ఆదోని పట్టణానికి చెందిన నృత్య కళాకారిణి కామళే మేఘన.

Published : 27 Jun 2024 02:12 IST

నృత్య కళాకారిణి కామళే మేఘన 

సాధించాలనే తపన.. లక్ష్యం చేరుకోవాలనే పట్టుదల ఉంటే.. విజయాలు దరిచేరుతాయని నిరూపిస్తున్నారు ఆదోని పట్టణానికి చెందిన నృత్య కళాకారిణి కామళే మేఘన. సంప్రదాయ నృత్యమైన కూచిపూడి, భరత నాట్యంలో రాణిస్తూనే మరోవైపు కర్ణాటక సంగీతంలో గాయకురాలిగా రాణిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నాట్య ప్రదర్శనలు ఇచ్చి వందల సంఖ్యలో అవార్డులు.. రివార్డులు పొందారు.

 న్యూస్‌టుడే, ఆదోని సాంస్కృతికం

  సాధన మొదలై..

ఆదోని పట్టణం ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్న బ్యాంకు ఉద్యోగి కామళే రమేశ్‌బాబు, కామళే విజయలక్ష్మి దంపతుల మూడో కుమార్తె కామళే మేఘన ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. చదువుతో పాటు సంప్రదాయ నృత్యంపై ఆసక్తితో తల్లిదండ్రులు, సోదరీమణులు ప్రోత్సాహంతో 2015 సంవత్సరం నుంచి కూచిపూడి, భరతనాట్యంతో పాటు కర్ణాటక సంగీతంలో గాయనిగా సాధన చేయడం మొదలుపెట్టారు. అనంతపురానికి చెందిన శ్రీనృత్య కళానిలయం గురువు గుంటూరు సంధ్యామూర్తి వద్ద నృత్యం, సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు. రోజూ ఉదయం, సాయంత్రం మూడు గంటల పాటు ఓ వైపు నృత్యంలో.. మరోవైపు సంగీతంలో సాధన చేస్తూ ప్రావీణ్యం సంపాదించారు.

వందల సంఖ్యలో ప్రదర్శనలు

నాట్య కళాకారిణి కామళే మేఘన తన కూచిపూడి, భరత నాట్యంతో సభికులను ఆకట్టుకుంటున్నారు. బెంగళూరు, కలకత్తా, హైదరాబాదు, ముంబాయి, అనంతపురం, కర్నూలు తదితర పెద్ద పెద్ద నగరాల్లో వందల సంఖ్యలో నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. నేపాల్‌ దేశంలోని కాట్‌మాండో నగరంలోనూ తన ప్రదర్శన ఇచ్చి సభికుల చేత జేజేలు అందుకున్నారు. వందల సంఖ్యలో అవార్డులు.. రివార్డులు సొంతం చేసుకున్నారు.

బిరుదులు.. అవార్డులు

కళాకారిణి కామళే మేఘన ప్రధానంగా తన నృత్యంతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు, ఏషియా బుక్‌ ఆఫ్‌ రికార్డు, భారత్‌ వరల్డ్‌ రికార్డు, వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు ఇంటర్నేషనల్, ట్రెడిషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డు, ట్రెజర్‌ హంట్‌ రికార్డ్సు ఇంటర్నేషనల్‌ అవార్డులు సొంతం చేసుకున్నారు. చెన్నై నగరంలో 2017లో నృత్య నాట్యాలయ సంస్థ నిర్వహించిన పోటీల్లో భారత మజై 5050 అవార్డు సొంతం చేసుకున్నారు. కోల్‌కతాలో 2018లో జరిగిన ఆల్‌ ఇండియా చిల్డ్రన్స్‌ డాన్స్‌ ఫెస్టివల్‌లో నృత్యరత్న అవార్డు, అనంతపురంలో 2018లో జరిగిన ఆల్‌ ఇండియా డ్యాన్స్‌ ఫెస్టివల్‌లో నృత్య మంజీరా అవార్డు, 2019లో హైదరాబాద్‌లో బింగి మల్లేశ్వరి మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో ప్రతిభ అవార్డు, బెంగళూరు మహా ఉత్సవ్‌ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో ప్రతిభ చాటారు. కోల్‌కతాలోని భారత్‌ సంస్కృతి ఉత్సవ్‌ పోటీల్లో ప్రెసిడెంట్‌ అవార్డు, 2022లో అనంతపురంలో జరిగిన పోటీల్లో నాట్య ముక్త, శిష్య చాముండి అవార్డు సొంతం చేసుకున్నారు. ఇవే కాక వందల సంఖ్యలో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు.

సంప్రదాయ కళలను పరిరక్షించాలని..

ప్రస్తుతం వస్తున్న తరాలు సంప్రదాయ కళలపై ఆసక్తి చూపడం లేదు. కళల పరిరక్షణకు నా వంతుగా కృషిచేస్తా. భరతనాట్యంలో ప్రారంభిక, ప్రవేశిక ప్రథమ్, ప్రవేశిక పూర్ణ, మధ్యమ ప్రథమ్‌ పూర్తి చేశాను. కూచిపూడి నృత్యంలో ఫౌండేషన్‌ కోర్సుతో పాటు లెవల్‌-4 పూర్తి చేశా. కర్ణాటక సంగీతంలోనూ లెవల్‌-5 పూర్తిచేయగలిగా. ప్రధానంగా సంప్రదాయ కళలైన భరతనాట్యం, కూచిపూడి నృత్యాన్ని భావితరాలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. కళాసేవలో తరించడమే జీవిత లక్ష్యం.

కామళే మేఘన, నృత్య కళాకారిణి, ఆదోని

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని