logo

ప్రగతి బాటల నిర్మాణం

గత ఐదేళ్లు వైకాపా సర్కారు ‘రోడ్ల’ నిర్వహణను గుంతల్లో వదిలేసింది.. మృత్యు‘గుంత’లు పలువురి ప్రాణాలు తీశాయి. గతంలో తెదేపా హయాంలో తీసుకొచ్చిన పలు ప్రాజెక్టులు వైకాపా నిధులివ్వక వెనక్కి వెళ్లాయి.

Published : 27 Jun 2024 02:12 IST

 నాలుగు వరుసలుగా కర్నూలు-ఆలూరు దారి
రోడ్ల బాగుతో పారిశ్రామికాభివృద్ధి  
‘ఈనాడు’ ముఖాముఖిలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న బీసీ జనార్దన్‌రెడ్డి

గత ఐదేళ్లు వైకాపా సర్కారు ‘రోడ్ల’ నిర్వహణను గుంతల్లో వదిలేసింది.. మృత్యు‘గుంత’లు పలువురి ప్రాణాలు తీశాయి. గతంలో తెదేపా హయాంలో తీసుకొచ్చిన పలు ప్రాజెక్టులు వైకాపా నిధులివ్వక వెనక్కి వెళ్లాయి. మార్గం సుగమం చేస్తారన్న కోటి ఆశలతో జనం కూటమికి అధికారం కట్టబెట్టారు. అభివృద్ధిని ప్రగతి ‘బాట’ పట్టిస్తామని రహదారులు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖల మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. సరకులు వేగంగా చేర్చడానికి రహదారులు ఉంటే పరిశ్రమలూ తరలొస్తాయి.. ఈ నేపథ్యంలోనే అభివృద్ధి చెందిన దేశాలు రహదారులు విస్తరించడానికి అగ్రప్రాధాన్యం ఇస్తుంటాయి.. ఉమ్మడి కర్నూలు జిల్లాకు భారీ ఎత్తున పరిశ్రమలు తరలిరావడానికి వీలుగా రోడ్లను గణనీయంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.రాష్ట్ర మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన ‘ఆయన’ ‘ఈనాడు’ ముఖాముఖిలో మాట్లాడారు.

ఈనాడు, కర్నూలు

ఆలూరు జిల్లా సరిహద్దులో ఉంది. జిల్లా కేంద్రం కర్నూలుకు రావాలంటే 103 కి.మీ. మేర ప్రయాణించాల్సి ఉంటుంది. అత్యంత కీలకమైన ఈ రహదారిని నాలుగు వరుసలుగా మార్చాల్సి ఉంది. వైకాపా హయాంలో ఆ రహదారి ప్రతిపాదనను ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ రహదారి మీదుగానే కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గ వాసులు ప్రయాణం చేస్తుంటారు. ఈ రోడ్డును వెంటనే పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రవాణా సౌకర్యం మెరుగుపడి జిల్లా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది.

సమీక్షించి..

కర్నూలు నగరంలో  973 ఆర్‌అండ్‌బీ వసతిగృహాలున్నాయి. వాటిలో 446 వసతిగృహాల్లో అనధికార వ్యక్తులే పాగావేసినట్లు అధికారులు గుర్తించారు. శిథిల భవనాల స్థానంలో అధునాతన వాణిజ్య సముదాయాలు నిర్మిస్తే ఆ ప్రాంతానికి కొత్తకళ వచ్చినట్లవుతుది.

25 రహదారులకు వెంటనే మరమ్మతులు

రోడ్ల మరమ్మతులకు తెదేపా హయాంలో (2014-19) ఏటా రూ.30-రూ.50 కోట్ల వరకు నిధులు మంజూరు చేసేవారు. వాటితో రహదారులకు ఇరువైపులా ఉన్న ముళ్లపొదల తొలగింపు, గుంతల పూడ్చివేత, సూచికలు ఏర్పాటు, వంతెనలకు మరమ్మతులు వంటి పనులు చేపట్టేవారు. తర్వాత వైకాపా పాలన (2019-24)లో ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం గుంతల్లో తారు వేయడానికి చిల్లిగవ్వ ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి జిల్లాలో 25 ప్రధాన రహదారులకు వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.46 కోట్లతో యుద్ధప్రాతిపదికన చేస్తాం.

కొత్త రైల్వేలైన్‌ ఏర్పాటు

కర్నూలు నుంచి బుగ్గనపల్లె సిమెంట్‌నగర్‌ స్టేషన్‌ వరకు రైల్వేలైన్‌ నిర్మాణ ప్రతిపాదన ఉంది. రైల్వే అధికారులూ సర్వే చేపట్టారు. అక్కడి నుంచి బనగానపల్లి రైల్వేస్టేషన్‌కు కొత్త లైన్‌ వేస్తే కర్నూలు నుంచి బనగానపల్లికి వేగంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ మార్గంలో రైల్వేలైన్‌ ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలిస్తాం. ఆయా ప్రతిపాదనలు సాకారమైతే ఉమ్మడి జిల్లా నుంచి పలు ప్రాంతాలకు రైళ్లలో వేగంగా ప్రయాణించడానికి అవకాశం కలిగినట్లే.

విమానాశ్రయం అభివృద్ధిపై దృష్టి

విమానాశ్రయాల అభివృద్ధి నా మంత్రిత్వశాఖ పరిధిలోనే ఉన్నందున కర్నూలు విమానాశ్రయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తా. కర్నూలు విమానాశ్రయం నుంచి ప్రస్తుతానికి వారంలో మూడు రోజుల్లో మాత్రమే చెన్నై, విశాఖ వెళ్లేలా చెన్నై-కర్నూలు-విశాఖ విమానాన్ని నడుపుతున్నారు. కర్నూలు నుంచి మరిన్ని నగరాలతో అనుసంధానం కావాల్సిన అవసరం ఉంది. విజయవాడ, తిరుపతి, గోవా, కోయంబత్తూరు, బెంగళూరు తదితర నగరాలకు కొత్త సర్వీసులు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. ఆమేరకు విమానయాన సంస్థలతో సంప్రదింపులు చేస్తున్నాం.

నాపరాతి పరిశ్రమలు.. పూర్వ వైభవం

బనగానపల్లి నియోజకవర్గంలో నాపరాతి పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొస్తాం. ఈ పరిశ్రమతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 40 వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. రాయల్టీ తగ్గించే ఏర్పాటు చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో మాట్లాడి పరిశ్రమలు నష్టాల ఊబి నుంచి బయటపడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఉపాధి కోసం వలసలు వెళ్లకుండా చర్యలు చేపడతాం.

దశలవారీగా పూర్తి

నిధులు ఇవ్వకపోడంతో గత ఐదేళ్లూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ‘మేజర్‌ ప్లాన్‌’ పనులు చేసేందుకు గుత్తేదారులు ఆసక్తి చూపలేదు. దీంతో గ్రామాలు, మండల కేంద్రాలను కలిపే రహదారులు నరకానికి నకళ్లుగా మారాయి. మూడేళ్లుగా బండి ఆత్మకూరు-ఓంకారం రహదారి పనులు సా..గుతూనే ఉన్నాయి. రూ.19 కోట్లతో చేపడుతున్న ఈ రహదారి పనులు అస్తవ్యస్తంగా మారడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి జిల్లా కర్నూలు జిల్లాలో రహదారుల, భవనాలశాఖ పరిధిలో మొత్తం 3400.028కి.మీ.ల మేర రహదారులున్నాయి. ఎంత మేర పాడయ్యాయి.. మరమ్మతులకు ఎంత ఖర్చవుతుందనే అంశాలపై అధికారులతో సమీక్షిస్తాం. అనంతరం దశలవారీగా పనులు పూర్తి చేస్తాం.

వైకాపా పట్టించుకోలేదు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 157 కి.మీ. మేర కొత్త రహదారుల నిర్మాణానికి కేంద్రం అనుమతిచ్చింది. కేంద్రం 70 శాతం నిధులు ఇస్తుంది.. మిగిలిన 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.. ఒక్క రహదారి మినహా మిగిలినవన్నీ ప్రశ్నార్థకంగానే మారాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఉమ్మడి జిల్లాలో 131 రహదారులను రూ.336 కోట్లతో బాగు చేసేందుకు ఎన్‌డీబీ (న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు) ముందుకొచ్చింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా పట్టించుకోలేదు. రామళ్లకోట- బేతంచెర్ల రహదారి పనులు పూర్తి చేసి మిగిలినవి వదిలేశారు. ఆయా రహదారుల నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని