logo

‘కుడా’ ఎడాపెడా దోపిడీ

‘‘ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కల్లూరు పరిధిలో ఐదుగురు కలిసి 18 ఎకరాల్లో వెంచర్‌ వేశారు. భూ బదలాయింపు జరగలేదు. విషయం తెలుసుకొన్న వైకాపా నేత వారిని పిలిపించి పంచాయితీ పెట్టారు.

Updated : 27 Jun 2024 04:52 IST

వెంచర్లలో వైకాపా అ‘జెండా’
పుట్టగొడుగుల్లా అనధికారిక వెంచర్లు
 కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

‘‘ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కల్లూరు పరిధిలో ఐదుగురు కలిసి 18 ఎకరాల్లో వెంచర్‌ వేశారు. భూ బదలాయింపు జరగలేదు. విషయం తెలుసుకొన్న వైకాపా నేత వారిని పిలిపించి పంచాయితీ పెట్టారు. వెంచర్‌లో తనకూ వాటా ఇవ్వాలని సదరు నేత తీర్పు చెప్పారు.’’ ఇలా గత ఐదేళ్లుగా ఉమ్మడి జిల్లాలో వైకాపా నేతలు స్థిరాస్తి వెంచర్లలో వాటాలు పుచ్చుకొన్నారు. అక్రమ వెంచర్లను అడ్డుకోవడానికి కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా)ని విస్తరించినట్లు చెప్పి ఎక్కడికక్కడ బేరం పెట్టారు. ఒక్కో వెంచర్‌ నుంచి (భూమి విలువ) రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అప్పటి ప్రజాప్రతినిధుల జేబులు నింపుకొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పటి ‘అధికార’ అండదండలు ఉండటంతో స్థిరాస్తి వ్యాపారులు పక్కనున్న ప్రభుత్వ భూములను వెంచరల్లో కలిపేసుకుంటున్నారు. పోరంబోకు, వంక భూములు, కాల్వలు కలిపేసుకొన్నారు. కుడాలో ఓ నేత అన్నీతానై నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్సు విచారణ చేస్తే అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

అక్రమాల విస్తరణ

కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) 2017లో ఏర్పడింది. మొదట 2,599 చదరపు కి.మీ.ల విస్తీర్ణంలో కర్నూలు నగరపాలకసంస్థతోపాటు నంద్యాల, డోన్, మున్సిపాలిటీలు, గూడూరు, బేతంచెర్ల నగర పంచాయతీల్లో 117 గ్రామాల పరిధిలో కుడా ఏర్పాటు చేశారు. తర్వాత వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత కుడా పరిధిని విస్తరించారు. ఉమ్మడి జిల్లాలోని 53 మండలాలను కలుపుకొని 15,306 చదరపు కి.మీల విస్తీర్ణంలో 896 గ్రామాలను కుడా పరిధిలోకి తీసుకొచ్చారు. కర్నూలు, కల్లూరు, ఓర్వకల్లు, నంద్యాల, పాణ్యం పరిధిలో అనుమతుల్లేని వెంచర్లు అత్యధికంగా ఉన్నాయి. ఆత్మకూరు, నందికొట్కూరు, కోడుమూరు, బేతంచెర్ల, బనగానపల్లి, ఆదోని, వెల్దుర్తి, పత్తికొండ, ఎమ్మిగనూరు పరిధిలో వెంచర్లు ఇష్టానుసారంగా వేశారు. పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నా అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేకుండా అప్పటి నాయకులు భరోసా ఇచ్చారు.

కల్లూరు వక్కెరవాగు సమీపంలో కొంతమంది రియల్టర్లు కలిసి వాగు స్థలాన్ని దర్జాగా ఆక్రమించారు. ఏకంగా వక్ఫ్‌ బోర్డు భూమిలోనే వెంచర్‌ వేశారు. వక్కెర వాగు స్థలంలో రహదారి నిర్మించారు. సర్వే నంబరు మార్చి ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు.  

నిబంధనలు కాలరాశారు

ఏదైనా వెంచరు వేస్తే కుడా అనుమతుల కోసం ఎకరాకు రూ.70 వేల వరకు చలానా రూపంలో చెల్లించాలి. దీంతోపాటు వెంచర్‌లో పది శాతం ఖాళీ స్థలం వదలాలి. తప్పనిసరిగా 40 అడుగుల అప్రోచ్‌ రహదారి ఉండాలి. వెంచర్‌ వేసిన క్రమంలో కొన్ని ప్లాట్లను కుడా మార్టిగేజ్‌ చేసుకుంటుంది. వెంచర్‌లో రహదారులు, డ్రైనేజీ వసతి, ఇతరత్రా సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. అలా చేయకుంటే వెంచరులో మార్టిగేజ్‌ చేసిన ప్లాట్లను విక్రయించి వెంచర్‌ను అభివృద్ధి చేసే బాధ్యత కుడాపై ఉంటుంది. కార్పొరేషన్ల పరిధిలో 25 సెంట్లు, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో 7.5 సెంట్లకుపైగా ఉంటే కుడా అనుమతి పొందాలి. జీ+5కు మించి భవనం నిర్మించాల్సి వస్తే డీటీసీపీ అనుమతి పొందాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నిబంధనలు ఎక్కడా అమలు చేయలేదు. గత ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ హయాంలో అనధికారిక లేఅవుట్లపై ఏమాత్రం చర్యలు తీసుకోలేదు.

రెవెన్యూ శాఖకు రూ.100 కోట్ల గండి

వెంచర్లు చేయాలంటే ముందుగా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. స్థిరాస్తి వ్యాపారులు ఎకరం భూమి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు, రూ.20 లక్షలు, రూ.50 లక్షలు, రూ.కోటి వరకు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌ విలువలో 5 శాతం మొత్తాన్ని ప్రభుత్వానికి (రెవెన్యూ) చలానా రూపంలో చెల్లించాలి.  వ్యాపారులు ఎగనామం పెట్టడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెవెన్యూ శాఖకు రూ.100 కోట్లకుపైగా గండిపడింది.

పోస్టుల భర్తీలో అలసత్వం

కుడాలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడంలో గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ముఖ్యమైన పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నా పట్టించుకోలేదు. వార్డు ప్లానింగ్‌ సెక్రటరీలు 18 మంది కుడాలోకి తీసుకుని పనిచేయిస్తున్నారు. సెక్రటరీ, ఏవో, ఈఈ, ఎగువ, దిగువ శ్రేణి సహాయకులతోపాటు పలు  పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

రూ.25 కోట్లు కోల్పోయిన కుడా

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 472 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు 2020లో అధికారులు గుర్తించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 1,715 ఎకరాల్లో 276, పట్టణ ప్రాంతాల్లో 1,800 ఎకరాల్లో 196 అక్రమ లేఅవుట్లు ఉన్నాయి. ఐదేళ్ల కాలంలో సరాసరిన 900 ఎకరాల్లో 300 వెంచర్ల వరకు అనుమతులిచ్చినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మరో 250 అనధికారిక వెంచర్లకు తాఖీదులు ఇచ్చినట్లు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఐదు వేల ఎకరాల్లో అనధికారిక వెంచర్లు వెలిసినట్లు వెలుస్తోంది. ఎకరా భూమి కొనుగోలు చేస్తే అందులో రహదారులు, ఖాళీ స్థలం, పార్కు.. ఇలా అన్నింటికి కలిపి 40 సెంట్ల స్థలం పోతుంది. మిగిలిన 60 సెంట్ల స్థలంలో 2.75 సెంట్లు, 4, 5 సెంట్లు.. ఇలా ప్లాట్లుగా వేసి విక్రయిస్తున్నారు. వీటికి కుడాకు అనుమతుల తీసుకుంటే సుమారు రూ.25 కోట్ల వరకు ఆదాయం వచ్చేంది. నేతల అండదండలు ఉండటంతో అనుమతులు లేకుండానే వ్యాపారాలు సాగిస్తున్నారు.

ఆక్రమణకు వైకాపా నేతల అభయం

  • ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం ఉన్నవన్నీ అక్రమ లేఅవుట్లే. అప్పటి ప్రజాప్రతినిధులకు ఎకరాకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ముడుపులు ముట్టజెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 250-300 ఎకరాల్లో అక్రమ వెంచర్లు వెలిశాయి.
  • ఆదోని నియోజకవర్గ పరిధిలో ఎమ్మిగనూరు, పత్తికొండ, శిరుగుప్ప రహదారుల వెంట 50కిపైగా అనధికారిక లేఅవుట్లలో 300 ఎకరాల్లో ప్లాట్లు వేశారు. అప్పటి స్థానిక ప్రజాప్రతినిధి అనుగ్రహం లేకపోతే వ్యాపారం చేసే పరిస్థితి ఉండేది కాదు. ఒకవేళ ప్లాట్లు వేసి అమ్మేందుకు ముందడుగు వేస్తే పాతిన రాళ్లు తొలగించేసి రహదారులను చదును చేయించేవారు.
  • పత్తికొండ నియోజకవర్గంలో పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, కృష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లో 400 ఎకరాల విస్తీర్ణంలో అనధికారిక లేఅవుట్లు వెలిశాయి.
  • ‘కొత్త’ జిల్లా పేరు చెప్పుకొని నంద్యాల పట్టణంలో పుట్టుగొడుగుల్లా వెంచర్లు వెలిశాయి. కేసీ భూములు ఆక్రమించుకొని వెంచర్ల హద్దు రాళ్లు పాతారు. వీటికి అప్పటి ప్రజాప్రతినిధుల అండదండలు దండిగా ఉన్నాయి.
  • ఆళ్లగడ్డ పట్టణంలో మొత్తం 60కిపైగా అక్రమ లే అవుట్లు ఉండగా పట్టణ ప్రణాళిక విభాగం వారు తొమ్మిది, ‘కుడా’ వారు ఐదు అక్రమ మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. చాలా వరకు గతంలో ఉన్న అధికార పార్టీ అండదండలతోనే ఇవి ఏర్పడ్డాయి. ఆళ్లగడ్డ పురపాలిక పరిధిలో అనుమతులు ఉన్న లే అవుట్ల సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.
  •  నందికొట్కూరు పురపాలక సంఘంలో వైకాపా నేతలే స్థిరాస్తి వ్యాపారుల అవతారమెత్తారు. గత ఐదేళ్లలో ఇక్కడ 250 వరకు వెంచర్లు వెలిశాయి. ఇప్పటి వరకు పురపాలక సంఘంలో ఒక్క లేఅవుట్‌కు మాత్రమే అనుమతి తీసుకున్నారు. మిగతావన్నీ అక్రమమే.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని