logo

పింఛను పండగ

చంద్రన్న మాట నిలబెట్టుకొన్నారు..అవ్వాతాతల కళ్లల్లో వెలుగులు నింపారు. సామాజిక భద్రత పింఛను మొత్తాన్ని జులై నుంచి రూ.4 వేలకు పెంచడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో లక్షలాది మంది లబ్ధిదారులకు మేలు చేకూరనుంది.

Updated : 27 Jun 2024 04:51 IST

 4.57 లక్షల మంది.. రూ.351.0 కోట్లు
వచ్చే నెల ఇంటింటికి పంపిణీ

చంద్రన్న మాట నిలబెట్టుకొన్నారు..అవ్వాతాతల కళ్లల్లో వెలుగులు నింపారు. సామాజిక భద్రత పింఛను మొత్తాన్ని జులై నుంచి రూ.4 వేలకు పెంచడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో లక్షలాది మంది లబ్ధిదారులకు మేలు చేకూరనుంది. ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించిన బకాయిల మొత్తం కలిపి జులైలో ఒక్కో పింఛనుదారుడికి రూ.7 వేలు అందించనున్నారు. వైకాపా హయాంలో జూన్‌లో ఉమ్మడి జిల్లాలో రూ.175.60 కోట్ల మేర పింఛను సొమ్ము పంపిణీ చేయగా.. ఈ జులైలో ప్రస్తుత ప్రభుత్వం రూ.351.00 కోట్ల పింఛన్‌ సొమ్మును అందించనుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటివద్దకే పింఛన్లు పంపిణీ చేయనున్నారు.

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే

వైకాపా ప్రభుత్వం మొత్తం 16 రకాల పింఛన్లు పంపిణీ చేయగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ పింఛన్ల సంఖ్యను 28 కేటగిరీలుగా విభజించింది. సామాజిక భద్రతా పింఛన్లతోపాటు దివ్యాంగులు, కిడ్నీ, తలసేమియా, ఇతర బాధితులను కేటగిరీలుగా విభజించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 11 రకాల సామాజిక పింఛనుదారులకు ప్రతి నెలా పింఛను రూ.4 వేలకు పెరిగింది. కర్నూలు జిల్లాలో 2,11,431 మంది, నంద్యాల జిల్లాలో 1,90,725 మంది కలిపి మొత్తం 4,02,156 మంది ఉన్నారు. 

అవ్వాతాతల ఆనందం

పింఛను మొత్తాన్ని చంద్రబాబు రూ.4 వేలకు పెంచడంతో వయో వృద్ధులకు ఆసరా లభించినట్లైంది. ఉమ్మడి జిల్లాలో 4.02 లక్షల మంది పింఛనుదారులు ఉండగా అందులో వృద్ధాప్య పింఛనుదారులే 2.41 లక్షల మంది ఉన్నారు. వీరికి జులైలో రూ.7 వేల చొప్పున రూ.169.37 కోట్లు కేటాయించనున్నారు.

దివ్యాంగులకు ఆసరా

దివ్యాంగులకు రూ.3 వేల పింఛను మొత్తాన్ని రూ.6 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లాలో 31,764, నంద్యాల జిల్లాలో 24,077 కలిపి మొత్తం 55,841 మంది దివ్యాంగులకు ఇకనుంచి ప్రతి నెలా రూ.33.50 కోట్లు పింఛన్ల కోసం ఖర్చు చేయనున్నారు. వీరికి వైకాపా ప్రభుత్వ హయాంలో రూ.16.75 కోట్లు మాత్రమే కేటాయించేవారు.

వీరికి రూ.15 వేలు

  •  పూర్తి వికలత్వం కలిగిన దివ్యాంగులకు ప్రతినెలా పింఛను రూ.15 వేలు అందిస్తామని సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రసుత్తం అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీని అమలు చేసేందుకు జీవో జారీ చేశారు. గత వైకాపా పాలనలో వీరికి ప్రతి నెలా రూ.3 వేలు మాత్రమే పింఛను వచ్చేది. ప్రసుత్తం తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా రూ.15 వేలు అందుకోనున్నారు.
  •  పెరాలసిస్‌ బారినపడి వీల్‌ఛైర్, మంచానికే పరిమితమైనవారు, తీవ్రమైన కండరాల బలహీనత కేసులు, ప్రమాద బాధితులకు ప్రతి నెలా పింఛనును కూటమి ప్రభుత్వం రూ.15 వేలకు పెంచింది. గతంలో వైకాపా పాలనలో వీరికి కేవలం రూ.5 వేలు మాత్రమే అందేది.
  •  బోధకాలు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్, డయాలసిస్‌ రోగులు తదితరులకు  ప్రతి నెలా రూ.5 వేలు ఇస్తుండగా ప్రస్తుతం రూ.10 వేలకు పెంచారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని