logo

పల్లె ఖాతాలు ఖాళీ చేసేశారు

వైకాపా ప్రభుత్వ హయాంలో తాము దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నాం.. విద్యుత్తు బిల్లుల పేరుతో  నిధులు లాక్కొన్నారు.. ఎంత ఖర్చయిందన్న వివరాలు తెలియడం లేదు.

Published : 27 Jun 2024 02:12 IST

 వైకాపా హయాంలో కష్టాలు ఎదుర్కొన్నాం
ఆర్థిక సంఘం సభ్యులకు సర్పంచుల మొర

సర్పంచుల సమస్యలు తెలుసుకుంటున్న ఎస్‌.ఎఫ్‌.సి. సభ్యుడు ఆచార్య ఎం.ప్రసాదరావు.
పక్కన నంద్యాల డీపీవో మంజులవాణి, జడ్పీ సీఈవో నాసరరెడ్డి తదితరులు

ఈనాడు, కర్నూలు : వైకాపా ప్రభుత్వ హయాంలో తాము దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నాం.. విద్యుత్తు బిల్లుల పేరుతో  నిధులు లాక్కొన్నారు.. ఎంత ఖర్చయిందన్న వివరాలు తెలియడం లేదు.. పంచాయతీలకు స్టాంప్‌ డ్యూటీ నిధులు చెల్లించడంలో అంతులేని జాప్యం జరుగుతోంది.. కార్మికులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని పల్లె ప్రథమ పౌరులు(సర్పంచులు) ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఎస్‌ఎఫ్‌సి సభ్యులు పంచాయతీరాజ్‌ సంస్థల అధికారులు, ప్రజాప్రతినిధులతో బుధవారం సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో సర్పంచులు, అధికారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు వీలుగా సమావేశం ఏర్పాటుచేశామని ఎస్‌ఎఫ్‌సి ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడుతూ కేంద్రం ఇచ్చే నిధులు పంచాయతీల ఖాతాల నుంచి ఖాళీ చేసేశారు.. కనీసం తమకు సమాచారం ఇవ్వలేదన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత కోసం స్వచ్ఛాంధ్ర] కార్పొరేషన్‌ నుంచి నిధులు విడుదల చేసేవారని... గతేడాది ఏప్రిల్‌ నుంచి నిధులు విడుదల చేయలేదన్నారు. ఇసుక రీచ్‌లు ఉన్న ప్రాంతాల నుంచి లక్షల టన్నుల ఇసుకను తరలించినా పంచాయతీలకు మాత్రం సీనరేజి నిధులు విడుదల చేసిన దాఖలాలు లేవని చెప్పారు. అనధికారికంగా గ్రావెల్‌ తవ్వి రాత్రి వేళల్లో తరలించారని ఆరోపించారు. గ్రామాల్లో లేఅవుట్లు వేస్తున్నవారి నుంచి రుసుములను వసూలు చేస్తున్నా ఆ మొత్తంలో పంచాయతీకి ఎలాంటి వాటా ఇవ్వడం లేదన్నారు. ఆర్థిక సంఘం నిధులు ఏమాత్రం సరిపోవడంలేదని వివరించారు. పంచాయతీల్లో పన్నుల వసూళ్లకు ఎదురవుతున్న ఇబ్బందులను ఎస్‌.ఎఫ్‌.సి. సభ్యులు అడిగి తెలుసుకున్నారు. గతేడాది నుంచి ఆన్‌లైన్‌లో పన్నులు చెల్లించే పద్ధతి అమలవుతోందని.. ఈ ప్రక్రియ మరింత సులభతరం కావాల్సిన అవసరం ఉందని పలువురు సూచించారు. పలు అంశాలను నంద్యాల డీపీవో మంజులావాణి వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో నాసరరెడ్డి, కర్నూలు డీపీవో టి.నాగరాజనాయుడు, డివిజినల్‌ పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు, ఈవోఆర్డీలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎస్‌.ఎఫ్‌.సి. సభ్యులు నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లి అదనపు కమిషనర్‌ రామలింగేశ్వర్‌ ఆధ్వర్యంలో కేఎంసీ రెవెన్యూ విభాగ సిబ్బందితో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు