logo

విధులు విస్మరించి.. వైకాపా సేవలో తరించి

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కర్నూలు నగరపాలక ఉన్నతాధికారులు నేటికీ వైకాపా నాయకుల సేవలోనే తరలిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాల్లో పెద్దఎత్తున నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి.

Published : 26 Jun 2024 04:55 IST

కార్పొరేషన్‌ ఉన్నతాధికారుల స్వామిభక్తి
ఈనాడు, కర్నూలు, నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కర్నూలు నగరపాలక ఉన్నతాధికారులు నేటికీ వైకాపా నాయకుల సేవలోనే తరలిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాల్లో పెద్దఎత్తున నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు చేయడంతో రాష్ట్రంలోని పలు నగరపాలక, పురపాలక సంస్థల ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేస్తుండగా.. కేఎంసీ అధికారులు మాత్రం నోటీసులు జారీ చేసిన విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. చిన్నచిన్న విషయాలకే పత్రికా ప్రకటనలు విడుదల చేసే అధికారులు వైకాపా కార్యాలయానికి తాఖీదులిచ్చిన విషయాన్ని మాత్రం దాచిపెడుతూ అంతులేని స్వామిభక్తి ప్రదర్శిస్తూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.

లేఖలు రాసినా నిర్లక్ష్యమే..

కర్నూలులోని ఐదు రోడ్ల కూడలిలో వైకాపా నిర్మిస్తున్న కార్యాలయానికి సంబంధించి సకాలంలో నిర్ణీత రుసుము చెల్లించలేదని, అనుమతులు లేకనే నిర్మాణాలు పూర్తి చేశారని గుర్తించారు. నోటీసులు జారీ చేయాలని కుడా ఉపాధ్యక్షుడు నగరపాలక కమిషనర్‌కు లేఖ పంపారు. వాస్తవానికి అనధికార కట్టడాలపై కార్పొరేషన్‌ అధికారులే తొలుత స్పందించాలి. వైకాపా నాయకులు నగర నడిబొడ్డున పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం గమనార్హం.

  • ముజఫర్‌నగర్‌లోని సర్వే నంబరు 523లో 10.64 ఎకరాల వక్ఫ్‌ భూమిలో అక్రమ నిర్మాణాలు జరిగినట్లు వక్ఫ్‌ అధికారులకు సమాచారం అందింది. అనధికారిక కట్టడాలపై చర్యలు తీసుకోవాల్సిన కార్పొరేషన్‌ అధికారులు కళ్లప్పగించి చూశారు.

కార్పొరేటర్లను లెక్కచేయక..

  • మేయర్‌ బీవై రామయ్య చెప్పే మాటలు వింటూ ఆయన అడుగుజాడల్లో నగరపాలక ఉన్నతాధికారి నడిచారన్న ఆరోపణలున్నాయి. మేయర్‌ వార్డుకు అత్యధికంగా రూ.10 కోట్ల వరకు నిధులు కేటాయించారని, తమ వార్డులకు సరిగా నిధులు ఇవ్వడం లేదంటూ కొందరు కార్పొరేటర్లు కౌన్సిల్‌ సమావేశంలో కమిషనర్‌ భార్గవ్‌తేజపై ఆగ్రహం వ్యక్తం చేయడం గతంలో చర్చనీయాంశమైంది.
  • కుళాయి కనెక్షన్‌ ఇచ్చేందుకు, ఆస్తిపన్ను, ఖాళీ స్థలం పన్ను (వి.ఎల్‌.టి.) విధింపు విషయంలో కొందరు ఆర్‌.ఐ.లు భారీగా అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలున్నాయి. కొందరు ఏకంగా తమ తరఫున పనులు చేసేందుకు ప్రైవేటు సిబ్బందిని నియమించుకుని ఇష్టారాజ్యంగా వసూళ్లు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ విభాగంలో జరుగుతున్న అక్రమాల తీరుపై ఉన్నతాధికారులకు తెలిసినా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

    వివాదాస్పద నిర్ణయాలకు కొదవలేదు

  • అక్రమ నిర్మాణాలంటూ షరాఫ్‌ బజార్‌లో గతంలో మూసివేసిన వ్యాపార దుకాణాలను స్టాండింగ్‌ కమిటీ ఆమోదంతో మళ్లీ కార్పొరేషన్‌ అధికారులు తెరిపించడం వివాదాస్పదంగా మారింది. అక్రమమని మూసేసిన అధికారులే.. మళ్లీ మాట మార్చి సక్రమమని బార్లా తెరవడం గమనార్హం. ఆ నిర్ణయం వెనక భారీఎత్తున ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి.
  • బిర్లాగేటు సమీపంలోని పైవంతెన కింద ఖాళీ స్థలంలో నగరపాలకసంస్థ నిధులు రూ.2 కోట్లు వెచ్చించి ‘ఖానా ఖజానా’ పేరుతో ‘ఈట్‌ స్ట్రీట్‌’ ఏర్పాటుచేశారు. దీని ప్రారంభోత్సవానికి నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుంచి రూ.10 లక్షలు వెచ్చించారు. క్రికెట్‌ పోటీలు వీక్షించేందుకు ఎల్‌డీఈ తెరలు ఏర్పాటుచేసి నగర వాసులకు చూపించారు. దీనికి సైతం నగరపాలకసంస్థ నిధులు వెచ్చించారు.

    స్థలాలు కబ్జాకు గురైనా..

  • నగరంలోని నాలుగో తరగతి ఉద్యోగుల అసోసియేషన్‌ లేఅవుట్‌కు చెందిన రూ.వంద కోట్ల విలువైన ఎనిమిది ఎకరాల స్థలం కబ్జాకు గురైనప్పటికీ కమిషనర్‌ పట్టించుకోలేదు. ఆక్రమణదారులకు అనుకూలంగా ఉండేలా విద్యుత్తు స్తంభాలు, రహదారులు, కుళాయిలు వేసి వారిని ప్రోత్సహించారని ఆ లేఅవుట్‌  
  • నగరంలోని కొన్ని పార్కులను కొందరు వ్యాపారులు, గుత్తేదారులు తమ వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించుకుంటున్నా కార్పొరేషన్‌ అధికారులు చోద్యం చూస్తున్నారు. నగరంలోని సుందరయ్య పార్కు స్థలంలో ఓ గుత్తేదారుడు మట్టి, కంకర, ఇసుక నిల్వ చేసి పార్కును సొంత అవసరాలకు ఉపయోగించుకోవడం  వివాదాస్పదమైంది.
  • సార్వత్రిక ఎన్నికలకు ముందు రూ.2 కోట్లను పలువురు గుత్తేదారులకు చెల్లించడం వివాదాస్పదమైంది. నిధులు పొందిన గుత్తేదారుల్లో అత్యధికులు వైకాపాకు అనుకూలురైన వారే ఉన్నట్లు సమాచారం. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని