logo

అభియంత.. ఆర్‌అండ్‌బీలో నియంత

వైకాపా ప్రభుత్వంలో ఆ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఆర్‌అండ్‌బీ శాఖలో కీలక స్థానంలో ఉన్న ఆయన జిల్లాలోని ఆరు నియోజకవర్గాలను పట్టించుకోకుండా.. డోన్‌ నియోజకవర్గానికి మాత్రమే అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

Published : 26 Jun 2024 04:30 IST

పనులు.. బిల్లులన్నీ ఒక నియోజకవర్గానికే..

నంద్యాలలో చేపట్టిన సబ్‌ కలెక్టర్‌ బంగ్లా ప్రహరీ పనులు

నంద్యాల పట్టణం, డోన్, న్యూస్‌టుడే : వైకాపా ప్రభుత్వంలో ఆ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఆర్‌అండ్‌బీ శాఖలో కీలక స్థానంలో ఉన్న ఆయన జిల్లాలోని ఆరు నియోజకవర్గాలను పట్టించుకోకుండా.. డోన్‌ నియోజకవర్గానికి మాత్రమే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రత్యేకంగా రూ.కోట్లలో ప్రతిపాదనలు తయారుచేసి పంపడం.. వెంటనే పనులు మంజూరవడం.. ఆగమేఘాలపై ప్రారంభించి పూర్తి చేసేలా కథ నడిపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం మారడంతో పాత పరిచయాలను ఆసరాగా చేసుకుని ఓ నాయకుని ఆశీస్సులతో తిరిగి జిల్లా కేంద్రంలోనే ‘కొలువు’దీరేందుకు ప్రయత్నాలు చేస్తుండటం రోడ్లు భవనాల శాఖలో చర్చనీయాంశంగా మారింది.
డోన్‌ పట్టణంలో గత అధికార పార్టీకి చెందిన కొందరు తమ స్థిరాస్తి వెంచర్‌ కోసం ఆర్‌అండ్‌బీ రహదారిని అడ్డదిడ్డంగా తవ్వారు.  వారు అడ్డగోలుగా పనులు చేస్తున్నా ఆ ఉన్నతాధికారి మాత్రం స్పందించలేదు. అవసరం లేకున్నా డోన్‌ క్లబ్‌ హౌస్‌ ఆధునికీకరణ పేరుతో రూ.కోటి మంజూరు చేసి స్వామిభక్తి చాటుకున్నారు.

ప్రజాప్రతినిధి మెప్పు కోసం..

నంద్యాల జిల్లాగా మారడంతో ఆర్‌అండ్‌బీ శాఖలో కీలక స్థానంలో ఉన్నతాధికారి బాధ్యతలు చేపట్టారు. డోన్‌ నియోజకవర్గానికి నిధులు కుమ్మరించారు. వైకాపా ప్రభుత్వంలో నంబరు 2గా కొనసాగిన మాజీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో గత రెండేళ్లలో రూ.వేల కోట్లతో పనులకు ప్రతిపాదనలు చేయడం, వాటిని చేపట్టడంలో ముఖ్య పాత్ర పోషించారు.

అంచనాలు పెంచడంలో ఘనుడే

నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ భవనాన్ని వారసత్వ సంపదగా గుర్తించి.. ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా తొలుత రూ.2 కోట్లు మంజూరు చేయించారు. నిధులు సరిపోవని మరో రూ.30 లక్షలు వెచ్చించారు. ప్రహరీ నిర్మాణానికి మరిన్ని నిధులు సమకూర్చారు. ప్రహరీని అందంగా తీర్చిదిద్దేందుకని అదనపు పనులు చేపట్టారు. కలెక్టరేట్‌కు సొంత భవనం లేకున్నా ఏడాదిన్నరగా సబ్‌ కలెక్టర్‌ బంగ్లాను రూ.కోట్లతో ఆధునికీకరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

మట్టి పేరుతో మెక్కేశారు

డోన్‌ నియోజకవర్గంలో జరిగే పనులకు సంబంధించి ఇతర ప్రాంతాల నుంచి మట్టి దిగుమతి చేసుకుంటున్నట్లు చూపుతూ.. స్థానికంగా లభించే మట్టినే వాడి నిధులు పక్కదారి పట్టించారు. ఇరిగేషన్, పంచాయతీరాజ్‌ శాఖలు చేయాల్సిన పనులను కూడా ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలోనే జరిగేలా చక్రం తిప్పారు.

జిల్లాలోని ఎన్‌హెచ్‌ 40 నుంచి ఎన్‌హెచ్‌ 44 మధ్య సోమయాజులపల్లె నుంచి డోన్‌ వరకు ఉన్న రెండు వరుసల రహదారిని ఆర్‌అండ్‌బీ నుంచి జాతీయ రహదారి పరిధిలోకి మార్చారు. దీని విస్తరణకు రూ.650 కోట్లు కేటాయించారు. తీరా చూస్తే మొత్తం మీద ఈ రహదారి మూడు అడుగుల మేర మాత్రమే విస్తరించారు.


బిల్లులన్నీ ఆ గుత్తేదారులకే..

ఆర్‌అండ్‌బీ పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు రూ.కోట్లలో పెండింగ్‌లో ఉన్నాయి. ఆ ఉన్నతాధికారి మాత్రం ఒక్క డోన్‌ నియోజకవర్గంలో పనులు చేసిన గుత్తేదారులకు మాత్రమే బిల్లులు పెండింగ్‌లో లేకుండా చూశారు. ఎఫ్‌డీఆర్‌ పనులు జిల్లాలోని శ్రీశైలం, ఆళ్లగడ్డ, పాణ్యం, బనగానపల్లి నియోజకవర్గాల్లో 15 వరకు మంజూరయ్యాయి. రూ.20 కోట్ల వ్యయం చేసే ఈ పనులకు నిధులు లేవని ఉన్నతాధికారి రద్దు చేశారు.  గత రెండేళ్లలో డోన్‌ నియోజకవర్గంలో జరిగిన పనులకు సంబంధించి రూ.వందల కోట్ల బిల్లులు మంజూరయ్యాయి. ఇదే సమయంలో మిగతా నియోజకవర్గాల్లో పనులు చేసిన గుత్తేదారులు రూ.లక్షల్లో కూడా బిల్లులు రాక అప్పుల పాలయ్యారు. నంద్యాల బొమ్మలసత్రంలో ఉపరితల వంతెన పనులు చేసిన గుత్తేదారుకు గత ఐదేళ్లుగా రూ.8 కోట్ల బిల్లులు రాకపోవడంతో ఆస్తులమ్మి అప్పులు తీర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని