logo

పురపాలకలో పెత్తందారులు

ఆదోని పురపాలక సంఘంలో వైకాపా నాయకుల అక్రమాలు అన్నీఇన్ని కావు. మొన్నటి వరకు వారి అనుమతి లేకుండా ఇక్కడ ఎలాంటి పనులు చేయలేని పరిస్థితి. గోడకు మేకు కొట్టాలన్నా ఆ పార్టీ సానుభూతిపరులు చేయాల్సిందే. కొందరు అధికారులు నాయకులకు గులాంగిరి చేశారు.

Published : 26 Jun 2024 04:23 IST

ఆదోనిలో వైకాపా నాయకుల ఆధిపత్యం
వారికి వంతపాడిన అధికారులు

దెబ్బతిన్న ఎస్‌.ఎస్‌.ట్యాంకు

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే : ఆదోని పురపాలక సంఘంలో వైకాపా నాయకుల అక్రమాలు అన్నీఇన్ని కావు. మొన్నటి వరకు వారి అనుమతి లేకుండా ఇక్కడ ఎలాంటి పనులు చేయలేని పరిస్థితి. గోడకు మేకు కొట్టాలన్నా ఆ పార్టీ సానుభూతిపరులు చేయాల్సిందే. కొందరు అధికారులు నాయకులకు గులాంగిరి చేశారు.  

ఆయన ఇంటికెళితేనే పనులు

ఆదోని పురపాలక కార్యాలయంలో వైకాపా ప్రజాప్రతినిధులు చెప్పిన పనిచేస్తేనే ఉద్యోగంలో కొనసాగే పరిస్థితి. లేకుంటే వారిని మార్చేయడం రివాజుగా మారింది. ఐదేళ్లలో ఐదుగురు కమిషనర్లు, ఐదుగురు మున్సిపల్‌ ఇంజినీర్లు బదిలీ అయ్యారు. పురపాలక అధికార గణమంతా వైకాపా ప్రజాప్రతినిధి చుట్టూ తిరగాల్సిందే. ఏ పనికైనా ముందుగా ఆయన ఇంటికి వెళ్లి రావాల్సిందే. ఫైళ్లు పట్టుకుని ఆయన ముందు నిల్చోవాల్సిందే. ప్రతి విభాగంలో ఓ కోవర్టును పెట్టి.. ఏం జరిగినా ఇట్టే సమాచారం అందేలా ఏర్పాట్లు చేసుకున్నారు.

కిందిస్థాయి సిబ్బందిపై ఒత్తిళ్లు

గతంలో వైకాపా ప్రజాప్రతినిధి సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి మేనేజరుగా పోస్టింగ్‌ వేసుకున్నారు. ఉద్యోగుల బదిలీలు, మెడికల్‌ బిల్లులు, జీతాలు.. అన్నీ ఆయనే చూసుకునేవారు. చెయ్యి తడపనిదే బిల్లు పాస్‌ కాదు.. ఆయన వేధింపులతో ఓ ఆర్వో ఆత్మహత్య చేసుకున్నారు. కేసు ముందుకెళ్లకుండా వైకాపా నేతలు చక్రం తిప్పారు. గతేడాది ఇదే మేనేజరు ఏసీబీకి పట్టుబడ్డారు.

అక్రమాలు వెలికితీసినా..

గడప గడపకు మన ప్రభుత్వం కింద విడుదల చేసిన నిధులకు సంబంధించి ఆయా సచివాలయాల పరిధిలో పనులు చేసేందుకు టెండర్లు పిలవగా ఎవరూ ముందుకు రాకపోవడంతో నామినేషన్‌్ కింద పార్టీ నాయకులకే అప్పగించారు. పనులన్నీ నాసిరకంగా జరిగాయి. చివరికి పురపాలక శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి నిజాలు వెలికితీశారు. స్థానిక ప్రజాప్రతినిధుల జోక్యంతో చర్యలు లేకుండానే బిల్లులు మంజూరవడం గమనార్హం.

అన్ని పనులూ వారికే..

పురపాలక సంఘంలో ఏటా సాధారణ బడ్జెట్‌ రూ.50- 60 కోట్లతో పాటు ప్రత్యేక గ్రాంట్లు, ఇతరాలు కలిపి రూ.15-20 కోట్లకుపైగా ఉంటుంది. సాధారణ నిధులతో చేపట్టే పనులకు అంతేలేకుండా పోయింది. కౌన్సిల్‌ ఆమోదం ఉంటే చాలు.. ఏ బిల్లయినా పాస్‌ చేసుకోవచ్చు. ఏ టెండరైనా వైకాపా వారికే దక్కేలా చూశారు. ఏటా నిర్వహించే మార్కెట్‌ వేలాలు సైతం వారే సొంతం చేసుకునేవారు.  


మరమ్మతుల పేరుతో స్వాహా

ఆదోని పట్టణ ప్రజల దాహార్తి తీర్చే బసాపురం ఎస్‌.ఎస్‌.ట్యాంకు దెబ్బతింది. మరమ్మతుల పేరుతో రూ.25 లక్షల వరకు ఖర్చు చేశారు. కట్ట కుడివైపు కోతకు గురైంది. రివిట్‌మెంట్‌ పనుల పేరుతో నిధులు వెచ్చించారు. పనులు నాసిరకంగా జరిగాయి. అప్పటికే సదరు గుత్తేదారుడికి రూ.కోటి దాకా బిల్లులు మంజూరు చేశారు. పనులు అధ్వానంగా ఉండటంతో మిగిలిన బిల్లులు ఇవ్వలేదు. ఒత్తిడి తీసుకురావడంతో ఓ ఎంఈ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాల్సి వచ్చింది.

  • 2023లో బసాపురం ఎస్‌.ఎస్‌.ట్యాంకు కట్ట దెబ్బతినడంతో మరమ్మతుల పేరుతో రూ.25 కోట్లతో అంచనాలు రూపొందించారు. అంత ఇచ్చేందుకు అప్పటి వైకాపా ప్రభుత్వం ముందుకు రాలేదు. చివరికి తాత్కాలిక పనులంటూ రూ.45 లక్షలతో అంచనాలు రూపొందించారు. పనులు చివరికి వచ్చేసరికి ఖర్చు రూ.కోటి దాటింది. ఓ అధికారి బిల్లులు మంజూరు చేసేందుకు వెనకడుగు వేయడంతో ఒత్తిడి తెచ్చి బిల్లులు విడుదల చేయించుకున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు