logo

భూసారం.. నిస్సారం

అధిక దిగుబడులు సాధించాలంటే భూసార పరీక్షల పాత్ర కీలకం.  ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో మట్టి నమూనాల పరీక్షలు చేసిందే లేదు. గతేడాది మట్టి నమూనాలు సేకరించినా పైసా బడ్జెట్‌ కేటాయించకపోవడంతో పరీక్షలు చేయలేని పరిస్థితి.

Published : 26 Jun 2024 04:17 IST

గతేడాది మట్టి నమూనాల సేకరణ
ఇప్పటివరకు పరీక్షలు చేయని వైనం
నిధుల కేటాయింపులో గత ప్రభుత్వం నిర్లక్ష్యం

కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లోని భూసార పరీక్షా కేంద్రంలో ఏడాది కాలంగా మూలుగుతున్న మట్టి నమూనాలు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : అధిక దిగుబడులు సాధించాలంటే భూసార పరీక్షల పాత్ర కీలకం.  ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో మట్టి నమూనాల పరీక్షలు చేసిందే లేదు. గతేడాది మట్టి నమూనాలు సేకరించినా పైసా బడ్జెట్‌ కేటాయించకపోవడంతో పరీక్షలు చేయలేని పరిస్థితి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గతేడాది వేసవిలో నేల ఆరోగ్య స్థితి పత్రాలపై అప్పటి ప్రభుత్వం ఏడీఏలు, ఏవోలు, వీఏఏలకు శిక్షణ ఇచ్చింది. కర్నూలు జిల్లాలో 10,252, నంద్యాల జిల్లాలో 10,080 మట్టి నమూనాలు సేకరించాలని లక్ష్యాలు నిర్దేశించారు. నంద్యాల జిల్లాలో 28 మండలాల నుంచి కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లోని భూసార పరీక్షా కేంద్రానికి, కర్నూలు జిల్లాలోని 26 మండలాల్లో సేకరించిన నమూనాలను ఎమ్మిగనూరు కేంద్రానికి పంపారు.

ఖరీఫ్‌ ప్రారంభమైనా..

2024-25లో కర్నూలు జిల్లాలో 19,500, నంద్యాల జిల్లాలో 17,300 మట్టి నమూనాలు సేకరించాలని లక్ష్యం విధించారు. జూన్‌ నెలాఖరుకల్లా సేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. వాస్తవానికి ఏప్రిల్, మే నెలల్లో సేకరించాల్సి ఉండగా ఖరీఫ్‌ ప్రారంభమై మూడు వారాలు గడిచినా ఇప్పటి వరకు మండలాలకు లక్ష్యాలు నిర్దేశించలేదు.  

ఒక్క పైసా ఇవ్వక..

భూసార పరీక్షా కేంద్రాల్లో మట్టి నమూనాలు పరీక్షించాలంటే రసాయనాలకు బడ్జెట్‌ అవసరమవుతుంది. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన పథకం కింద కేంద్రం బడ్జెట్‌ కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిధులిచ్చి పరీక్షలు చేయించాల్సి ఉండగా 2023-24లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.

  • ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు, కర్నూలు, నంద్యాల, డోన్‌లో భూసార పరీక్షా కేంద్రాలున్నాయి. నంద్యాల జిల్లాలోని రెండు పరీక్షా కేంద్రాలు ఏడాదికి పైగా పనిచేయడం లేదు. కర్నూలు జిల్లాలోని కర్నూలు వ్యవసాయ మార్కెట్, ఎమ్మిగనూరులో భూసార పరీక్షా కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఎమ్మిగనూరు కేంద్రంలో విద్యుత్తు బిల్లులు కూడా చెల్లించని దయనీయ పరిస్థితి నెలకొంది.
    రూ.30 లక్షలకుపైగా అవసరం

2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం భూసార పరీక్షల నిర్వహణకు బడ్జెట్‌ను విడుదల చేసింది. కర్నూలు జిల్లాకు రూ.6.71 లక్షలు, నంద్యాల జిల్లాకు 6.17 లక్షలు మంజూరు చేసింది. గతేడాది సేకరించిన 20 వేల మట్టి నమూనాలను పరీక్షించేందుకు రూ.30 లక్షలకుపైగా నిధులు అవసరం.. మంజూరైన బడ్జెట్‌ మేరకు వారం, పది రోజుల్లో మట్టి పరీక్షలను పరీక్షించేందుకు చర్యలు చేపట్టనున్నారు.

  • ఉమ్మడి జిల్లాలో మట్టి పరీక్షలను పరీక్షించేందుకు వ్యవసాయాధికారి నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు మరో 10 మంది అవసరం ఉంది. డిప్యుటేషన్‌ కింద  సిబ్బందిని నియమించాల్సి ఉంది. ఇప్పటివరకు భూసార పరీక్షా కేంద్రాలకు వీరిని డిప్యుటేషన్‌పై నియమించలేదు. ఫలితంగా మట్టి పరీక్షల ఫలితాలు మరింత ఆలస్యం కానున్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని