logo

ఈ-పుస్తకం.. హస్తభూషణం

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలన్నా.. ఉన్నత విద్య కోసం సీటు పొందాలన్నా.. పోటీ పరీక్షల్లో నెగ్గాలన్నా విజ్ఞానం చాలా అవసరం. గతంలో విజ్ఞాన పుస్తకాలు దొరకాలంటే గ్రంథాలయాలకు వెళ్తే చాలు అక్కడ వేల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.

Published : 26 Jun 2024 03:55 IST

అందుబాటులో డిజిటల్‌ గ్రంథాలయాలు
తెరచి చదివేయొచ్చు

‘‘జిల్లాలో ప్రతి మండల కేంద్రాల్లో ప్రభుత్వం గ్రంథాలయాలను ఏర్పాటు చేసి వేలాది పుస్తకాలను పాఠకులకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో పాటు జిల్లాలోని కర్నూలు నగరంతో పాటు ఆదోని పట్టణంలోని గ్రంథాలయాల్లో ఈ-డిజిటల్‌ సేవలు తెచ్చింది. నామమాత్రంగా గంటకు రూ.10 చొప్పున రుసుం తీసుకొని ఇంటర్నెట్‌ సౌకర్యంతో కంప్యూటర్లు పాఠకులకు అందుబాటులోకి తెచ్చింది.’’

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలన్నా.. ఉన్నత విద్య కోసం సీటు పొందాలన్నా.. పోటీ పరీక్షల్లో నెగ్గాలన్నా విజ్ఞానం చాలా అవసరం. గతంలో విజ్ఞాన పుస్తకాలు దొరకాలంటే గ్రంథాలయాలకు వెళ్తే చాలు అక్కడ వేల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. కావాల్సిన అంశాన్ని ఎంచుకుని చదివేవారు. ప్రస్తుతం ట్రెండ్‌ మారింది.. ఆధునిక సాంకేతికత అందరికీ అందుబాటులోకి వచ్చింది.. మనకు ఏ పుస్తకం కావాలన్నా క్షణాల్లో అరచేతిలో ప్రత్యక్షం అవుతుంది. ఎలాగంటే.. మనం రోజూ వాడే చరవాణిలో ఈ-గ్రంథాలయమే పుస్తకాల గని. అంతేకాదు పుస్తక ప్రియుల కోసం మరోవైపు జిల్లాలోని గ్రంథాలయాల్లో పాఠకుల కోసం డిజిటల్‌ గ్రంథాలయాన్ని సైతం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. పాఠకులు ఈ-సేవలను వినియోగించుకొని తమ మేధస్సును పెంచుకోవచ్చు. ముఖ్యమైన విషయమేమిటంటే.. మన కంటి చూపుపై ప్రభావం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

న్యూస్‌టుడే, ఆదోని సాంస్కృతికం, హాలహర్వి

ఎలా చదవాలంటే..

అంతర్జాలంలో గూగుల్‌లోకి వెళ్లి ndl.iitkgp.ac.in వెబ్‌సైట్‌లో లాగి అవ్వాలి. తెరపై వచ్చిన అంశాలను క్షుణ్ణంగా ఊసపుకుంటూ వ్యక్తిగతంగా, సంస్థల పరంగానే నమోదు చేేసుకోవాలి. ఇందులో ఈ-మెయిల్, చిరునామా, పాస్‌వర్డు నమోదు చేసుకోవాలి. ఒకసారి నమోదు చేసుకుంటే సరిపోతోంది. ఒకసారి నమోదు చేసుకుంటే ఎప్పుడైనా లాగిన్‌ అయి.. కావాల్సిన పుస్తకాలను చదువుకోవచ్చు. అండ్రాయిడ్‌ చరవాణులు కల్గిన ప్రతిఒక్కరు ఈ వెబ్‌సైట్‌ ద్వారా పుస్తకాలు చదువుకోవచ్చు. అవరమైన పుస్తకాలను డౌన్‌లోడ్‌ కూడా చేసుకోవచ్చు.

అన్ని అంశాలకు వేదిక

మినిస్ట్రీ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్, ఐఐటీ ఖరగ్‌పూర్‌ సహకారంతో డిజిటల్‌ లైబ్రెరి ఆఫ్‌ ఇండియా పేరుతో వెబ్‌సైట్‌ రూపొందించింది. ఇందులో ప్రాథమిక స్థాయి నుంచి పీజీ వరకు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఆంగ్లం, హిందీతో పాటు 70 భాషల్లో 68 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. వ్యవసాయం, కంప్యూటర్‌ సైన్స్, ఐటీ, జనరల్‌ ఫిలాసఫీ, సైకాలజీ వంటి ఎన్నో విషయాలతో పాటు ఎందరో మహానుభావులు రాసిన లక్షల పుస్తకాలు ఈ-గ్రంథాలయంలో దొరుకుతాయి. ఆడియో, వీడియో రూపంలో కూడా చూడొచ్చు.. వినొచ్చు.

ఆదోని గ్రంథాలయంలో ఇంటర్నెట్‌ సౌకర్యంతో పాఠకులకు ఈ-డిజిటల్‌ సేవలు


అరచేతిలో లక్షల పుస్తకాలు

మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠకులు తమ అరచేతిలోనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు. చరవాణికి ఇంటర్నెట్‌ సేవలు ఉంటే చాలూ.. తమ ఇంటి వద్దనే ఉంటూ ఈ-గ్రంథాలయంతో కావాల్సిన పుస్తకం చదివేయవచ్చు. 70 భాషల్లో 68 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో 45 లక్షలకు పైగా జనాభా ఉంది. ఇందులో 50 శాతం నుంచి 60 శాతం వరకు అంతర్జాలంపై ఆధారపడి ఉన్నారు. ఇందులో సుమారు 20 లక్షల వరకు స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్నారు. అంటే వీరందరి అరచేతిలో 68 లక్షల పుస్తకాలు ఉన్నట్లే.


కంటి చూపు పట్ల నిర్లక్ష్యం వద్దు

చరవాణుల్లో ఈ-గ్రంధాలయం ద్వారా పుస్తకాలు చదివే పాఠకులు గంటల కొలది మొబైల్‌లను చూడవద్దు. ప్రధానంగా మొబైల్‌ స్క్రీన్‌ లైటింగ్‌ కంటికి అలసట లేకుండా చూసుకోవాలి. మధ్యమధ్యలో విరామం తీసుకోవాలి. అప్పుడు కంటి చూపుపై ప్రభావం ఉండదు.. ఈ-గ్రంధాలయం ద్వారా తమ విజ్ఞానాన్ని పెంచుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని