logo

Adoni: బంగారం అక్రమ రవాణాపై పోలీసు అధికారి దాడి.. రూ.6 లక్షలు తీసుకొని వదిలేసిన వైనం

అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాల్సిన ఓ పోలీసు అధికారి అక్రమార్జనకు తెరలేపిన ఘటన ఆదివారం వెలుగుచూసింది.

Published : 01 Jul 2024 06:37 IST

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే : అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాల్సిన ఓ పోలీసు అధికారి అక్రమార్జనకు తెరలేపిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. రూ.కోటి విలువైన బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యాపారిని అదుపులో తీసుకున్న ఆ పోలీసు అధికారి.. పైఅధికారుల సహకారంతో పైరవీలు చేసి రూ.6 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని అతడిని వదిలేసినట్లు తెలిసింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోని డివిజన్‌ పరిధిలోని ఓ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు.. ఆదోని డివిజన్‌ పరిధిలోని రైల్వేస్టేషన్‌లో బెంగళూరు నుంచి వచ్చిన రైలులో ఓ పోలీసు అధికారి తనిఖీ చేస్తుండగా ఆదోని పట్టణానికి చెందిన ఓ బడా బంగారు వ్యాపారి ఒకరు పెద్దమొత్తంలో బంగారాన్ని తీసుకొస్తున్నట్లు గుర్తించారు. అతడిని అదుపులో తీసుకొని తనిఖీ చేయగా దాదాపు రూ.కోటి విలువ చేసే కిలోన్నరకుపైగా బంగారాన్ని గుర్తించారు. ఎలాంటి పత్రాలు లేకుండా జీరో పద్ధతిలో తరలిస్తున్నట్లు నిర్ధారించారు. సదరు వ్యాపారిని అదుపులో తీసుకొని బంగారం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయాల్సిన ఆ పోలీసు అధికారి అతడిని వదిలేందుకు బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇందుకోసం పైస్థాయి అధికారి సహకారం తీసుకొని ఆ వ్యాపారితో రూ.6 లక్షలు బేరం కుదుర్చుకొని బంగారంతోపాటు ఆ వ్యాపారిని వదిలేసినట్లు తెలిసింది. అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసు అధికారే ఇలా చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


పిచ్చికుక్క స్వైర విహారం

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే : నంద్యాల పట్టణంలో ఆదివారం పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ప్రియాంకనగర్, పద్మావతినగర్, టెక్కె, రెవెన్యూ క్వార్టర్స్‌ ప్రాంతాల్లో 25 మందిని గాయపరిచింది. పెద్దలతో పాటు పలువురు చిన్నారులూ గాయపడ్డారు. ప్రియాంక నగర్‌కు చెందిన లక్ష్మీదేవి, మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలవడంతో నంద్యాల సర్వజన ఆసుపత్రిలో చేరారు. మిగిలిన 22 మంది వ్యాక్సిన్లు వేయించుకుని వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను న్యాయ, మైనారిటీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పరామర్శించారు.


విత్తనాల పేరుతో మోసం

రూ.4 లక్షలతో పరారీ

మంత్రాలయం, న్యూస్‌టుడే: మిరప విత్తనాలు పంపిణీ చేస్తానని నమ్మించిన ఓ వ్యక్తి రూ.4 లక్షలతో ఉడాయించాడు. ఎమ్మిగనూరు మండలం మల్కాపురానికి (కొత్తూరు) చెందిన జి.గిడ్డయ్య జెమిని యాక్టివ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ అనే సీడ్స్‌ కంపెనీలో ఆర్గనైజర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కర్ణాటకలోని బూడిదదిన్నే, గంథాలం, ఇడుపనూరు తదితర గ్రామాల్లో దాదాపు 300 మంది రైతుల నుంచి రూ.2 నుంచి రూ.4 వేల వరకు వసూలు చేసుకొని మొత్తం రూ.4 లక్షలకు పైగా వసూలు చేశాడు. జూన్‌ చివరి కల్లా కంపెనీ నుంచి మిరప విత్తనాలు పంపిణీ చేస్తామని నమ్మ బలికి ఆ నగదు కంపెనీకి కట్టకుండా, రైతులకు విత్తనాలు పంపిణీ చేయకుండా మోసం చేసినట్లు బాధిత రైతులు ఆదివారం మంత్రాలయం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


చరవాణుల చోరీ కేసుల్లో రిమాండ్‌

తిరుపతి(లీగల్‌): శ్రీవారి దర్శన టికెట్ల కోసం వెళ్లే క్యూలైన్‌లో భక్తుల చరవాణులు చోరీ చేసే ముఠాలోని ఐదుగురు నిందితులను ఈ నెల 12 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌కి ఆదేశిస్తూ తిరుపతి నాల్గో అదనపు మున్సిఫ్‌ కోర్టు న్యాయమూర్తి గ్రంథి శ్రీనివాస్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులు హైదరాబాదుకు చెందిన పసుపులేటి శ్రీకాంత్, ఆవుల ఆనంద్, పసుపులేటి ఈశ్వర్, కర్నూలు జిల్లాకు చెందిన ఎర్రుకుల బన్ని, అనంతపురానికి చెందిన రణకల లోకేష్‌లు ముఠాగా ఏర్పడి అలిపిరి గరుడ సమీపంలోని భూదేవి కాంప్లెక్సు క్యూలైన్‌లో భక్తుల చరవాణుల చోరీకి పాల్పడేవారు. అలిపిరి పోలీసుస్టేషన్‌ పోలీసులు వారిని అరెస్టు చేసి భక్తుల చరవాణులు స్వాధీనపరచుకుని న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి.. నిందితులను రిమాండ్‌కి ఆదేశించారు.


12 తులాల బంగారం అపహరణ

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: కర్నూలులో వరుస దొంగతనాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. వాసవీ నగర్‌లో అనంతకృష్ణశర్మ కుటుంబం నివాసం ఉంటోంది. ఈ ఏడాది జూన్‌ 28న ఆయన తన తండ్రిని ఆసుపత్రిలో చేర్పించడంతో ఇంటికి తాళం వేసి అంతా అక్కడే ఉన్నారు. మరుసటి రోజు ఇంటికి చేరుకునేసరికి దొంగలు తాళం తొలగించి సొత్తును ఎత్తుకెళ్లారు. 12 తులాల బంగారు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు. రూ.2.40 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు అనంతకృష్ణ శర్మ భార్య అనూష ఫిర్యాదు మేరకు కర్నూలు నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని