logo

అనుసంధానించేలా.. అవసరాలు తీరేలా..

వేగంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మం, వైరా నియోజకవర్గాల్లో పలు గ్రామాలను అనుసంధానించేందుకు సాగర్‌ ప్రధాన కాలువపై కొత్తగా వంతెనలు నిర్మించాలని నీటిపారుదలశాఖ అధికారులు ప్రతిపాదించారు.

Published : 03 Jul 2024 02:35 IST

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే

వేగంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మం, వైరా నియోజకవర్గాల్లో పలు గ్రామాలను అనుసంధానించేందుకు సాగర్‌ ప్రధాన కాలువపై కొత్తగా వంతెనలు నిర్మించాలని నీటిపారుదలశాఖ అధికారులు ప్రతిపాదించారు. ఆయా గ్రామాల ప్రజల విజ్ఞప్తుల మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గంలో వి.వెంకటాయపాలెం-వేపకుంట్ల మధ్య పాత వంతెన స్థానంలో కొత్త నిర్మాణానికి ప్రతిపాదించాలని సూచించారు. ఖమ్మంలో 7వ డివిజన్‌లో టేకులపల్లి వద్ద కాలువపై ఇప్పుడున్నదాని పక్కన క్రాస్‌ రెగ్యులేటర్‌ నిర్మించాలన్నారు. వెంకటాయపాలెం వద్ద 40 ఏళ్ల కిందట నిర్మించిన ఒక వరుస వంతెన శిథిలావస్థకు చేరింది. ఇక్కడ కాలువ లోతు ఎక్కువగా ఉంటుంది. డీప్‌కట్‌ ప్రాంతంలో కొత్తగా వంతెన నిర్మాణం కష్టతరమవుతుంది. వెంకటాయపాలెం వద్ద కొత్త కలెక్టరేట్‌ ఏర్పాటుతో పాటు ఈ ప్రాంతం వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే వేపకుంట్ల వైపు  వెంచర్లు వేసి ఇళ్ల స్థలాలు విక్రయిస్తున్నారు. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా రూ.4 కోట్ల అంచనా వ్యయంతో కొత్త వంతెన నిర్మాణానికి అధికారులు ప్రతిపాదించారు.

  • టేకులపల్లి వంతెన వద్ద కాలువలో మట్టి కట్ట అడ్డుగా నిర్మించి అక్కడున్న తూముకు నీటిని ఎక్కించి లకారం చెరువులో మంచినీటి పథకానికి తరలిస్తున్నారు. ఏటా వేసవిలో ఇక్కడ మట్టి కట్ట నిర్మించి నీరు తరలించాల్సి వస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో మట్టి కట్ట తొలగిస్తుంటారు. ఇక్కడ తూముకు నీరు అందే లెవల్‌కు అనుకూలంగా క్రాస్‌ రెగ్యులేటర్‌ నిర్మించేందుకు రూ.3.75 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు.
  • ఏన్కూరు మండలం రాయమాధారం వద్ద సాగర్‌ ప్రధాన కాలువ 38 కి.మీ వద్ద కొత్తగా వంతెన నిర్మించనున్నారు. దీనికి రూ.4 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 

ఏన్కూరు క్రాస్‌ రెగ్యులేటర్‌ విస్తరణ

సీతారామ ప్రాజెక్టు పాలేరు లింక్‌ కాల్వ నుంచి వైరా జలాశయానికి నీటిని మళ్లించేందుకు అనువుగా నిర్మించనున్న సుమారు 7 కి.మీ. 18ఎల్‌ లింక్‌ కాల్వను సాగర్‌ ప్రధాన కాల్వ 52 కి.మీ. ఎర్రబోడుతండా వద్ద క్రాస్‌ రెగ్యులేటర్‌ ఎగువ భాగంలో అనుసంధానించనున్నారు. సాగర్‌ కాల్వకు వచ్చే నీటిని నిలువరించేందుకు ఏన్కూరు క్రాస్‌  రెగ్యులేటర్‌ను బలోపేతం చేస్తారు. ఇక్కడ షట్టర్లు కిందకు దింపడంతో కాల్వలో వెనక్కు నీరు నిలుస్తుంది. సాగర్‌ ప్రధాన కాల్వ 38.675 కి.మీ వద్ద వైరా ఎస్కేప్‌ ఉంది. 52 కి.మీ.లోకి చేరిన నీరు కాల్వలో వెనక్కి 38 కి.మీ.లో వరకు నిలిచి వైరా ఎస్కేప్‌ ద్వారా దిగువకు విడుదల చేస్తే వైరా రిజర్వాయర్‌కు గోదావరి జలాలు చేరుకుంటాయి. 52 కి.మీ.లో క్రాస్‌ రెగ్యులేటర్‌ వద్ద 1.35 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేందుకు అనువుగా క్రాస్‌ రెగ్యులేటర్‌ను బలోపేతం చేసేందుకు రూ.21 లక్షలతో అంచనాలు రూపొందించారు. త్వరలో పనులు చేపట్టనున్నారు.


ప్రభుత్వానికి నివేదించాం

-అననీయ, ఈఈ, నీటిపారుదల శాఖ, ఖమ్మం

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌ ఆదేశాల మేరకు సాగర్‌ ప్రధాన కాలువపై రెండు వంతెనలు, రెండు క్రాస్‌ రెగ్యులేటర్ల నిర్మాణానికి అంచనాలు రూపొందించి       ప్రభుత్వానికి పంపించాం. నిధులు మంజూరు కాగానే టెండర్లు నిర్వహించి పనులు ప్రారంభిస్తాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని