logo

పల్లె దవాఖానాలకు సుస్తీ..!

పల్లె దవాఖానాల సేవలు ప్రహసనంలా మారాయి. సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించడానికి ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను వైద్యులు, సిబ్బంది, మందుల కొరత వేధిస్తోంది. ప్రస్తుత వర్షాకాలంలో తరుణ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది.

Published : 03 Jul 2024 02:33 IST

ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే

పల్లె దవాఖానాల సేవలు ప్రహసనంలా మారాయి. సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించడానికి ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను వైద్యులు, సిబ్బంది, మందుల కొరత వేధిస్తోంది. ప్రస్తుత వర్షాకాలంలో తరుణ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరంపై   అధికారులు దృష్టి సారించాలి.

వెక్కిరిస్తున్న ఖాళీలు

జిల్లాలో మొత్తం 161 పల్లె దవాఖానాలు ఉన్నాయి. వీటిలో ఎంబీబీఎస్, బీఏఎంస్, బీఎస్సీ నర్సింగ్‌ అర్హత కలిగిన వారిని మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌(ఎంఎల్‌హెచ్‌పీ)గా నియమించి చికిత్సలు అందిస్తారు. కొన్ని కేంద్రాల్లో వైద్యులు, మరికొన్నింటిలో నర్సింగ్‌ ఆఫీసర్లు ఎంఎల్‌హెచ్‌పీగా సేవలందిస్తారు. దవాఖానాల్లో ప్రాథమిక వైద్య సేవలకు అవసరమైన అన్ని సదుపాయాలతో పాటు ఔషధాలు అందుబాటులో ఉండాలి. జిల్లాలో బోనకల్లు, కూసుమంచి, ఎంవీపాలెం, గంగారం, మంచుకొండ, వైరా ఆరోగ్య కేంద్రాల పరిధిలోని బ్రాహ్మణపల్లి, బుగ్గపాడు, అయ్యగారిపేట, జక్కెపల్లి, జుజ్జులరావుపేట, మల్లెమడుగు, గుదిమళ్ల, వీవీపాలెం, కోయచలక, సోమవరం, పాలడుగు పల్లె దవాఖానాల్లో వైద్యులు లేరు. దాదాపు పదకొండు ప్రాంతాల్లో పోస్టులు ఖాళీగా ఉండటంతో స్థానిక ప్రజలకు వైద్యసేవలు అందటం లేదు. అలాగే చాలాకేంద్రాలకు విధిగా ఔషధాలు సరఫరా కావడం లేదు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, సీజనల్‌ వ్యాధులతో బాధపడే రోగులకు ఆశించిన సేవలు లభించడం లేదు. వ్యాధుల తరుణం ప్రారంభమైన నేపథ్యంలో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మాలతిని వివరణ కోరగా ఉన్నతాధికారుల అనుమతితో పోస్టులను భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని