logo

విచారణలో వేగం.. సత్వర న్యాయం..!

నూతన నేర, న్యాయ చట్టాల ద్వారా పోలీసుల విచారణ వేగవంతమవుతుందని ఎస్పీ రోహిత్‌రాజు స్పష్టం చేశారు. బాధితులకు సత్వర న్యాయం అందటంతో పాటు నేరాలకు పాల్పడే వారికి కచ్చితంగా శిక్షలు పడతాయని తెలిపారు.

Published : 03 Jul 2024 02:30 IST

నూతన నేర, న్యాయ చట్టాలకు ప్రజా శ్రేయస్సే ప్రాతిపదిక 
‘ఈనాడు’తో ఎస్పీ రోహిత్‌రాజు
ఈనాడు డిజిటల్, కొత్తగూడెం

నూతన నేర, న్యాయ చట్టాల ద్వారా పోలీసుల విచారణ వేగవంతమవుతుందని ఎస్పీ రోహిత్‌రాజు స్పష్టం చేశారు. బాధితులకు సత్వర న్యాయం అందటంతో పాటు నేరాలకు పాల్పడే వారికి కచ్చితంగా శిక్షలు పడతాయని తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్‌ఏ) ఈనెల 1 నుంచి అమలవుతున్న విషయం విదితమే. ఈనేపథ్యంలో ‘ఈనాడు’తో ఎస్పీ ముచ్చటించారు. ఆ వివరాలు మీ కోసం..

పోలీసు యంత్రాంగానికి శిక్షణ పూర్తి

కాలానికి అనుగుణంగా పుట్టుకొస్తున్న నేరాలకు సంబంధించి కొత్త సెక్షన్లు, శిక్షలు విధించటానికి నూతన నేర, న్యాయ చట్టాలు దోహదపడతాయి. కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించటానికి, ప్రజలకు చట్టంపై గౌరవం పెంచటానికి తోడ్పడతాయి. బ్రిటీష్‌ కాలం నాటి రాచరిక పాలన ఆనవాళ్లను తొలగించి ప్రజా శ్రేయస్సును కాంక్షించి కొత్త చట్టాలను రూపొందించారు. వీటి విధివిధానాలు, అమలు తీరుపై ఇప్పటికే పోలీసు యంత్రాంగానికి శిక్షణ ఇచ్చాం. పోలీసు సిబ్బందిలో ఇంకెవరికైనా   సందేహాలుంటే మరోసారి అవగాహన కల్పిస్తాం. 

నేరస్థులు తప్పించుకోలేరు

బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌-187 ప్రకారం పోలీసు కస్టడీ వ్యవధి 15 రోజుల నుంచి 60-90 రోజులకు పెరుగుతుంది. దీన్ని ప్రజలు లేదా నేరస్థులను ఇబ్బంది పెట్టడానికి వినియోగించబోం.   చట్టంలోని లొసుగులను వాడుకుని తప్పించుకోవటానికి వీల్లేకుండా, నేరస్థులకు శిక్ష పడేలా ఇది దోహదపడుతుంది.  నిందితులను విచారించటానికి 15 రోజుల సమయం సరిపో నప్పుడు పోలీసులకు ఈ సెక్షన్‌ ఉపయోగపడుతుంది. నూతన చట్టాల ద్వారా ప్రాథమిక హక్కులకు మరింత రక్షణ కలుగుతుంది. ప్రజలు అపోహలకు తావివ్వకుండా కొత్త చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి. పోలీసు యంత్రాంగం, న్యాయస్థానాల్లో జవాబుదారితనం, పారదర్శకతకు ఇవి పెద్దపీట వేస్తాయి.

ఈ-ఎఫ్‌ఐఆర్‌కు అవకాశం

ఇంతకుముందు చట్టంలో సంబంధిత ఠాణా పరిధిలో నేరాలు జరిగితేనే ఎఫ్‌ఐఆర్‌ చేయడానికి అవకాశం ఉండేది. నేరం ఎక్కడ జరిగినా కొత్త చట్టం ప్రకారం బాధితులు ఏ పోలీస్‌ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయొచ్చు. బాధితులు ఠాణాల చుట్టూ తిరగకుండా ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’ దోహదపడుతుంది. అయితే ఫిర్యాదుదారు మూడు రోజుల్లో వచ్చి ఫిర్యాదుపత్రం అందించి సంతకం చేయాల్సి ఉంటుంది. స్థానిక ఎస్‌హెచ్‌ఓ విచారణ జరుపుతారు. నేరం జరిగిందని నిర్ధారించుకున్నాకే కేసు నమోదవుతుంది. తప్పుడు ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటాం.ఈ-ఎఫ్‌ఐఆర్‌ను బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌-173 నిర్వచిస్తుంది. బాధితులు ఠాణాకు రాకుండానే పోలీసు స్టేషన్‌ మెయిల్‌ లేదా ఫోన్‌ నంబర్‌కు సమాచారమందించవచ్చు. ఇందుకోసం జిల్లాలోని ఠాణాల మెయిల్‌ ఐడీలు, ఫోన్‌ నంబర్లు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తాం. ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల ద్వారా సమన్లు జారీ చేసే  అవకాశాన్ని కొత్త చట్టాలు కల్పిస్తున్నాయి.  

సాక్షులకు రక్షణ కవచం

నూతన చట్టాలతో ప్రజలకు సత్వర న్యాయం అందుతుంది. విట్‌నెస్‌ ప్రొటెక్షన్‌ స్కీం ద్వారా సాక్షులకు రక్షణ దొరుకుతుంది. బాధితులకు అధిక ప్రాధాన్యమిస్తూనే.. నేరస్థులకు కఠిన శిక్షలు విధించేందుకు కొత్త చట్టాలు ఉపకరిస్తాయి. తద్వారా సమాజంలో చట్టాలపై గౌరవం పెరుగుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని