logo

మధ్యాహ్నభోజనం.. శుచికరం.. రుచికరం!

సర్కారు బడుల్లో విద్యనభ్యసించే పేద విద్యార్థులకు పోషక విలువలతో కూడిన భోజనం అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Published : 03 Jul 2024 02:28 IST

పాల్వంచ, న్యూస్‌టుడే

ర్కారు బడుల్లో విద్యనభ్యసించే పేద విద్యార్థులకు పోషక విలువలతో కూడిన భోజనం అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ‘మధ్యాహ్న భోజన’ పథకాన్ని పకడ్బందీగా అమలుచేయాలని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు తాజాగా ఆదేశాలిచ్చారు. ఈనేపథ్యంలో వంట నిర్వాహకుల సమస్యల పరిష్కారంపై ఆ శాఖ దృష్టిసారించింది. ప్రతినెలా 10వ తేదీ నాటికి వంట బిల్లులు, గౌరవ వేతనాలందించేలా చూడాలని విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన  ఆదేశించారు. ఈ నిర్ణయంపై ఏజెన్సీల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు సకాలంలో మంజూరు చేస్తే కూరగాయలు, నిత్యావసరాల కొనుగోలుకు అప్పులు చేయాల్సిన  అవసరం రాదని చెబుతున్నారు.  

నిబంధనల అమలుపై దృష్టి 

బిల్లులు సకాలంలో చెల్లించనున్న నేపథ్యంలో పథకం నిబంధనల అమలుపైనా విద్యాశాఖ దృష్టి సారిస్తోంది. రోజువారీ ఆహార పట్టికను పాఠశాల ఆవరణలో ప్రదర్శించాలని ఆదేశించింది. విద్యార్థులకు వారానికి మూడు కోడిగుడ్లు అందజేసేలా ఏజెన్సీల నుంచి లిఖితపూర్వక ఒప్పంద పత్రం తీసుకోనున్నారు. భోజన మెనూ వివరాలను ఏరోజుకారోజు ‘తెలంగాణ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ మొబైల్‌ యాప్‌’లో ప్రధానోపాధ్యాయుడు పొందుపరుస్తారు. విద్యార్థులతో కూడిన ఓ కమిటీ బియ్యం, సరకుల తూకాన్ని సరిచూస్తుంది. సంబంధిత రిజిస్టర్‌ వివరాలకు, నిల్వలకు తేడాలున్నట్లు తనిఖీల్లో తేలితే ప్రధానోపాధ్యాయులే బాధ్యత వహించాలి. పిల్లలకు   అందజేసే ఆహారం, తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వంటలు   పరిశుభ్ర వాతావరణంలో తయారుచేయించాలి. విద్యార్థులు చేతులు శుభ్రంగా కడుక్కునేలా ఏర్పాట్లు ఉండాలి. పథకం అమలు ప్రత్యేక కమిటీ, విద్యార్థుల తల్లిదండ్రులు, ‘అమ్మ ఆదర్శ’ కమిటీల ఆధ్వర్యంలో సమీక్షలు జరపాలి.  


భోజనాన్ని ఇకపై ఉపాధ్యాయులు రుచిచూసిన తర్వాతే విద్యార్థులకు వడ్డించేలా ఆదేశాలు జారీ చేస్తాం. నాణ్యమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని వడ్డించేలా చూస్తాం. గుడ్లు తప్పనిసరిగా అందించేలా పర్యవేక్షిస్తాం. అన్ని పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతాం.   

వెంకటేశ్వరాచారి, జిల్లా విద్యాశాఖ అధికారి  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని