logo

పర్యావరణ సంచులతో ఆరోగ్యం పదిలం

‘‘ప్రపంచ వ్యాప్తంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ సంచులు తగ్గించాలనే లక్ష్యంతో బ్యాగ్‌ ఫ్రీ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో 2010 జులై 3 నుంచి అంతర్జాతీయ ప్లాస్టిక్‌ సంచి రహిత దినం నిర్వహిస్తున్నారు.’’

Published : 03 Jul 2024 02:22 IST

మధిర పట్టణం, న్యూస్‌టుడే

‘‘ప్రపంచ వ్యాప్తంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ సంచులు తగ్గించాలనే లక్ష్యంతో బ్యాగ్‌ ఫ్రీ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో 2010 జులై 3 నుంచి అంతర్జాతీయ ప్లాస్టిక్‌ సంచి రహిత దినం నిర్వహిస్తున్నారు.’’

మానవ మనుగడకు ప్లాస్టిక్‌ వినియోగం ప్రమాదకరంగా పరిణమించింది. అందులో పాలిథిన్‌ సంచులు సింహభాగం ఆక్రమించాయి. ఒకసారి వాడి పడేసిన ప్లాస్టిక్‌ సంచులు పర్యావరణానికి పెను విఘాతం కలిగిస్తుండగా పశుపక్ష్యాదులకు ప్రాణసంకటమవుతున్నాయి. నిషేధిత పాలిథిన్‌ సంచులను వాడొద్దని పర్యావరణవేత్తలు, సామాజిక ఉద్యమకారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు, సంస్థలు ఇందులో భాగస్వాములవుతున్నారు. నేడు ప్రపంచ ప్లాస్టిక్‌ బ్యాగ్‌ రహిత దినం సందర్భంగా ‘న్యూస్‌టుడే’ కథనం..

మధిరలో సమాజ హితులు

ప్లాస్టిక్‌ రహిత సమాజ నిర్మాణం కోసం మధిరలో సామాజిక సేవకుడు లంకా కొండయ్యతోపాటు పలువురు పర్యావరణ హితులు తమ వంతు బాధ్యతగా స్ఫూర్తి నింపుతున్నారు. ప్రతిరోజు ఉదయపు నడకలోనూ కన్పించిన ప్లాస్టిక్‌ వస్తువులు, సంచులను ఏరి వాటిని ధ్వంసం చేస్తున్నారు. దశాబ్దన్నర కాలంగా ప్లాస్టిక్‌ వినియోగంతో కలిగే అనర్థాలపై ప్రజలకు విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మధిరకు చెందిన పలువురు శుభకార్యాలు, దేవాలయాల వద్ద జరిగే వేడుకల్లో భక్తులకు, మహాశివరాత్రి జాతర సమయంలో వచ్చిన వారికి ఇలా ఇప్పటికి వేలాదిగా ప్లాస్టిక్‌ రహిత సంచులను ఉచితంగా అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.


మూగజీవాలకు ప్రాణాంతకం

నిత్యం వినియోగించే ప్లాస్టిక్‌ సంచులను రహదారి పక్కన పడేయడంతో వాటిని పశువులు తింటూ అనారోగ్యం బారిన పడుతున్నాయి. ఒక్కోసారి మృత్యువాత పడుతున్నాయి. జిల్లాలో గతంలో జరిగిన పలు సంఘటనలు ఇందుకు నిదర్శనాలవుతున్నాయి. ప్లాస్టిక్‌ సంచులను మురుగు కాలువల్లో పడేస్తుండటంతో పేరుకుపోయి మురుగు ప్రవహించకుండా పారిశుద్ధ్య సమస్య నెలకొంటోంది. వాటిలో ఆహార పదార్థాలు కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. ప్రపంచంలో సగటున 12 నిమిషాలు వినియోగించే ఒక ప్లాస్టిక్‌ సంచి వెయ్యి సంవత్సరాల వరకు కాలుష్యకారకమవుతుందని ఓ సంస్థ పరిశోధనలో చెప్పింది.


పాత దుస్తులతో సంచులు కుట్టి అందజేస్తున్నా

- కోమటి లత, ఆజాద్‌రోడ్డు

పాత దుస్తులతో సంచులు తయారీ చేస్తుంటా. సామాజిక సేవకుడు లంకా కొండయ్య సేకరించిన పాత దుస్తులను అందిస్తుంటే వాటితో ఇలా సంచులు తయారీ చేసి ఇస్తుంటా. ప్లాస్టిక్‌ రహిత సమాజ నిర్మాణం కోసం నా వంతుగా కృషి చేస్తున్నా. దర్జీగా జీవనం సాగిస్తూనే మరో వైపు సమాజ హితం కోసం ఇలా సంచులు కుట్టి ఉచితంగా అందజేస్తున్నా.


తయారీనే నిషేధించాలి

-పుల్లఖండం చంద్రశేఖర్, మధిర

పర్యావరణ పరిరక్షణ కోసం పెద్దఎత్తున ఉద్యమమే జరగాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ప్లాస్టిక్‌ కవర్ల తయారీ కంపెనీలను నిషేధిస్తేనే వినియోగం నూరు శాతం తగ్గుతుంది. ప్రభుత్వాలు ఈ దిశగా దృష్టి సారించాలి. నా వంతుగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్‌ రహిత సంచులను బస్టాండ్, రైల్వేస్టేషన్లతోపాటు వన సమారాధన వేదికల్లో పంపిణీ చేస్తున్నా. ప్లాస్టిక్‌తో అనర్థాలు, వస్త్ర, జనపనార సంచులతో ప్రయోజనాలపై కరపత్రాలను రూపొందించి అందజేస్తున్నా. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని