logo

అశ్రునయనాలతో రైతు అంత్యక్రియలు

రైతు బోజడ్ల ప్రభాకర్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Published : 03 Jul 2024 02:17 IST

అన్నదాత కుటుంబాన్ని ఆదుకోవాలి: మాజీ ఎంపీ నామా

రైతు బోజడ్ల ప్రభాకర్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పాలనలో ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. 

చింతకాని, న్యూస్‌టుడే: తన పొలాన్ని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం బలవన్మరణానికి పాల్పడిన చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన బోజడ్ల ప్రభాకర్‌ అంత్యక్రియలు మంగళవారం పోలీస్‌ బందోబస్తు మధ్య జరిగాయి. వివరాలు.. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష అనంతరం ప్రభాకర్‌ మృతదేహాన్ని ప్రొద్దుటూరుకు సాయంత్రం సమయంలో తీసుకొచ్చారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయన్న సమాచారంతో వైరా ఏసీపీ రెహ్మాన్, సీఐ సాగర్‌ ఆధ్వర్యంలో వైరా, ఖమ్మం డివిజన్‌కు సంబంధించిన పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రొద్దుటూరులో బందోబస్తు నిర్వహించారు. మృతదేహం ఇంటి వద్దకు రాగానే కుటుంబీకులు, స్నేహితులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనకు కారణమైన వారికి కఠినంగా శిక్షించాలని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాకు దిక్కెవరయ్యా..

‘వృద్ధులమైన మాకు, అనారోగ్యంతో బాధపడుతున్న కోడలు, ఇద్దరు చిన్నారులకు ఎవరు దిక్కయ్యా..’ అంటూ మృతుడి తండ్రి వీరభద్రం రోదిస్తున్న తీరు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించింది. ఉన్న పొలం మొత్తాన్ని కక్షతో ధ్వంసం చేశారు. యాచించటం తప్ప.. తనకు మరో మార్గం లేదని అక్కడకి వచ్చిన వారికి చిన్నారులైన మృతుడి పిల్లలను చూపుతూ వీరభద్రం విలపించారు. వీడియోలో తన కుమారుడు ఎవరి పేర్లు అయితే చెప్పారో.. వారందరినీ శిక్షించండని ఆయన పోలీసులను వేడుకున్నాడు.


పది మందిపై కేసు నమోదు

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: బోజెడ్ల ప్రభాకర్‌(45) బలవన్మరణానికి పాల్పడిన సంఘటనపై ఖమ్మం ఖానాపురం హవేలి పోలీసు స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్‌ భానుప్రకాశ్‌ కథనం ప్రకారం... తమ 7 ఎకరాల భూమిలో యంత్రాలతో తవ్వకాలు జరిపి దౌర్జన్యం చేశారని ఆరోపిస్తూ ప్రభాకర్‌ ఖమ్మం నగర శివారు చెరుకూరి గార్డెన్స్‌ సమీపంలో సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి వీరభద్రయ్య ఫిర్యాదు మేరకు కూరపాటి కిశోర్, పెంట్యాల రామారావు, గుర్రం నాగమల్లేశ్వరరావు, మొగిలి ముత్తయ్య, మొగిలి శ్రీను, వేల్పుల కోటయ్య, షేక్‌ సిద్ధయ్య, వేల్పుల నరసింహారావు, షేక్‌ సైదులు, మొగిలి మాధవరావులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్‌ వివరించారు. ప్రభాకర్‌ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

వీడియో చిత్రీకరించిన యువకుడి గుర్తింపు?

చింతకాని మండలంలోని పొద్దుటూరుకు చెందిన రైతు బోజెడ్ల ప్రభాకర్‌ ఆత్మహత్యకు  ముందు మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. ఈ వీడియో సెల్ఫీ వీడియో కాదని.. మరొకరు తీసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో అదే జరిగి ఉంటుందని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. రైతు ఆత్మహత్యకు ముందు మాట్లాడుతున్న వీడియోను ఒకరు చిత్రీకరిస్తుండగా.. వీరిద్దరిని చిత్రీకరించిన మరో వీడియో పోలీసులకు చేరినట్లు సమాచారం.

ఆత్మహత్యేనా..?: మృతుడు ప్రభాకర్‌ ఆత్మహత్య చేసుకున్నాడా..? లేదా మరేదైనా జరిగిందా? అనే కోణంలో పోలీసుల విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా ఖానాపురం హవేలీ పోలీసులు మంగళవారం సాయంత్రం సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించినట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని