logo

కారు లిఫ్ట్‌ అడిగి.. కళ్లలో కారం కొట్టి

కారులో వస్తున్న వ్యక్తిని ప్రధాన రహదారిపై సార్‌ ప్లీజ్‌ లిప్ట్‌ ఇవ్వండని అడిగి.. కారు ఆపిన వెంటనే ఆ వ్యక్తిని బెదిరించి దుండగులు సొత్తు ఎత్తుకెళ్లిన ఘటన సోమవారం రాత్రి లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు సమీప ప్రధాన రహదారిపై చోటుచేసుకొంది.

Published : 03 Jul 2024 08:11 IST

లోతువాగు సమీపంలో దారి దోపిడీ

లక్ష్మీదేవిపల్లి, న్యూస్‌టుడే: కారులో వస్తున్న వ్యక్తిని ప్రధాన రహదారిపై సార్‌ ప్లీజ్‌ లిప్ట్‌ ఇవ్వండని అడిగి.. కారు ఆపిన వెంటనే ఆ వ్యక్తిని బెదిరించి దుండగులు సొత్తు ఎత్తుకెళ్లిన ఘటన సోమవారం రాత్రి లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు సమీప ప్రధాన రహదారిపై చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. టేకులపల్లి మండలానికి చెందిన వాసాల తిరుపతి వ్యక్తిగత పనిమీద తన కారు నడుపుకొంటూ ఒక్కడే సోమవారం రాత్రి పాల్వంచ వెళ్తున్నాడు. లోతువాగు సమీపంలోని అటవీ ప్రాంతం ఉన్న ప్రధాన రహదారిపై ఓ వ్యక్తి నిల్చోని కారు ఆపి సార్‌ ప్లీజ్‌ లిప్ట్‌ ఇవ్వండని ప్రాధేయపడ్డాడు. దీంతో అతనికి లిప్ట్‌ ఇద్దామని తిరుపతి కారు అద్దం తీశాడు. ఆ అంగతకుడు వెంటనే తిరుపతి కళ్లలో కారంపొడి కొట్టాడు. ఇంతలోనే ముఖానికి మాస్క్‌లు ధరించిన మరో ముగ్గురు వ్యక్తులు కారును చుట్టుముట్టారు. కత్తులతో తిరుపతిని బెదిరించి అతని వద్ద నుంచి రూ.15 వేలు నగదు, చేతికున్న రెండు ఉంగరాలు, మెడలోని చైన్‌ కలిపి మొత్తమ్మీద రూ.1.49 లక్షల సొత్తు దోచుకొని అక్కడ నుంచి పరారయ్యారు. తమకు అందిన సమాచారంతో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్‌ రెహ్మాన్, చుంచుపల్లి సీఐ రాయల వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి క్లూస్‌ టీంతో అక్కడకు చేరుకొన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితుడి నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని