logo

గోబెల్స్‌ను మించిన మోదీ: నారాయణ

అబద్దాలు చెప్పడంలో ప్రధాని మోదీ గోబెల్స్‌ను మించిపోయాడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఎద్దేవా చేశారు. ఖమ్మంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

Published : 30 Jun 2024 01:55 IST

మాట్లాడుతున్న కె.నారాయణ. పక్కన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు 

ఖమ్మం మామిళ్లగూడెం: అబద్దాలు చెప్పడంలో ప్రధాని మోదీ గోబెల్స్‌ను మించిపోయాడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఎద్దేవా చేశారు. ఖమ్మంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వాస్తవికత లేకపోవడంతోనే భాజపా 305 సీట్ల నుంచి 240 స్థానాలకు పడిపోయిందని చెప్పారు. బిహార్, ఏపీ సీఎంలు నీతీశ్‌కుమార్, చంద్రబాబునాయుడిపై ఆధారపడి పరిపాలన సాగించాల్సిన దుస్థితి వచ్చిందని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బలమైన ప్రతిపక్షం కలిగిన ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. కార్మిక చట్టాలను కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా మార్చారని, వాటిని సవరించాలని కోరారు. తెలంగాణలో భారాస ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నంత మాత్రాన విపక్షం లేకుండా పోదని అభిప్రాయపడ్డారు. కేసీఆర్, చంద్రబాబునాయుడు, రాజశేఖర్‌రెడ్డి వంటి నేతలు విపక్ష సభ్యులను చేర్చుకున్నారని, ఆయా సందర్భాల్లో ప్రజలు విపక్షాల వైపు మళ్లారని గుర్తుచేశారు. తెలంగాణలో భాజపా బలపడేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వవద్దని సూచించారు. రాష్ట్ర సమితి సమావేశాల్లో పార్టీ కార్యక్రమాలను చర్చించుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. పార్టీ జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి, కార్యవర్గ సభ్యుడు ఎస్‌కె.సాబీర్‌పాషా, రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్‌రెడ్డి, ఎస్‌కె.జానీమియా పాల్గొన్నారు.

కమ్యూనిస్టులు ప్రజల పక్షాన నిలబడాలి: కూనంనేని

పాలకవర్గాలు ప్రజా సమస్యలను విస్మరిస్తే కమ్యూనిస్టులు ప్రజలు పక్షాన పోరాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. ఖమ్మంలోని ఆర్‌ఆర్‌ఆర్‌ వేడుకల మందిరంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌ అధ్యక్షతన శనివారం నిర్వహించిన పార్టీ రాష్ట్ర సమితి సమావేశాల్లో ఆయన మాట్లాడారు.  దేశ ప్రజలు గత ఎన్నికల్లో మతోన్మాదానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని, దీన్ని గుర్తించి విద్వేషాలకు తిలోదకాలివ్వాలని హితవు పలికారు. పార్టీ సభ్యులకు నిరంతర రాజకీయ, సైద్ధాంతిక శిక్షణ ఇవ్వనున్నట్లు, గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలను వాడవాడలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ కార్యదర్శులు కె.నారాయణ, అజీజ్‌పాషా, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ   వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు