logo

విద్య, వైద్యానికి పెద్దపీట

ప్రజారోగ్యం, ఉన్నత విద్యను మెరుగుపరచే దిశగా నిధులతో పాటు వైద్య సిబ్బంది నియామకాలకు సర్కారు పచ్చజెండా ఊపింది. ఇదే సందర్భంగా ‘నమ్మ క్లినిక్‌’లలో ప్రయోగశాలల ఏర్పాటుకు తగిన నిధులు విడుదల చేసింది.

Published : 05 Jul 2024 04:00 IST

ఈనాడు, బెంగళూరు : ప్రజారోగ్యం, ఉన్నత విద్యను మెరుగుపరచే దిశగా నిధులతో పాటు వైద్య సిబ్బంది నియామకాలకు సర్కారు పచ్చజెండా ఊపింది. ఇదే సందర్భంగా ‘నమ్మ క్లినిక్‌’లలో ప్రయోగశాలల ఏర్పాటుకు తగిన నిధులు విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక సంఘాల కాలపరిమితిని పెంచుతూ వచ్చే ఆర్థిక సంవత్సరానికి అవసరమైన సిఫార్సులు సిద్ధం చేసేందుకు అవకాశం కల్పించింది. రిజిస్ట్రేషన్, ముద్రణ పన్నులు పెంచి ఆ స్థాయిలో ఆర్థిక వనరులు సమకూర్చుకునే క్రమంలో అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా పారదర్శకత పాటించే ప్రయత్నం చేసింది. గురువారం ముఖ్యమంత్రి నేతృత్వంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో వీటితో పాటు మరిన్ని కీలకమైన తీర్మానాలు చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి..

వైద్యానికి మెరుగులు..

నగరాల్లో ప్రజారోగ్యాన్ని మెరుగురచే దిశగా ఏర్పాటు చేసిన నమ్మ క్లినిక్లలో రక్తపరీక్షలను చేపట్టే ప్రయోగశాలల కోసం అవసరమైన సామగ్రిని, సాంకేతిక ఉపకరణాలను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.53.66 కోట్లతో ఔషధాలను కొనుగోలు చేయాలని తీర్మానించారు. కేటీపీపీ నియమాల ప్రకారం ఈ ఔషధాలు కొనుగోలు చేస్తారు. 2024-25 బడ్జెట్‌లో ప్రకటించిన ప్రకారం అనేకల్, హొసకోటె, ఖానాపుర, నెలమంగల, శిరహట్టి, శృంగేరి, యళందూరు తాలూకాల్లోని 100 పడకల ఆస్పత్రులను రూ.256.15 కోట్లతో ఉన్నతీకరిస్తారు. ఇందుకు నాబార్డ్‌ నిధులను వినియోగిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు జాతీయ ఆరోగ్య మిషన్‌ నిధులతో 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలుగా ఉన్నతీకరణ, ఇందులో వివిధ స్థాయిలో 400 వైద్య సిబ్బందిని నియమించటం, ఆరోగ్య కేంద్రాల తరలింపు ప్రక్రియ చేపడతారు.

అక్రమాలకు అడ్డుకట్ట

పెరిగిన రిజిస్ట్రేషన్, ముద్రణ రుసుములు, వాటి వనరులు సక్రమంగా ప్రభుత్వ ఖజానాకు చేర్చేందుకు సర్కారు తగిన చర్యలు తీసుకోనుంది. ఇప్పటి వరకు సబ్‌రిజిస్ట్రార్లను నేరుగా బదిలీ చేసే వ్యవస్థను సవరించి కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీ చేయాలని నిర్ణయించారు. ఒకే ప్రాంతంలో ఐదేళ్లకు మించి విధులు నిర్వహించకుండా వారిని బదిలీ చేయటం, ఈ స్థాయి కంటే తక్కువ స్థాయి సిబ్బందికి కూడా కౌన్సెలింగ్‌ చేపట్టాలన్న నిబంధన అమలు చేయనున్నారు. కార్పొరేషన్‌ స్థాయిలో బదిలీలు ఆయా శాఖలే చేపడతాయి.

పంచాయతీరాజ్, నగర స్థానిక సంస్థల ఎన్నికల విభాగాలు సిబ్బంది, పాలనా సంస్కరణల (డీపీఏఆర్‌) శాఖ పరిధిలోనికి తేవాలన్న డాక్టర్‌ జస్టిస్‌ భక్తవత్సల కమిషన్‌ సిఫార్సును సర్కారు తిరస్కరించాలని తీర్మానించింది. ప్రస్తుతం నగరాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ శాఖల పరిధిలోనే ఉన్న ఎన్నికల విభాగాలను ఆయా శాఖల్లోనే ఉండే విధానాన్ని కొనసాగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

ఆర్టీసీ కష్టాలకు చెక్‌

కరోనా సమయంలో తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొన్న కేఎస్‌ఆర్టీసీని ఆదుకునేందుకు సర్కారు పలు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆ సమయాన్ని ప్రత్యేక సందర్భంగా పరిగణించి సొంత కట్టడాలు లేని పలు జిల్లాల కేఎస్‌ఆర్టీసీ డిపోలను నిర్మించేందుకు కర్ణాటక భూసేకరణ నిబంధనలను సవరించాలని తీర్మానించారు. తుమకూరు, శివమొగ్గ, హుబ్బళ్లి, బెళగావి తదితర జిల్లాల్లో భూములను కేటాయించాలని తీర్మానించారు. ఇక బీఎంటీసీ పరిధిలో 840 బీఎస్‌-6 డీజిల్‌ బస్సులను రూ.363 కోట్లతో కొనుగోలు చేయాలని తీర్మానించారు. ప్రస్తుతం సేవలందిస్తున్న బస్సుల మరమ్మతుల కోసం రూ.10 కోట్ల అదనపు నిధులు కేటాయించారు.

మరిన్ని తీర్మానాలు..

  • కేజీఐడీ బీమా పథకం ద్వారా పాలసీదారులకు 2018-20 ఏడాది ద్వైవార్షికానికి రూ.వెయ్యికి రూ.80ల చొప్పున బోనస్‌లు, 2020 ఏప్రిల్‌ నుంచి 2022 మార్చి వరకు కాలపరిమితి మీరిన వారికి కూడా ఇదే స్థాయిలో మధ్యంతర బోనస్‌ను ఇవ్వాలని నిర్ణయించారు.
  • రాష్ట్ర ఐదో ఆర్థిక సంఘం కాలపరిమితిని 2025 ఫిబ్రవరి వరకు విస్తరించి ఆ నివేదికను ఈ ఏడాది డిసెంబరులోగా ఇవ్వాలని ఆదేశించారు.
  • కర్ణాటక పరీక్ష ప్రాధికార ప్రస్తుత భవనాన్ని ఉన్నతీకరించటం, అదనపు సదుపాయాలతో ఇతర కట్టడాల నిర్మాణానికి రూ.30 కోట్ల నిధులు, కొప్పళ జిల్లా తళకల్‌ ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల రెండో దశ పనులకు రూ.59.32 కోట్ల నిధులకు పాలనాపరమైన ఆమోదాన్ని తెలిపారు.
  • కేపీఎస్‌సీ పరిధిలో సీనియర్‌ పీడీఓ, పీడీఓ, కార్యదర్శి, గ్రేడ్‌-1,2, తదితర పోస్టుల నియామకాల్లో సవరణలపై ఆక్షేపణల స్వీకరణ, కౌన్సెలింగ్‌కు అనుమతించారు.
  • మహాత్మాగాంధీ నగర వికాస పథకం రెండో దశలో రాష్ట్రంలోని 10 పాలికె పరిధిలో రూ.2వేల కోట్ల అంచనా వ్యయంలో 7.5 శాతం యూఐడీఎఫ్‌ నుంచి రుణాల ద్వారా, 85 శాతం వ్యయాన్ని పురపాలక శాఖ నుంచి టెండర్ల ద్వారా సేకరించాలని తీర్మానించారు.
  • బీబీఎంపీ కార్యాలయంలో అగ్నిప్రమాదంలో మరణించిన సూపర్‌వైజర్‌ సి.ఎం.శివకుమార్, ఏఈ కుటుంబానికి రూ.50 లక్షలు చొప్పున ఆర్థిక సాయం, వారి కుటుంబాల్లో అర్హులకు ఉద్యోగం, గాయపడిన వారికి పరిహారాన్ని ఇవ్వాలని తీర్మానించారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని