logo

తీరం.. కకావికలం

తీరప్రాంత జిల్లాలతో పాటు కొడగు, చిక్కమగళూరు, శివమొగ్గ జిల్లాలను వానదేవుడు చుట్టుముట్టాడు. వారం రోజులుగా కొనసాగుతున్న భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింప చేస్తున్నాయి.

Published : 05 Jul 2024 03:57 IST

కొనసాగుతున్న భారీ వర్షాలు

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : తీరప్రాంత జిల్లాలతో పాటు కొడగు, చిక్కమగళూరు, శివమొగ్గ జిల్లాలను వానదేవుడు చుట్టుముట్టాడు. వారం రోజులుగా కొనసాగుతున్న భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింప చేస్తున్నాయి. వర్ష తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. హొన్నావర సమీపంలోని వర్నకేరి గ్రామం వద్ద జాతీయ రహదారిపై కొండచరియలు విరిగి పడ్డాయి. కార్వార నుంచి సాగర మీదుగా శివమొగ్గకు వెళ్లే జాతీయ రహదారిపై వాహన సంచారాన్ని ఇతర మార్గాలకు మళ్లించారు. సిరసి, యల్లాపుర, సిద్ధాపురల్లో పాత ఇళ్లు, శిథిలావస్థకు చేరుకున్న కట్టడాలు వర్షంతో మరింత దెబ్బతిన్నాయి. సిరసి- కుమట మధ్య అఘనాశిని నది జోరందుకోవడంతో రాకపోకలు స్తంభించాయి. పలు వంకలు ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. ఈ మార్గంలో వెళుతున్న ఒక బస్సు ప్రవాహంలో చిక్కుకుంది.

స్థానికులు ముందుకు వచ్చి బస్సులోని ప్రయాణికులను రక్షించారు. ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యల్లాపుర తాలూకా నాతోడి జలపాతం వద్దకు పర్యాటకులు రాకుండా నిర్బంధాన్ని విధించారు. భట్కళలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హొన్నావరలో గుండబాళె నది ప్రమాద స్థితిని దాటి ప్రవహిస్తోంది. తాలూకాలోని ఐదు గ్రామాలకు ప్రధాన రహదారితో సంబంధాలు తెగిపోయాయి. ప్రవాహ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని హొన్నావర తాలూకాలోని పాఠశాలలకు ఉత్తర కన్నడ జిల్లాధికారి గంగూబాయి మానకర్‌ శుక్రవారం సెలవు ప్రకటించారు. ఉడుపి జిల్లా బైందూరు తాలూకాలోని పాఠశాలలకు క్షేత్ర విద్యాశాఖ అధికారి సెలవు ఇచ్చారు. బైందూరు సమీప కటీలులో దుర్గాపరమేశ్వరి ఆలయ గర్భగుడిలోకి వరదనీరు చేరుకుంది.

కొడగు జిల్లా కుశాలనగర తాలూకా రంగసముద్రంలోని చిక్లిహొళె జలాశయం నిండిపోయింది. ఇందులో అర టీఎంసీ నీటిని మాత్రమే నిలువ చేసుకునేందుకు అవకాశం ఉంది. అర్ధచంద్రాకారంలో ఉన్న కట్ట పైనుంచి నీరు కిందకు జాలువారడాన్ని వీక్షించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల వారు జలాశయం వద్దకు వస్తున్నారు. జలాశయానికి ఎమ్మెల్యే మంథర్‌ గౌడ వాయినాన్ని సమర్పించారు. ఉడుపి జిల్లా కొల్లూరులో ఇంటిపైకి కొండరాళ్లు పడడంతో గోడ కూలి అంబ (45) అనే మహిళ మరణించింది. ఆగుంబె ఘాట్లో వెళుతున్న ఓమ్నిపై భారీ వృక్షం పడడంతో అది ధ్వంసమైంది. అదృష్టవశాత్తు కారు నడుపుతున్న వ్యక్తి, సహ ప్రయాణికుడు చిన్నపాటి గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

చిక్కమగళూరు, కొడగు జిల్లాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. తుంగ, కావేరి నదుల్లో ప్రవాహం పెరిగింది. నది పక్కనే ఉన్న వ్యవసాయ భూముల్లోకి నీరు చేరుకుంది. గాజనూరు వద్ద తుంగా జలాశయం నిండడంతో 22 క్రష్ట్‌ గేట్లలో 14 గేట్లను పాక్షికంగా పైకి ఎత్తారు. కేఆర్‌ఎస్‌లో ఇన్‌ఫ్లో పెరగడంతో గురువారం మధ్యాహ్నానికి 99.30 అడుగుల ఎత్తుకు నీరు చేరుకుంది. బెళగావి జిల్లా ఖానాపుర తాలూకాలో కణకుంబి, జాంబోటి, నాగరగాళి, భీమగఢ, లోండా అటవీ ప్రదేశాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో మలప్రభ, మహాదాయి, పండరి నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఆదివారం వరకు, తీరప్రాంత జిల్లాల్లో మంగళవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని