logo

సిద్ధు సర్కారుపై పోరాటం

దేశంలో ఎన్‌డీఏ కూటమి వరుసగా మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం వెనుక కార్యకర్తల కృషి, రాష్ట్రంలోని కార్యవర్గ బృందం సేవలు అనితర సాధ్యమని కమలదండు కొనియాడింది.

Published : 05 Jul 2024 03:52 IST

భాజపా సమావేశంలో తీర్మానం

ఈనాడు, బెంగళూరు : దేశంలో ఎన్‌డీఏ కూటమి వరుసగా మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం వెనుక కార్యకర్తల కృషి, రాష్ట్రంలోని కార్యవర్గ బృందం సేవలు అనితర సాధ్యమని కమలదండు కొనియాడింది. బెంగళూరు ప్యాలెస్‌ మైదానంలో భాజపా ప్రత్యేక కార్యవర్గ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో భాజపా కేంద్ర విభాగం నుంచి రాధామోహన్‌దాస్, రాష్ట్ర అధ్యక్షుడు బి.వై.విజయేంద్ర, పార్లమెంటరీ మండలి సభ్యుడు బి.ఎస్‌.యడియూరప్ప, విపక్ష నేత ఆర్‌.అశోక్‌తో పాటు కోర్‌ కమిటీ సభ్యులు, సీనియర్‌ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదే సందర్భంగా అవినీతి సర్కారు తొలగిపోవాలని, రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ధరల పెంపు, అక్రమాలపై ప్రస్తావన తెచ్చేలా తీర్మానాలు చేశారు.

విజయం అనితరసాధ్యం: కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి హిందూ వ్యతిరేక విధానాలతో పాటు ఆచరణ సాధ్యం కాని గ్యారంటీల సాకుతో గెలవాలని చూసినా ప్రజలు గుణపాఠం చెప్పారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బి.వై.విజయేంద్ర ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సర్కారు ఉందా? లేదా? అన్న సంశయం వచ్చేలా పాలన కొనసాగుతోందన్నారు. ‘భాజపా గతంలో ఎన్నో పథకాలను అమలు చేసినా కాంగ్రెస్‌ ప్రకటించిన ఐదు గ్యారంటీలను నమ్మి 2023లో ప్రజలు గెలిపించారు. ఏడాదిలోగానే వారి హామీలన్నీ బూటకాలని తేలిపోయింది. ఎన్‌డీఏ కూటమి 145 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ కంటే ముందంజలో ఉంది. గతంలో కంటే ఎక్కువ ఓట్ల శాతాన్ని సాధించింది. కేవలం తొమ్మిది ఎంపీ స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్‌ భాజపాను విమర్శించే నైతికతను కోల్పోయింది. అధికార దర్పంతో వాల్మీకి ఎస్‌టీ అభివృద్ధి మండలిలో అక్రమాలు, రూ.4 వేల కోట్ల ముడా అక్రమాలకు పాల్పడిన సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలతో కాలం వెళ్లబుచ్చింది’ అని ధ్వజమెత్తారు. రామేశ్వరం కెఫే పేలుళ్లు, విధానసౌధలో పాకిస్తాన్‌ అనుకూల నినాదాలు, 900 మంది రైతుల ఆత్మహత్యలు, మేకెదాటు కోసం పాదయాత్ర చేసినా బడ్జెట్‌లో రూపాయి కూడా అట్టిపెట్టని వైనంపై ఆరోపణలు గుప్పించారు. 

  • భాజపా రాష్ట్ర ఎన్నికల బాధ్యుడు రాధామోహన్‌దాస్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ సర్కారు మూడోసారి ఏర్పాటయ్యేందుకు దోహదపడిన కార్యవర్గానికి అభినందనలన్నారు. ముడా అక్రమాలపై పోరు కొనసాగించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోనూ రాజీనామా చేయించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశంలో 14 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ సర్కారు లేదన్నారు. బాజపా ఏటేటా ఓటు శాతాన్ని పెంచుకుని మూడోసారి సర్కారు ఏర్పాటు చేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి 19 స్థానాల్లో గెలిచిందని, కాంగ్రెస్‌ మంత్రులున్న 17 చోట్ల ఆ పార్టీ ఓటమి పాలైందని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందన్నారు. 
  • తీర్మానాలు: ప్రధానిగా నరేంద్ర మోదీ హ్యాట్రిక్‌ విజయాలు సాధించినందుకు అభినందిస్తూ కార్యవర్గ సమావేశంలో మాజీ స్పీకర్‌ విశ్వేశ్వర హెగ్డేకాగేరి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మాజీ మంత్రి శశికళాజొల్లె మద్దతు తెలిపారు. అభివృద్ధి రహిత కర్ణాటక సర్కారు వైదొలగాలని విపక్ష నేత ఆర్‌.అశోక్‌ మరొక తీర్మానాన్ని, ధరలు, పన్నుల పెంపు, అక్రమాలపై విధానసభలో ప్రస్తావించాలన్న మరొక తీర్మానాన్ని ఎమ్మెల్సీ సి.టి.రవి ప్రతిపాదించారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని