logo

రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రైతు దుర్మరణం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లి వద్ద గురువారం ద్విచక్రవాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో కర్ణాటకకు చెందిన రైతు గాదిలింగప్ప(28) దుర్మరణం చెందారు.

Updated : 05 Jul 2024 03:50 IST

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లి వద్ద గురువారం ద్విచక్రవాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో కర్ణాటకకు చెందిన రైతు గాదిలింగప్ప(28) దుర్మరణం చెందారు. పోలీసుల వివరాల మేరకు.. కర్ణాటకలోని బళ్లారి జిల్లా సోమసముద్రంకు చెందిన గాదిలింగ, వీరేష్‌ మిరప విత్తనాలు తీసుకొని కళ్యాణదుర్గంలోని నర్సరీ యజమానికి ఇచ్చేందుకు వచ్చారు. అనంతరం వారు తిరిగి వెళ్తుండగా గూబనపల్లి వద్ద ఎదురుగా వస్తున్న భారీ వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం 108లో కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించగా గాదిలింగ చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరేష్‌కు కుడికాలు విరిగి పలు చోట్ల తీవ్ర గాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


నృత్యం చేస్తూ కింద పడి యువకుడు మృతి

చెళ్లకెర(చిత్రదుర్గం),న్యూస్‌టుడే: హొసదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ కేంద్రంలో బ్రేక్‌ డ్యాన్స్‌ నృత్యం చేస్తూ వేదికపై నుంచి కింద పడి గాయపడిన యువకుడు ఖలందర్‌ (23) ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎగ్జిబిషన్‌ నిర్వాహకులపై హొసదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  


డెంగీతో ఆరోగ్య శాఖ ఉద్యోగి విషాదాంతం

మైసూరు, న్యూస్‌టుడే : హుణసూరు తాలూకా గురుపుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న నాగేంద్ర (34) అనే ఉద్యోగి డెంగీతో మరణించారు. మైసూరు జిల్లాలో 479 క్రియాశీలక కేసులు ఉన్నాయి. ఇంటి ఆవరణలో దోమలు లేకుండా చూసుకోవడం, దోమతెరలు కట్టుకోవాలని సూచిస్తూ ఆరోగ్య శాఖ ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు గ్రామాల్లో జాగృతి కల్పిస్తున్నారు. హాసన జిల్లా హొళెనరసీపుర తాలూకా గుడ్డనహళ్లి గ్రామంలో డెంగీతో కళాశ్రీ (11) అనే బాలిక మృతి చెందింది. వారం నుంచి జ్వరంతో ఇబ్బంది పడుతున్న ఆమెను చికిత్స కోసం మొదట హొళెనరసీపుర ప్రాథమిక చికిత్స కేంద్రంలో చేర్పించారు. డెంగీ అని గుర్తించిన అనంతరం హిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె బుధవారం సాయంత్రం మరణించింది. అరకలగూడులో అక్షత (13), హళ్లి మైసూరులో వర్షిక (8) కూడా ఇదే వారం డెంగీతో మరణించారు. హాసన జిల్లాలో 205 మంది చికిత్స తీసుకుంటుండగా, 6204 మందికి వ్యాధి లక్షణాలు కనిపించాయని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.


మోసం చేసి.. పరారయ్యాడు

చిక్కబళ్లాపుర, న్యూస్‌టుడే : ప్రేమ పేరిట తనను వంచించి, గర్భిణిని చేసి పరారైన సూర్యప్రకాశ్‌ (23)ను గాలించి, అప్పగించాలని కోరుతూ ఒక యువతి (23) బాగేపల్లి ఠాణాలో ఫిర్యాదు చేసింది. దేవరగుడిపల్లి గ్రామ పంచాయతీ పరిధి మల్లసంద్రకు చెందిన యువతీయువకులు కళాశాలలో చదువుకుంటున్న సమయంలో పరిచయం ఏర్పడింది. అనంతరం ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటున్నానని నమ్మించి గర్భిణిని చేసి పరారయ్యాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆ యువకుని కోసం బాగేపల్లి ఠాణా పోలీసులు గాలింపు చేపట్టారు. 


ఆ ఐదుగురూ నీటిపాలే

కృష్ణా ఒడ్డున విషాదం

విజయపుర, న్యూస్‌టుడే : పేకాట ఆడుతున్న సమయంలో పోలీసులు దాడి చేస్తారనే భయంతో తెప్ప ఎక్కి కృష్ణా నదిలో మరో ఒడ్డుకు వెళ్లే ప్రయత్నంలో నీట మునిగి మరణించిన ఐదుగురి మృతదేహాలను అగ్నిమాపకదళ సిబ్బంది సాయంతో కొల్హార ఠాణా పోలీసులు వెలికి తీశారు. పుండలీక యంకంచి (30) మృతదేహాన్ని బుధవారం వెలికి తీయగా.. తబ్బయ్య, దశరథ గౌడర్‌ (54), రఫీక్‌ బాంబే, మెహబూబ్‌ వాలికార్‌ మృతదేహాలను గురువారం ఉదయం వెలికి తీశారు. మరణోత్తర పరీక్షల నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు తలా రూ.3 లక్షల పరిహారాన్ని అందిస్తామని మంత్రి శివానంద పాటిల్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని