logo

దడపుట్టిస్తున్న డెంగీ

వానలు ప్రారంభమయ్యే జూన్, జులై నెలలు వచ్చాయంటే అంటు వ్యాధులు చుట్టుముడుతుంటాయి. పూర్తిగా వర్షాలు పడక, అలాగని ఎండలూ లేని వాతావరణం దోమల సంతతి వృద్ధి చెందేందుకు ప్రధాన కారణం.

Updated : 03 Jul 2024 06:21 IST

గతేడాది కంటే 138 శాతం అధికం
మారిన వాతావరణమే కారణమట

ఈనాడు, బెంగళూరు : వానలు ప్రారంభమయ్యే జూన్, జులై నెలలు వచ్చాయంటే అంటు వ్యాధులు చుట్టుముడుతుంటాయి. పూర్తిగా వర్షాలు పడక, అలాగని ఎండలూ లేని వాతావరణం దోమల సంతతి వృద్ధి చెందేందుకు ప్రధాన కారణం. ఆరేళ్ల కాలంలో డెంగీ కేసులను పరిశీలిస్తే ఏటేటా సంఖ్య అమాంతంగా పెరుగుతున్నట్లు తేలింది. ఇటీవల ఆరోగ్య శాఖ వెల్లడించిన గత ఆరు నెలల కేసుల తీరు ఆందోళన కలిగించేలా ఉంది. ఈ కేసుల సంఖ్యలో రాష్ట్ర రాజధాని సింహభాగంలో ఉండగా, చిక్కమగళూరు డెంగీ కేసుల్లో బెంగళూరుతో పోటీ పడుతోంది. బెంగళూరు పాలక బృందంతో పాటు రాష్ట్ర ఆరోగ్యశాఖ రానున్న మూడు నెలల పాటు డెంగీ కేసుల నియంత్రణతో పాటు మరణాలు సంభవించకుండా చూసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయి.

 

ఇటీవల డెంగీపై సమీక్ష సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి

భయపెడుతున్న రాజధాని

జిల్లాల వారీ కేసుల వివరాలను పరిశీలిస్తే బెంగళూరు నగరంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గతేడాది కేసులతో పోలిస్తే కనీసం 50 నుంచి 70 శాతం అదనంగా కేసులు తొలి ఆరు నెలల్లో నమోదు కాగా వలయాల వారీగా కొన్ని ప్రాంతాల్లో సగటున వంద కంటే ఎక్కువగా మునుపటి రోజు కంటే ఎక్కువగా కేసులు వెలుగుచూస్తున్నాయని ఆరోగ్య నివేదిక వెల్లడిస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే బెంగళూరు నగరంలో 66 శాతం అదనంగా కేసులు నమోదయ్యాయి. రోజూ సగటున 90 కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. జూన్‌ 20 నాటికి కేవలం 697 కేసులు నమోదు కాగా ఆ సంఖ్య 28 నాటికి 1,743కు చేరుకుంది. బెంగళూరు దక్షిణ వలయంలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. వారం రోజుల్లో ఈ వలయంలో 129 శాతం, తూర్పు వలయంలో 90.68 శాతం, ఉత్తర వలయంలో 89.9 శాతం, పశ్చిమ వలయంలో 88.31 శాతం కేసులు నమోదయ్యాయి. మహదేవపుర, బొమ్మనహళ్లి, యలహంక తదితర ప్రాంతాల్లో డెంగీ కోరలు చాస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ లక్షణాలతో చేరుతున్న వారి సంఖ్య నిత్యం రెట్టింపవుతున్నట్లు బీబీఎంపీ ఆరోగ్య విభాగం వెల్లడించింది.

జిల్లాల్లోనూ అంతే..

జిల్లాల వారీ గతేడాదితో పోలిస్తే నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. కాఫీనాడు చిక్కమగళూరులో బెంగళూరు తర్వాత అత్యధికంగా 491 కేసులు నమోదయ్యాయి. మైసూరు, హావేరి, శివమొగ్గ తదితర జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. మిగిలిన జిల్లాల్లోనూ వందకు పైగా కేసులు నమోదవుతున్నా ఇక్కడ అనుమానాస్పద కేసులు, గన్యా జ్వరాల కేసులు సమాంతరంగా పెరుగుతున్నట్లు గుర్తించారు. గత ఏడాదితో పోలిస్తే మరణాల సంఖ్య ఆరు నెలల్లో తక్కువగా ఉన్నా వైద్య చికిత్సలు, వ్యవస్థల తీరు క్లిష్టంగా మారితే ప్రస్తుతం నమోదైన మరణాల సంఖ్య రానున్న మూడు నెలల్లో పెరిగే ప్రమాదం లేకపోలేదని ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. లక్షణాలను త్వరగా గుర్తిస్తే తక్షణమే చికిత్సలు ప్రారంభిస్తే మరణాల రేటును తగ్గించే అవకాశాలున్నాయని ఆరోగ్య అధికారులు వెల్లడించారు.

వాతావరణ మార్పే కారణం

బెంగళూరు పరిధిలో నియంత్రణ చర్యల జోరు

బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పది రోజులుగా ముసురుకున్న వాతావరణం కనిపిస్తోంది. బెంగళూరులో వారం రోజుల్లో నమోదైన ఉష్ణోగ్రతల స్థాయి కేవలం 25 డిగ్రీల లోపు ఉండగా, సాయంత్రం వేళల్లో ఇది 20లోపు నమోదవుతోంది. రాష్ట్రంలోనూ సగటున 30లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దక్షిణ కన్నడ, చిక్కమగళూరు పరిసరాల్లోనే కాస్త వర్షాలు కురుస్తున్నా బెంగళూరుతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ముసురుపట్టిన వాతావరణం కనిపిస్తోంది. ఐఐహెచ్‌ఆర్‌ కీటకశాస్త్ర నిపుణుల నివేదిక ప్రకారం ఉన్నపళంగా వాతావరణంలో మార్పులు దోమలు, ఈగల సంతతి వృద్ధికి అనువుగా మారుతోంది. బెంగళూరులో కేసుల తీవ్రత పెరిగేందుకు వాతావరణ పరిస్థితులే కారణమని అభిప్రాయపడుతున్నారు. కేవలం డెంగీ మాత్రమే కాదు మలేరియా, గన్యా వంటి వ్యాధులకు ఇలాంటి వాతావరణం అనువుగా ఉంటుంది.

యాప్‌ల ద్వారా సమీక్ష

బెంగళూరులో ప్రతి రోజూ ఇంటింటా సమీక్ష, డ్రైడే అభియాన్‌లు నిర్వహిస్తాం. ప్రతి ఇంటా డెంగీతో పాటు ఇతర అనారోగ్య లక్షణాలను గుర్తించి వాటిని పీఆర్‌ఐఎస్‌ఎం-హెచ్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తాం. ఈ సాఫ్ట్‌వేర్‌ అనుసంధానంగా రూపొందించిన యాప్‌ల్లోనూ డెంగీనే కాదు వెక్టర్‌-బోర్న్‌ వ్యాధులన్నీ గుర్తిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలికెల్లోనూ ఇదే యాప్‌ల ద్వారా నమోదైన కేసుల లక్షణాల ఆధారంగా నియంత్రణ చర్యలు చేపడతాం. మరో మూడు నెలల వరకు ప్రతి వారం ముఖ్యమంత్రితో సమీక్ష చేపట్టాలని ఆదేశాలున్నాయి.

తుషార్‌ గిరినాథ్, బీబీఎంపీ కమిషనర్‌

కొత్తతరం కీటకాల వృద్ధి

బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గత రెండు వారాలుగా వాతావరణం పూర్తిగా మారింది. ఎండ తీవ్రత లేకపోవటం, వర్షాలు కూడా భారీగా కురవకపోవటంతో దోమలు, ఈగల్లోనూ కొత్త జాతులు వృద్ధి చెందినట్లు గుర్తించాం. ఇందులో డెంగీ, మలేరియా, గన్యా లక్షణాల్లోనూ మార్పులు సంభవించే వీలుంది. ఈ మార్పులను గత ఐదేళ్లుగా గుర్తిస్తున్నాం. అంటే మనం కొత్తరకం వ్యాధులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందే.

డాక్టర్‌ ఎన్‌.ఆర్‌.ప్రసన్నకుమార్, కీటకశాస్త్ర నిపుణుడు, ఐఐహెచ్‌ఆర్‌

ఆరు నెలల్లో కేసులు..

చిక్కమగళూరు : 491

మైసూరు : 479

హావేరి : 451

శివమొగ్గ : 283

చిత్రదుర్గ : 265

దక్షిణకన్నడ : 233

బెళగావి : 177

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని